‘వెయ్యి శుభ ముహూర్తాలు జరిగేటప్పుడు..ఒక్కటి, రెండు ఆటంకాలు రావడం సహజం’. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ చెప్పే ఈ మాటలు ఇప్పుడు హైదరాబాద్ విషయంలో అక్షరాలా నిజమవుతున్నాయి. ఏ పెద్ద సంస్కరణ మొదలైనా దానికి చట్టపరమైన ప్రశ్నలు వస్తాయి. పరిపాలనా సవాళ్లు ఎదురవుతాయి. కొందరు వ్యతిరేకిస్తారు. మరికొందరు కోర్టులను ఆశ్రయిస్తారు.
ఇవన్నీ ప్రజాస్వామ్యంలో సహజమైన ప్రక్రియలే. కానీ అందువల్ల సంస్కరణల లక్ష్యం మారిపోదు. ప్రజల కోసం మొదలైన మార్పు మధ్యలో ఆగిపోదు. అవసరమైన విధానాలలో సవరణలు వస్తాయి. చట్టపరమైన లోపాలు సరిదిద్దుకుంటాయి. కానీ ప్రజా ప్రయోజనం మాత్రం ముందుకు కొనసాగుతూనే ఉంటుంది.
ఇటీవల తెలంగాణ హైకోర్టు హైడ్రా వ్యవహారంపై కొన్ని చట్టపరమైన అంశాలను ప్రస్తావించింది. న్యాయస్థానం తన రాజ్యాంగబద్ధమైన బాధ్యతను నిర్వర్తించింది. అదే సమయంలో ప్రజా ఆస్తులను కాపాడటం కూడా ప్రభుత్వ రాజ్యాంగబద్ధమైన బాధ్యతే. ఈ రెండు ఒకదానికొకటి విరుద్ధమైనవి కావు. రెండింటి లక్ష్యం కూడా ప్రజల ప్రయోజనాలే. అందుకే నాయకత్వం సూచించిన అంశాలను గౌరవిస్తూ, అవసరమైన మార్పులు చేసుకుంటూ హైడ్రా మరింత బలంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది.
నాటి చెరువుల నగరం ఇప్పుడెలా ఉంది?
ఒకప్పుడు హైదరాబాద్ అంటే చెరువుల నగరం. ప్రపంచవ్యాప్తంగా సిటీ ఆఫ్ లేక్స్ అండ్ రాక్స్గా పేరొందిన ఈ మహానగరం సహజసిద్ధమైన జలవనరులతో కళకళలాడేది. వందలాది చెరువులు, వాగులు, నాలాలు నగరానికి జీవనాడులుగా ఉండేవి. వర్షపు నీరు సహజంగా ప్రవహించే వ్యవస్థ ఉండేది. భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండేవి. కానీ దశాబ్దాలకు పైగా జరిగిన నిర్లక్ష్యం ఈ సహజ సంపదను క్రమంగా నాశనం చేసింది. అభివృద్ధి పేరుతో చెరువులు పూడ్చేశారు. నాలాలు ఆక్రమించారు. వాగులపై భారీ భవనాలు నిర్మించారు. ప్రభుత్వ భూములు కబ్జాలకు గురయ్యాయి. 2020లో హైదరాబాద్‌ను అతలాకుతలం చేసిన భారీ వరదలను ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. వేలాది ఇళ్లు, వందల కాలనీలు రోజుల తరబడి నీటిలో చిక్కుకుపోయాయి. కోట్ల రూపాయల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది.
హైడ్రా అసలు లక్ష్యం ఏమిటి ?
హైడ్రా ప్రధాన ఉద్దేశం ప్రజా ఆస్తులను తిరిగి ప్రజలకే అందించడం, ప్రభుత్వ భూములను రక్షించడం, చెరువులను పరిరక్షించడం, నాలాలను పునరుద్ధరించడం, పార్కులను కాపాడటం. ప్రజల అవసరాలకు ఉపయోగపడే భూములను తిరిగి ప్రభుత్వ అధీనంలోకి తీసుకురావడం. ప్రభుత్వ భూమి అంటే అది ప్రభుత్వ అధికారుల వ్యక్తిగత ఆస్తి కాదు. అది ప్రజల ఆస్తి. రేపు అక్కడ ప్రభుత్వ పాఠశాల రావచ్చు. ఆసుపత్రి నిర్మించవచ్చు. పార్కు ఏర్పాటు చేయవచ్చు. రహదారి వేయవచ్చు. భవిష్యత్ తరాలకు అవసరమమ్యే మౌలిక సదుపాయాలు ఏర్పడవచ్చు. అందుకే ప్రభుత్వ భూములను రక్షించడం అంటే ప్రజల భవిష్యత్తును రక్షించడమే.
చెరువులు ఉంటేనే నగరం బతుకుతుంది. చెరువులను ఆక్రమించడం అంటే ఒక నగర భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టడమే. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ పోలీసు శాఖలో క్రమశిక్షణ, నిజాయితీ, చట్టంపట్ల నిబద్ధత కలిగిన అధికారిగా గుర్తింపు పొందారు. హైడ్రా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన ప్రజా ఆస్తుల పరిరక్షణలో వేగం తీసుకురావడానికి ప్రయత్నించారు. అధికారులు మారతారు. ప్రభుత్వాలు మారతాయి. కానీ చెరువులు ప్రజలవే. ప్రభుత్వ భూములు, నాలాలు ప్రజలవే. వాటిని కాపాడటం ప్రభుత్వ బాధ్యత.
సిన్సియర్ ఆఫీసర్ ఏవీ రంగనాథ్
సిన్సియర్ ఆఫీసర్ ఏవీ రంగనాథ్ నేతృత్వంలో హైడ్రా.. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల గుర్తింపు, ఆక్రమణల తొలగింపు, వరద ముప్పు ప్రాంతాల పరిశీలన వంటి అంశాల్లో వేగం పెంచింది. కోట్లాది విలువైన ప్రజల సంపదను కాపాడిన అధికారిగా ఏవీ రంగనాథ్ను అభినందించాల్సిందే. ఒక అధికారిగా వారు తీసుకున్న చర్యల వల్ల కొంతమందికి అసౌకర్యం కలిగినా దీర్ఘకాలంలో లాభపడేది మొత్తం నగరమే. ఎన్ కన్వెన్షన్ వంటి నిర్మాణాలు, గండిపేట చెరువు పరిధిలోని ఆక్రమణలు, బతుకమ్మ కుంట వంటి ప్రజా జలవనరులపై జరిగిన ఆక్రమణలు కోట్ల రూపాయలు విలువైన ఆస్తులను ఆక్రమించుకున్న శక్తిమంతులు కాదా అని సీఎం హైడ్రాను వ్యతిరేకిస్తున్న వారిని ప్రశ్నించారు.
సీఎం విజ్ఞప్తి చేసినట్లుగా, మీడియా కూడా కబ్జాదారుల ప్రచారానికి వేదిక కాకుండా, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించడం అవసరం. ప్రజల ఆస్తులను రక్షించే వ్యవస్థలను బలహీనపరిస్తే భవిష్యత్తు తరాలు తీవ్ర మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అందుకే హైడ్రా వంటి సంస్థలు కాలానుగుణంగా మరింత బలోపేతం కావాలి. ప్రజా ఆస్తుల పరిరక్షణ అనే లక్ష్యం మాత్రం ఎప్పటికీ బలహీనపడకూడదు. హైడ్రా చట్టబద్ధంగా కొనసాగాలి. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటూ మరింత సమర్థంగా కొనసాగాలి. అదే హైదరాబాద్‌కు నిజమైన రక్షణ కవచం.
సురక్షిత నగరం కావాలంటే..
హైడ్రా కేవలం అక్రమ నిర్మాణాల కూల్చివేత కోసం తీసుకొచ్చిన సంస్థ కాదు. హైదరాబాద్‌ను రాబోయే తరాలకు సురక్షితమైన నగరంగా తీర్చిదిద్దే దీర్ఘకాలిక సంస్కరణ. అందుకే సీఎం రేవంత్ రెడ్డి దీన్నీ తమ ప్రభుత్వం తీసుకువచ్చిన అత్యుత్తమ సంస్కరణల్లో ఒకటిగా అభివర్ణిస్తున్నారు. ప్రజా ఆస్తులను కాపాడే ప్రయత్నాలను అడ్డుకోవడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల కొందరు కోర్టు ధిక్కరణ పేరుతో హైడ్రాపై విమర్శలు గుప్పించడం దురదృష్టకరం.
చెరువులు, నాలాలు, కుంటలు, ప్రభుత్వ భూములు, ప్రభుత్వ పార్కులను ఆక్రమించినవారే కోర్టులను ఆశ్రయిస్తూ వ్యవస్థను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారనే సీఎం వాదనలో నిజం లేదందామా? న్యాయవ్యవస్థపై తమ ప్రభుత్వానికి సంపూర్ణ గౌరవం ఉందని, హైకోర్టు ఇచ్చిన సూచనలను పూర్తిగా అధ్యయనం చేసి అవసరమైన చర్యలు తీసుకుంటామని, కోర్టు మార్గదర్శకాలను గౌరవిస్తూ అదే సమయంలో ప్రజా ఆస్తుల పరిరక్షణ లక్ష్యం మరింత సమర్థంగా కొనసాగిస్తామని సీఎం స్పష్టం చేయడం, నగర రక్షణను కోరుకునే ప్రతి ఒక్కరూ ఆహ్వానించదగ్గ పరిణామం.
రేగులపాటి రమ్యారావు, టీపీసీసీ సీనియర్ నాయకురాలు
