కులగణన సరిగా జరిగేనా ? కులాధార జనగణన అంటే కేవలం ఒక ఫారమ్‌‌‌‌‌‌‌‌లో పేరు రాయడం కాదు !

కులగణన సరిగా జరిగేనా ? కులాధార జనగణన అంటే కేవలం ఒక ఫారమ్‌‌‌‌‌‌‌‌లో పేరు రాయడం కాదు !

ఒకే కులానికి చెందినవారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన ప్రజలు.. కానీ ప్రాంతం మారితే పేరు మారుతుంది, గ్రామం మారితే ఉచ్చారణ మారుతుంది, ఉపకులం పేరుతో ఒకరు నమోదు చేస్తే ప్రధాన కులం పేరుతో మరొకరు నమోదు చేస్తారు. ఇలా ఒకే సామాజిక వర్గం వందల పేర్లతో జనగణనలో నమోదైతే, చివరకు ఆ వర్గం అసలు సంఖ్యను ఎలా నిర్ణయిస్తారు? ఇప్పుడు కులాధార జనగణనపై దేశవ్యాప్తంగా చర్చకు కేంద్రబిందువుగా మారుతున్న అసలు ప్రశ్న ఇదే.

కులం వివరాలను నమోదు చేసే సమయంలో ప్రజలు తమ కులం పేరును స్వేచ్ఛగా నమోదు చేసే విధానంపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.  ముందుగా నిర్ణయించిన ప్రామాణిక జాబితా లేకుండా ప్రతి ఒక్కరూ తమకు తెలిసిన విధంగా కులం పేరును నమోదు చేస్తే, ఒకే కులానికి అనేక పేర్లు నమోదయ్యే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విధానం వల్ల కులాల అసలు జనాభా గణాంకాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉందా అన్న ప్రశ్న ఇప్పుడు రాజకీయ, సామాజిక, పార్లమెంటరీ చర్చలకు దారితీస్తోంది.

ఉచ్చారణల్లో తేడాలు, స్పెల్లింగ్ మార్పులు, స్థానిక పేర్లు కూడా నమోదులో ప్రభావం చూపే అవకాశం ఉంది.  ఒకే సామాజిక వర్గానికి చెందిన పది మంది తమ కులాన్ని పది రకాలుగా నమోదు చేస్తే, కంప్యూటర్‌‌‌‌‌‌‌‌లో నమోదైన ఆ పది పేర్లు నిజంగా ఒకే సామాజిక వర్గానికి చెందినవని గుర్తించే వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? కులం పేరు నమోదు చేయడం సులభమే కావచ్చు. కానీ ఒకే సమాజాన్ని వంద పేర్ల మధ్య గుర్తించడం అసలు సవాలు.

ప్రజలకు తమ సామాజిక గుర్తింపును స్వయంగా నమోదు చేసే అవకాశం ఇవ్వడం ప్రజాస్వామ్య దృష్టిలో సహజమైన అంశమే. కానీ వ్యక్తి రాసిన ప్రతి పేరును దేశవ్యాప్తంగా ఒకే విధంగా అర్థం చేసుకుని సరైన వర్గీకరణ చేయగల బలమైన వ్యవస్థ కూడా ఉండాలి. లేకపోతే వ్యక్తి నమోదు చేసిన పేరు సరైనదే అయినప్పటికీ, మొత్తం డేటాలో అది వేరే వర్గంగా కనిపించే అవకాశం ఉంటుంది. ఇక్కడ వ్యక్తి తప్పు చేయకపోయినా, వ్యవస్థ  సరైనవిధంగా వర్గీకరించకపోతే అసలు సమస్య మొదలవుతుంది.

ఈ సమస్యకు పరిష్కారం ఏమిటన్నదే ఇప్పుడు విధాన నిర్ణేతల ముందు ఉన్న అసలు సవాలు. ముందుగానే కులాల ప్రామాణిక జాబితాను రూపొందించాలా? లేక ప్రజలు స్వేచ్ఛగా నమోదు చేసిన తర్వాత శాస్త్రీయంగా వాటిని వర్గీకరించే వ్యవస్థను రూపొందించాలా? ఈ రెండింటిలో  ఏ పద్ధతి ఉత్తమమో నిపుణులు, సామాజిక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, గణాంక నిపుణులు కలిసి నిర్ణయించాల్సిన అవసరం ఉంది.

ఒకే విధానం వల్ల ఎవరైనా గణాంకాల్లో విడిపోయే పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం. కులాధార జనగణన అంటే కేవలం ఒక ఫారమ్‌‌‌‌‌‌‌‌లో పేరు రాయడం కాదు. అది దేశ సామాజిక నిర్మాణాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం. అందుకే ఆ ప్రయత్నంలో ఒకే సమాజం వంద పేర్లుగా విడిపోకూడదు. ఒకే కులానికి చెందిన ప్రజలు వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో గుర్తింపు పొందవచ్చు. కానీ జనగణనలో ఆ పేర్ల వెనుక ఉన్న అసలు సామాజిక వాస్తవాన్ని గుర్తించే బాధ్యత వ్యవస్థపై ఉంటుంది. ఎందుకంటే ఒకే సమాజం లెక్కల్లో విడిపోయిన రోజు... తప్పిపోయేది కేవలం సంఖ్య కాదు. ఆ సమాజం అసలు గుర్తింపు.

దుండ్ర కుమారస్వామి, హైకోర్టు అడ్వకేట్

  • ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
  • రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
  • స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.