మోడీ రాజీనామా చేస్తే.. నేను ప్రభుత్వాన్ని రద్దు చేస్తా: బీజేపీ ఛాలెంజ్‎పై CM రేవంత్ రియాక్షన్

మోడీ రాజీనామా చేస్తే.. నేను ప్రభుత్వాన్ని రద్దు చేస్తా: బీజేపీ ఛాలెంజ్‎పై CM రేవంత్ రియాక్షన్

హైదరాబాద్: ప్రభుత్వాన్ని రద్దు చేసి.. ఎన్నికలకు వెళ్లాలన్న బీజేపీ సవాల్‎కు సీఎం రేవంత్ రెడ్డి అంతే ధీటుగా ప్రతి సవాల్ విసిరారు. సోమవారం (జూన్ 15) డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోడీ ముందుగా తన పదవికి రాజీనామా చేసి కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తే.. తాను కూడా సీఎం పదవికి రాజీనామా చేయడంతో పాటు శాసన సభను రద్దు చేసేందుకు సిద్ధమని ఛాలెంజ్ చేశారు. 

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ ఉందని.. అధికారంలో కొనసాగడానికి బీజేపీ మాదిరిగా ఇతర పార్టీల మద్దతుపై ఆధారపడటం లేదని కౌంటర్ ఇచ్చారు. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సంకీర్ణ భాగస్వాములపై ఆధారపడి ఉందని.. అలాంటి పార్టీకి తనను రాజీనామా చేయమని డిమాండ్ చేసే నైతిక హక్కు లేదన్నారు. స్పష్టమైన ప్రజా తీర్పు లేకపోవడంతో ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న బీజేపీ ముందుగా రాజీనామా చేయాలని.. ఆ తర్వాత నన్ను రాజీనామా చేయమని కోరాలని సూచించారు. రాజకీయ సవాళ్లు ఏకపక్షంగా ఉండకూడదని.. అన్ని పార్టీలకు సమానంగా వర్తించాలని పేర్కొన్నారు. 

కిషన్ రెడ్డి వల్లే హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు ఆటంకం

బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కై హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2ను అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వల్లే ఐఆర్ఎఫ్‎సీ లోన్ బదిలీ ప్రక్రియ ఆగిపోయిందన్నారు. ఐఆర్ఎఫ్ సీ (IRFC) రుణం బదిలీ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. డాక్యుమెంట్ల ఫీజు కింద అక్షరాలా 84 కోట్ల రూపాయలు కూడా చెల్లించాం. ఈక్విటీ కింద మరో రూ.1400 కోట్లు కూడా జమ చేశామన్నారు. 13 వేల 400 కోట్ల రూపాయల భారీ రుణాన్ని.. కేవలం 4 శాతం వడ్డీకే, 20 ఏళ్ల కాల పరిమితితో తెచ్చేందుకు అన్ని ఒప్పందాలూ పూర్తయ్యాయని చెప్పారు. కానీ.. సరిగ్గా ఇదే సమయంలో సీన్‎లోకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎంటరై అడ్డుకున్నారని చెప్పారు.

►ALSO READ | బీజేపీ ఆడిస్తున్న తోలుబొమ్మ పవన్ కళ్యాణ్.. ఎవరో ఉప్పు అందిస్తే మాట్లాడడం మానుకో

మే 21వ తేదీన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను ప్రత్యేకంగా కలిసిన కిషన్ రెడ్డి... ఈ రుణ ప్రక్రియను పూర్తిగా అడ్డుకున్నారని రేవంత్ తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ ఉండాలా? వద్దా? అంటూ కేంద్ర పెద్దలపై ఒత్తిడి తెచ్చారు. నిజానికి ఈ రోజుకల్లా లోన్ బదిలీ పూర్తి కావాల్సి ఉంది. కానీ, కేవలం కిషన్ రెడ్డి రాజకీయం వల్లే ఈ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు రేవంత్.

అసలు ఐఆర్ఎఫ్ సీ లోన్ ఎందుకు ఇవ్వట్లేదో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు రేవంత్. లోన్ శాంక్షన్ కాకుండా మీరే అడ్డుకుంటున్నారా..? లేదా..? అన్నదానిపై స్పష్టత ఇవ్వాలి. దీనిపై కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యత తీసుకుని మాట్లాడుతారా? లేదా? నిలదీశారు రేవంత్. ఒకవేళ కేంద్రం లోన్ ఇవ్వకపోతే... కనీసం వేరే చోట తెచ్చుకోవడానికి ఎన్ ఓసీ (NOC) అయినా ఇప్పిస్తారా లేదా అని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ తిట్టినట్లుగా తామెప్పుడూ కిషన్ రెడ్డిని తిట్టలేదని.. కేంద్రమంత్రిగా ఆయనపై గౌరవం ఉంది కాబట్టే సమన్వయం కోరుకుంటున్నామని స్పష్టం చేశారు.