హైదరాబాద్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో టోకరా... నకిలీ పత్రాలతో 50 మంది దగ్గర వసూళ్లు

హైదరాబాద్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో టోకరా... నకిలీ పత్రాలతో 50 మంది దగ్గర వసూళ్లు

హైదరాబాద్‌లో డబుల్ బెడ్‌రూమ్ (2BHK) ఇళ్ల కేటాయింపు పేరుతో అమాయకులను మోసగిస్తున్న ఒక భారీ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. జూబ్లీహిల్స్ టాస్క్ ఫోర్స్, మొఘల్‌పురా పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ప్రధాన నిందితుడు సయ్యద్ సల్మాన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ప్రభుత్వ అధికారులతో తనకు మంచి పరిచయాలు ఉన్నాయని నమ్మబలికిన నిందితుడు.. ఇళ్లు ఇప్పిస్తానని చెప్పి బాధితుల నుంచి ఆధార్ జిరాక్సెస్, ఫోటోలు సేకరించాడు. వాటితో ప్రభుత్వ ముద్రలు కలిగిన ఏకంగా 52 నకిలీ కేటాయింపు పత్రాలను తయారు చేశాడు. ఈ నకిలీ ఆర్డర్లతో సుమారు 50 మందికి పైగా బాధితులను మోసం చేసి, వారి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడి నుంచి నకిలీ పత్రాలతో పాటు ఒక మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read :  పోలీస్ ఉద్యోగాలకు ఆగస్టు 19 నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు..

ప్రభుత్వ సంక్షేమ పథకాల పేరుతో మోసాలకు పాల్పడే కేటుగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. 2BHK ఇళ్ల కేటాయింపుల విషయంలో ఎవరి మాటలు నమ్మకుండా, ప్రజలు కేవలం అధికారిక ప్రభుత్వ మార్గాలను మాత్రమే అనుసరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.