- జనన మరణాల బిల్లుకు లోక్ సభ ఆమోదం
న్యూఢిల్లీ: పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థులపై పోలీసులు జరిపిన అణచివేతకు ప్రతిపక్షాలు నిరసనలు తెలుపుతున్నప్పటికీ, లోక్‌సభ శుక్రవారం జనన మరణాల నమోదు (సవరణ) బిల్లు, 2026ను ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదించింది. మధ్యాహ్నం బీజేపీ ఎంపీ దిలీప్ సైకియా అధ్యక్షతన సభ సమావేశమైన అనంతరం, ప్రతిపక్ష సభ్యుల నినాదాల నడుమ మూజువాణి ఓటుతో ఈ బిల్లు ఆమోదం పొందింది. చర్చలో పాల్గొనడానికి ప్రతిపక్షాలు నిరాకరించడం దురదృష్టకరమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అసంతృప్తి వ్యక్తం చేశారు.
బిల్లు ఆమోదం పొందిన వెంటనే సభను వాయిదా వేశారు. ఈ బిల్లు ప్రకారం.. సంఘటన జరిగిన రెండేళ్ల కంటే ఎక్కువ కాలం తర్వాత చేసే రిజిస్ట్రేషన్‌లకు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (మొదటి తరగతి) నుంచి ఉత్తర్వులు తప్పనిసరి చేయనున్నారు. అలాగే 1973 నాటి ‘కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్’ ప్రస్తావనలను తొలగించి, ‘భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, 2023’కు అనుగుణంగా చట్టపరమైన నిర్వచనాలను సవరిస్తారు.
సభా కార్యకలాపాల సమయంలో, 'రాజ్యాంగ (130వ సవరణ) బిల్లు, 2025'ను పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీకి అధ్యక్షత వహిస్తున్న బీజేపీ ఎంపీ అపరాజిత సారంగికి, ఆ కమిటీ నివేదిక సమర్పణ గడువును శీతాకాల సమావేశాల చివరి వారంలోని మొదటి రోజు వరకు పొడిగించే చాన్స్ ఉంది.
