న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన E20 పెట్రోల్ విధానంపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. E20 పెట్రోల్ వల్ల వాహనాల మైలేజ్ తగ్గడంతో పాటు పాడవుతున్నాయని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే E20 విధానాన్ని ఉపసంహరించుకోవాలని రోజురోజుకు దేశవ్యాప్తంగా డిమాండ్లు ఎక్కువైతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజకీయ విశ్లేషకుడు, సామాజిక కార్యకర్త తెహసీన్ పూనావాలా కేంద్ర ప్రభుత్వ E20 పెట్రోల్ విధానానికి వ్యతిరేకంగా 2026, ఆగస్ట్ 1న దేశ రాజధాని ఢిల్లీలో నిరసనకు పిలుపునిచ్చారు.
E20 ఇంధన విధానానికి వ్యతిరేకంగా ఆగస్టు 1న ఏపీజే అబ్దుల్ కలాం మార్గ్ నుంచి గాంధీ స్మృతి మార్గ్ వరకు ఒంటరిగా శాంతియుత పాదయాత్ర, రోజంతా నిరాహార దీక్ష చేపడతానని ప్రకటించారు. ఈ క్రమంలో పోలీసులు శనివారం (ఆగస్ట్ 1) తెహసీన్ పూనావాలాను హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన బయటకు వెళ్లకుండా గృహనిర్భంధం చేశారు పోలీసులు.
ఈ విషయాన్ని తెహసీన్ పూనావాలా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. E20 ఇంధన విధానానికి వ్యతిరేకంగా నిరసనకు పిలుపునిచ్చినందుకు ఢిల్లీ పోలీసులు తనను హౌస్ అరెస్ట్ చేశారని ఆరోపించారు. పూర్తిగా ఒక బెటాలియన్ తనను గృహనిర్భంధం చేశారని.. పోలీసులు తనను ఒక ఉగ్రవాదిలా చూస్తున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ALSO READ: రాహుల్ గాంధీపై ట్వీట్ వేసి నవ్వుల పాలైన ఇంగ్లీష్ ప్రొఫెసర్.. !
తాను ఎలాంటి తప్పు చేయలేదు.. నాకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇథనాల్ అంటే భయపడుతున్నారని.. అందుకే తాను ఇథనాల్‌కు వ్యతిరేకంగా మాట్లాడకుండా నోరుమూసేందుకు పోలీసులు తనను గృహ నిర్బంధంలో ఉంచారని ఆరోపించారు. E20 పెట్రోల్ విధానానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన చేపడతానని ప్రకటించినప్పటికీ హౌస్ట్ అరెస్ట్ చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను కూడా నిలిపివేశారని ఆరోపించారు.
