కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కేపై దాడి.. చెంప చెల్లుమనిపించిన దుండగులు

కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కేపై దాడి.. చెంప చెల్లుమనిపించిన దుండగులు

జైపూర్: నీట్, సీబీఎస్ఈ పేపర్ లీక్‎కు వ్యతిరేకంగా రాజస్థాన్‎లోని జైపూర్‎లో కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన ధర్నాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కేపై దాడి జరిగింది. గుర్తు తెలియని దుండగులు అతడిని చెంపపై కొట్టారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కాక్రోచ్ పార్టీ కార్యకర్తలు దుండగులపై ఎదురు దాడి చేశారు. తనపై దాడి చేసిన వ్యక్తిని కొట్టొద్దని దీప్కే కోరినప్పటికీ సీజేపీ కార్యకర్తలు వెనక్కి తగ్గలేదు. దుండగులను చితకబాదారు. 

ఈ ఘటనతో ధర్నాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అభిజిత్‎ను అక్కడి నుంచి తరలించారు. కాక్రోచ్ పార్టీ చీఫ్‎పై దాడి జరిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. అభిజిత్ దీప్కేపై దాడిని నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తోన్న్ వారిపై భౌతిక దాడులు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిజిత్ పై దాడి చేసిన వ్యక్తులు ఎవరనే విషయం తెలియాల్సి ఉంది. 

సీజేపీ ధర్నా ఎందుకంటే..?

నీట్, సీబీఎస్ఈ, సీయూఈటీ, ఎస్ఎస్సీ వంటి ప్రధాన పరీక్షలలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగానే సోమవారం (జూన్ 15) రాజస్థాన్ రాజధాని జైపూర్‎లో సీజేపీ ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే హాజరై ప్రసంగించారు. అనుహ్యంగా ఈ ధర్నాలో ఆయనపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు.