నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 84,950 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా (80 టీఎంసీలు), ప్రస్తుత నీటి మట్టం 1,071.8 అడుగులకు (27.369 టీఎంసీలు) చేరుకుంది. ఈ క్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, శ్రీధర్ బాబు ఎస్సారెస్పీ ప్రాజెక్టును సందర్శించి, నీటి మట్టం , ఇన్ ఫ్లోలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి బీఆర్ఎస్ నాయకుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ తప్పుడు నిర్ణయాలతో ప్రభుత్వంపై భారం పడిందని, 60 టీఎంసీల నీటిని వృధా చేసి సుమారు 3 వేల కోట్ల నష్టం మిగిల్చారని ఆరోపించారు. కేటీఆర్‌కు ప్రాజెక్టులపై అవగాహన లేదని, కేటీఆర్, హరీష్‌రావు లు ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వర్షాలు రావద్దని బీఆర్ఎస్ నేతలు కోరుకున్నారని, కేటీఆర్ మళ్లీ అమెరికా వెళ్లి ఉద్యోగం చేసుకోవడం మంచిదని ఎద్దేవా చేశారు.
అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రాజెక్టుల నీటి మట్టాలు, ఇన్ ఫ్లోలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకే తాము పర్యటించినట్లు తెలిపారు. ప్రాజెక్టుల్లో పూడిక తీయడానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి, ఎస్సారెస్పీకి పూర్వవైభవం తీసుకువస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులకు సాగు నీటిపై స్పష్టమైన ప్రకటన చేస్తామన్నారు. ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టిందని, తామే కట్టామంటూ బీఆర్ఎస్ చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని, వాళ్లు కట్టిన ప్రాజెక్టులు కూలిపోయాయని విమర్శించారు.
ALSO READ : మోడీ వికసిత్ భారత్, సీబీఎన్ విజన్ ప్రతిరూపం భోగాపురం ఎయిర్ పోర్ట్
ఇక ఎల్నినో ప్రభావం దృష్ట్యా రైతులు ఏ పంటలు సాగు చేయాలనేదానిపై మరో రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం తరఫున స్పష్టమైన ప్రకటన చేస్తామని, రైతన్నలకు ఎప్పుడూ మేలు చేసేవిధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలు ఉంటాయని మంత్రులు భరోసా కల్పించారు.
