కేంద్ర ప్రభుత్వం జులై నెల జీఎస్టీ వసూళ్లను రాష్ట్రాల వారీగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లలో హర్యానా టాప్ ప్లేస్లో ఉండగా, తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. గుజరాత్ కూడా తెలంగాణకు సమానంగా రెండో స్థానంలో ఉంది. మొత్తంగా.. జులై నెలలో ఇండియాలో జీఎస్టీ వసూళ్లు 15.4 శాతం పెరిగి ₹2.11 లక్షల కోట్లకు చేరడం గమనార్హం. దిగుమతి పన్ను రాబడి దాదాపు 29 శాతం పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు, పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొని ఉన్నప్పటికీ మన దేశంలో ఆర్థిక కార్యకలాపాలు జోరుగా సాగాయి.
దీంతో.. వరుసగా రెండో నెల కూడా జీఎస్టీ వసూళ్లలో ఇండియా ₹2 లక్షల కోట్ల మార్కును దాటేసింది. 2025 జులైలో.. రూ.1.31 లక్షల కోట్ల స్థూల జీఎస్టీ రాబడి సాధించగా.. 2026 జూలైలో 10.1% పెరిగి రూ.1.45 లక్షల కోట్లకు చేరింది. దిగుమతుల నుంచి జీఎస్టీ వసూళ్లు 28.8 శాతం గణనీయమైన వృద్ధిని నమోదు చేసి రూ.66 వేల 511 కోట్లకు పెరిగాయి. దీంతో మొత్తం స్థూల వసూళ్లు రూ.2.11 లక్షల కోట్లకు చేరాయి.
రీఫండ్‌లను పరిగణనలోకి తీసుకున్న అనంతరం.. నికర జీఎస్టీ వసూళ్లు గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 15.8% పెరిగి ₹1.81 లక్షల కోట్లకు చేరాయి. నికర దేశీయ జీఎస్టీ ఆదాయం 10.5% పెరిగి ₹1.27 లక్షల కోట్లకు చేరింది. దిగుమతులపై వసూలు చేసిన నికర జీఎస్టీ 30.3% పెరిగి ₹54,223 కోట్లకు చేరింది. హర్యానా GST వసూళ్లలో సంవత్సరానికి అత్యధికంగా 25% పెరుగుదలను నమోదు చేసింది. ఆ తర్వాత తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాలు చెరో 19 శాతం వృద్ధిని నమోదు చేశాయి. పంజాబ్, కేరళ 16% వృద్ధిని నమోదు చేయగా, ఉత్తర ప్రదేశ్ 15% పెరుగుదలను నివేదించింది.
ఇక.. మన పొరుగు రాష్ట్రమైన ఏపీలో జీఎస్టీ వసూళ్లు 5 శాతం తగ్గాయి. హిమాచల్ ప్రదేశ్‌లో అనూహ్యంగా 22 శాతం క్షీణత నమోదు కావడం గమనార్హం. ఆ తర్వాత ఉత్తరాఖండ్ (18%), పుదుచ్చేరి (17%), మధ్యప్రదేశ్ (10%), ఆంధ్రప్రదేశ్ (5%), తమిళనాడు రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్లు 1 శాతానికి తగ్గాయి.
