- రూపాయికే అంతిమయాత్ర చేయాల్సి ఉన్నా పట్టించుకోని కాంట్రాక్టర్
- సొంత ఖర్చుతోనే అంత్యక్రియలు పూర్తి చేస్తున్న కుటుంబ సభ్యులు
- తర్వాత వారి పేరుతో బల్దియా నుంచి రూ.10 వేలు క్లైయిమ్
- మృతుల ఫ్యామిలీకి రూ. 5 వేలు ఇచ్చి మిగతావి జేబులో వేసుకుంటున్న కాంట్రాక్టర్
కరీంనగర్‌లోని ముక్రంపుర ఏరియాలోని వేర్వేరు కుటుంబాలకు చెందిన ఇద్దరు ఇటీవల చనిపోగా.. వారి కుటుంబసభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. ‘ఆఖరి సఫర్’ స్కీమ్ కాంట్రాక్టర్ అంత్యక్రియలకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. అంత్యక్రియలు ముగిశాక ఆయా బాధిత కుటుంబాలకు ఆఖరి సఫర్ స్కీమ్ కింద స్థానిక కార్పొరేటర్ రూ.5 వేల చొప్పున అందజేశారు. అయితే అంత్యక్రియల ఖర్చులకు బల్దియా రూ. 10 వేలు ఇస్తే... బాధిత కుటుంబాలకు మాత్రం రూ.5 వేలే ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై సదరు కార్పొరేటర్‌ను వివరణ కోరగా.. కాంట్రాక్టర్ రూ.5 వేల చొప్పునే ఇచ్చాడని, రూ.10 వేల విషయం అడుగుతానని సమాధానం ఇచ్చాడు.
కరీంనగర్, వెలుగు : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో రూపాయికే అంతిమయాత్ర (ఆఖరి సఫర్) పేరిట ప్రవేశపెట్టిన స్కీమ్ పక్కదారి పట్టింది. స్కీమ్‌ను సక్రమంగా అమలు చేయాల్సిన కాంట్రాక్టర్ శవాల పేరుతో దందా చేస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరీంనగర్‌కు చెందిన ఎవరైనా పేదలు చనిపోతే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాల్సిన కాంట్రాక్టర్.. అవేమి పట్టించుకోవడం లేదు. పైగా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రూ.10 వేలు తీసుకొని బాధిత కుటుంబానికి మాత్రం రూ.5 వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇటీవల డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారి కుటుంబ సభ్యులు చనిపోతే మున్సిపల్ వైకుంఠ రథంలో తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
ఒక్కో అంత్యక్రియకు రూ. 10 వేలు
కరీంనగర్‌లో నివాసముంటూ తెల్ల రేషన్ కార్డు కలిగిన పేద కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించాలన్న ఉద్దేశంతో 2019లో అప్పటి మేయర్ రవీందర్ సింగ్, పాలకవర్గం కలిసి రూపాయికే ‘అంతిమయాత్ర.. ఆఖరి సఫర్’ పేరుతో కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. బల్దియా పరిధిలోని ఎవరైనా పేదలు చనిపోతే ఆ సమాచారాన్ని మున్సిపాలిటీలో ఇచ్చి రూపాయి చెల్లిస్తే ప్రత్యేక సిబ్బంది వారి ఇంటికి వెళ్లి దహన సంస్కారాలకు అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఈ స్కీమ్‌లో వాహనం, బాడీ ఫ్రీజర్, నాలుగు డప్పులు, పూలదండ, పాడే కట్టెలు, కాల్చేందుకు అవసరమయ్యే కర్రలు, డీజిల్ (కిరోసిన్), వస్త్రం, కుండ, పసుపు, కుంకుమ, బుక్కగులాలు, టైర్లు వంటివి తీసుకురావాల్సి ఉంటుంది. ఖననం చేయాల్సి వస్తే గుంతను సైతం తీస్తారు. అంత్యక్రియల రోజు 50 మందికి రూ.5 కే భోజన సదుపాయం కల్పిస్తారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ తదితర అన్ని మతాల ఆచారాల ప్రకారం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ స్కీమ్ కింద ఒక ఏడాదిలో గరిష్టంగా 900 మంది అంత్యక్రియలకు అవకాశం ఉంది. ఒక్కో అంత్యక్రియ ఖర్చుల కింద కాంట్రాక్టర్‌కు బల్దియా రూ. 10 వేలు చెల్లిస్తోంది.
సగం కాంట్రాక్టర్‌కు.. సగం మృతుల కుటుంబాలకు
కొన్నేండ్ల పాటు సక్రమంగానే అమలైన ఈ స్కీమ్ ఇటీవల పక్కదారి పట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండు, మూడేండ్లుగా కొన్ని వస్తువులు మాత్రమే ఇస్తుండడంతో మిగతా వాటిని మృతుల కుటుంబసభ్యులు, బంధువులే తెచ్చుకుంటున్నారు. మున్సిపాలిటీ ఇచ్చే డబ్బులు సరిపోవడం లేదంటూ... డప్పులు, వైకుంఠ రథానికి డీజిల్, ఇతర ఖర్చులు కలిపి రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు మృతుల కుటుంబాల నుంచే వసూలు చేస్తున్నారు. కొన్ని సమయాల్లో కుటుంబ సభ్యులే ఖర్చంతా పెట్టుకొని అంత్యక్రియలు పూర్తి చేసుకుంటున్నారు. తర్వాత కాంట్రాక్టర్ వారి వద్దకు వచ్చి ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్ తీసుకెళ్లి వారి పేరుతో రూ.10 వేలు క్లయిమ్ చేసుకుంటున్నారు. ఇందులోంచి రూ.5 వేలు బాధిత కుటుంబానికి ఇచ్చి మిగతా రూ.5 వేలను కాంట్రాక్టర్ జేబులో వేసుకుంటున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు.
