సౌకర్యాలతో.. సరికొత్తగా... మూతపడిన స్కూల్స్తెరుచుకుంటున్నాయ్

సౌకర్యాలతో.. సరికొత్తగా... మూతపడిన స్కూల్స్తెరుచుకుంటున్నాయ్
  • భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఈ ఏడాది నుంచి ప్రారంభంకానున్న 118  ప్రీ ప్రైమరీ స్కూల్స్​ 
  • మండలాలకు చేరిన 90 శాతం పాఠ్యపుస్తకాలు
  • నేటి నుంచి పాఠశాలల పున:ప్రారంభం​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రెండు, మూడు ఏండ్లుగా భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో మూతపడిన పది ప్రభుత్వ పాఠశాలలను తిరిగి ప్రారంభించేందుకు జిల్లా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. తొలిదశలో ఐదు మండలాల్లోని పది పాఠశాలలను పునఃప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసింది. ఇదే సమయంలో జిల్లాలో 118 ప్రీ ప్రైమరీ పాఠశాలలను ప్రారంభించేందుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. 

సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన పాఠ్యపుస్తకాలను జిల్లా కేంద్రం నుంచి ఆయా మండలాలకు ఇప్పటికే తరలించారు. అయితే స్కూల్స్​ రీ ఓపెన్​ నాటికి యూనిఫాంల తయారీ పూర్తికాకపోవడంతో విద్యార్థులు ప్రస్తుతం పాత యూనిఫాంలతోనే పాఠశాలలకు హాజరుకానున్నారు.

మూతపడిన పాఠశాలల పునఃప్రారంభం..

జిల్లాలోని చర్ల మండలంలోని దేవనగరం, టేకులపల్లి మండలంలోని లాక్యా తండా, రుక్మా తండా, గోల్యా తండా, దాసు తండా, అన్నపురెడ్డిపల్లి మండలంలోని కట్టుగూడెం, లక్ష్మీదేవిపల్లి మండలంలోని గొల్లగూడెం, పాత బంగారుచెలక, దుమ్ముగూడెం మండలంలోని కాశీనగరం, పాల్వంచ మండలంలోని నారాయణరావుపేట గ్రామాల్లోని పాఠశాలలు రెండు, మూడేండ్లుగా జీరో ఎన్‌‌‌‌రోల్‌‌మెంట్ కారణంగా మూతపడ్డాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆయా పాఠశాలలను తిరిగి ప్రారంభించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ ప్రక్రియను సమర్ధవంతంగా అమలు చేయడానికి ఎంఈవోలకు బాధ్యతలు అప్పగించింది.

118 ప్రీ ప్రైమరీ స్కూల్స్​ ఓపెన్.. 

ఈ విద్యా సంవత్సరం నుంచి జిల్లాలో 118 ప్రీ ప్రైమరీ పాఠశాలలను ప్రారంభించేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. గతేడాది మధ్యలో ప్రయోగాత్మకంగా 21 ప్రీ ప్రైమరీ పాఠశాలలను ప్రారంభించగా, వాటికి వచ్చిన స్పందనను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది సంఖ్యను 118కు పెంచారు. పిల్లలను ఆటలు, పాటల ద్వారా ఈ పాఠశాలలో చదువు చెప్పారు. ప్రతి పాఠశాలకు రూ.లక్ష చొప్పున ప్రభుత్వం నిధులు కేటాయిస్తోంది. 

మండలాల వారీగా ఆళ్లపల్లి, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో మూడేసి, అశ్వాపురంలో ఒకటి, అశ్వారావుపేటలో 13, భద్రాచలంలో ఒకటి, బూర్గంపహాడ్‌‌లో నాలుగు, చంద్రుగొండలో ఎనిమిది, చర్లలో రెండు, దమ్మపేటలో 13, దుమ్ముగూడెంలో 11, గుండాలలో మూడు, జూలూరుపాడులో నాలుగు, కరకగూడెంలో రెండు, కొత్తగూడెంలో ఒకటి, లక్ష్మీదేవిపల్లిలో నాలుగు, మణుగూరులో ఒకటి, ములకలపల్లిలో ఒకటి, పాల్వంచలో 15, పినపాకలో ఒకటి, సుజాతనగర్‌‌లో ఒకటి, టేకులపల్లిలో 10, ఇల్లెందులో 14 ప్రీ ప్రైమరీ పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.

మండలాలకు చేరిన పాఠ్యపుస్తకాలు..

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలతో పాటు నోట్‌‌బుక్స్‌‌ను అందిస్తోంది. ఇప్పటికే జిల్లా కేంద్రం నుంచి 4,13,929 పుస్తకాలను మండలాలకు పంపించారు. ఇప్పటివరకు సుమారు 90 శాతం పుస్తకాల పంపిణీ పూర్తయిందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇదిలాఉండగా, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ప్రతి ఏడాది ఉచిత యూనిఫాంలు అందిస్తోంది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభానికే యూనిఫాంలు అందించాలని నిర్ణయించినప్పటికీ, క్లాత్​ జిల్లా విద్యాశాఖకు చేరలేదు. యూనిఫాం నమూనాలో మార్పులు చేయడంతో వస్త్రాల కొనుగోలు ప్రక్రియ ఆలస్యమైనట్లు అధికారులు తెలిపారు. ఆగస్టు 15 నాటికి విద్యార్థులకు కొత్త యూనిఫాంలు అందే అవకాశం ఉందని పలువురు టీచర్లు పేర్కొంటున్నారు.

ఎన్‌‌రోల్‌‌మెంట్ పెంచేందుకు కృషి..

సర్కారు బడుల్లో స్టూడెంట్స్ ఎన్‌‌రోల్‌‌మెంట్ పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే బడి బాట చేపట్టాం. ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్​తో పేద పిల్లలకు ఆటపాటలతో ఇంగ్లిష్​ విద్యను అందించనున్నాం. మూత పడిన పది స్కూల్స్​ను తెరిచేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశాం. సర్కారు బడుల్లో మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. అల్పాహారాన్ని కూడా ప్రభుత్వం అందించనుంది. పాఠ్యపుస్తకాలతో పాటు నోట్ బుక్స్ ఫ్రీగా ఇస్తున్నాం. యూనిఫాం, షూస్ కూడా ప్రభుత్వం అందించనుంది. టీచర్లు సమయ పాలనకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. 

- డి.వాసంతి, డీఈవో, భద్రాద్రికొత్తగూడెం