- కేంద్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు
- ప్రధాన్ మంత్రి సూర్య సరోవర్ యోజన’కు ఆమోదం
- మరో ఐదేండ్లు ‘పీఎం కిసాన్’ పొడిగింపు.. రూ.3,15,614 కోట్ల భారీ బడ్జెట్
- రూ.84,084 కోట్లతో ‘సముద్ర మంథన్’ స్కీమ్‌కు ఓకే
న్యూఢిల్లీ: దేశంలో రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తికి మరింత ఊతమిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీటిపై తేలియాడే (ఫ్లోటింగ్) సోలార్ ప్రాజెక్టులతోపాటు బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థల ఏర్పాటు కోసం రూ.5,070 కోట్ల భారీ అంచనా వ్యయంతో ‘ప్రధాన్ మంత్రి సూర్య సరోవర్ యోజన’ (పీఎంఎస్‌ఎస్‌వై) పథకానికి ఆమోదం తెలిపింది. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ లభించింది.
ఖేలో ఇండియాకు రూ.29 వేల కోట్లు, సొరంగాల నిర్మాణం కోసం రూ.9779 కోట్లు కేటాయించింది. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. పీఎంఎస్‌ఎస్‌వై పథకం ద్వారా దేశవ్యాప్తంగా కనీసం 2 గంటల బ్యాటరీ స్టోరేజ్ సామర్థ్యం (10వేల మెగావాట్లు) కలిగిన 5వేల మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను అందుబాటులోకి తేనున్నారు.
ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తయ్యాక ప్రతి మెగావాట్‌కు రూ. కోటి చొప్పున కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. అంతేకాకుండా, ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందు చేపట్టే రీసెర్చ్, పర్యావరణ అధ్యయనాలు, హైడ్రోగ్రఫీ పరీక్షల కోసం ప్రాజెక్టుకు రూ.50 లక్షల వరకు ప్రత్యేక నిధులు ఇస్తారు. ఈ ప్రాజెక్టులను 2026-–27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030–-31 వరకు మంజూరు చేస్తారు.
ఇందుకు సంబంధించిన ఆర్థిక సహాయాన్ని 2032-–33 ఆర్థిక సంవత్సరం వరకు అందజేస్తారు.ఈ పథకం ద్వారా సుమారు 16 వేల నుంచి 17వేల మందికి పూర్తిస్థాయి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యంలో భాగంగా సోలార్ ప్యానెళ్లు, బ్యాటరీలు, ఫ్లోటేషన్ సిస్టమ్స్ స్వదేశీ తయారీ రంగం మరింత బలోపేతం కానుంది. ప్రస్తుతం దేశంలో కేవలం 700 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ సామర్థ్యం మాత్రమే ఉండగా, కొత్తగా రాబోతున్న 5 వేల మెగావాట్ల సామర్థ్యంతో భారత్ పునరుత్పాదక ఇంధన రంగంలో సరికొత్త శకానికి నాంది పలకనుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నాయి.
సముద్రంలో చమురు వెలికితీసేందుకు కొత్త స్కీమ్
దేశంలో ఇంధన భద్రతను పెంపొందించడం, విదేశీ చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. లోతైన సముద్ర గర్భంలో దాగి ఉన్న చమురు, సహజ వాయు నిధులను వెలికితీసేందుకు రూ.84,084 కోట్ల అంచనా వ్యయంతో ‘సముద్ర మంథన్’ (నేషనల్ ఆఫ్‌షోర్ ఎక్స్‌ప్లోరేషన్ స్కీమ్) పథకానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
కేంద్ర పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ పరిధిలోని ఈ పథకం 2030–-31 ఆర్థిక సంవత్సరం వరకు అమల్లో ఉంటుంది. లోతైన, అత్యంత లోతైన సముద్ర తీరాల్లో ఒక్కో బావి తవ్వకానికి రూ. 650 కోట్ల వరకు ఆర్థిక సాయం అందించనుంది. మొత్తం పథకం బడ్జెట్‌లో సగానికి పైగా..అంటే రూ.43,200 కోట్లను రాబోయే ఐదేండ్లలో కేవలం తవ్వకాల కోసమే కేటాయిస్తారు. చమురు నిక్షేపాలు బయటపడిన తర్వాత వాటిని వెలికితీసేందుకు అవసరమైన కామన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించారు. సముద్ర గర్భ డేటా సేకరణకు రూ.28,534 కోట్లు, చమురు-గ్యాస్ తయారీ, సేవా రంగానికి రూ.2వేల కోట్లు అలొకేట్ చేశారు.
రైతులకు మరో ఐదేండ్లు పెట్టుబడి సాయం..
దేశంలోని రైతులకు పెట్టుబడి సాయం అందించే ప్రతిష్టాత్మక ‘ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ (పీఎం కిసాన్) పథకాన్ని మరో ఐదేండ్లపాటు (2026–-27 నుంచి 2030–-31 వరకు) కేంద్రం పొడిగించింది. ఇందుకుగానూ రూ. 3,15,614 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. రైతుల సంక్షేమం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.6 వేలు లభిస్తాయి. ఈ మొత్తాన్ని ప్రతి 4 నెలలకొకసారి రూ.2 వేల చొప్పున 3 విడతల్లో నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 23 విడతల్లో దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లో రూ.4.47 లక్షల కోట్లకు పైగా జమ చేశారు. 23వ విడతలో భాగంగా 9.49 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో రూ.18,984 కోట్లను జమ చేశారు.
