ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ ఏ దేశంలో ఉందో తెలుసా ? మీకు తెలియని మైండ్ బ్లోయింగ్ ఫాక్ట్స్!

ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ ఏ దేశంలో ఉందో తెలుసా ?  మీకు తెలియని మైండ్ బ్లోయింగ్ ఫాక్ట్స్!

ఎడారులు, దట్టమైన అడవులు, మంచు పర్వతాలు, రద్దీగా ఉండే నగరాల నుండి.. అసలు అంతం లేనట్టు సాగిపోయే రైలు పట్టాలను ఒక్కసారి ఊహించుకోండి. ప్రతి కొన్ని నిమిషాలకోసారి బొగ్గు, ధాన్యం, కార్లు, ఎలక్ట్రానిక్స్ వంటి టన్నుల కొద్దీ సరుకును మోస్తూ ఒక భారీ గూడ్స్ రైలు ఆ పట్టాలపై గడగడలాడుతూ వెళ్తుంటుంది.

ఈ అద్భుతమైన, అత్యంత విస్తారమైన రైల్వే నెట్‌వర్క్‌కు యజమాని ఎవరో కాదు.. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA). అవును, ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే వ్యవస్థ అమెరికాలోనే ఉంది.

అమెరికా రవాణా శాఖ & అమెరికన్ రైల్‌ రోడ్స్ అసోసియేషన్ లెక్కల ప్రకారం.. అక్కడ రైలు నెట్‌వర్క్ దాదాపు 2 లక్షల 20 వేల కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. కొన్ని సెకండరీ లైన్లను కూడా కలిపితే ఈ పొడవు ఇంకా ఎక్కువే ఉంటుంది. ఈ భారీ నెట్‌వర్క్ ఓడరేవులను, నగరాలను, వ్యవసాయ భూములను, ఫ్యాక్టరీలను కలుపుతూ అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఉక్కు వెన్నెముకలా నిలిచింది.
 
ఇంత పెద్ద నెట్‌వర్క్ ఎలా
 
ఈ కథ 1800వ శతాబ్దం నాటిది. ఆ కాలంలో అమెరికాలో తూర్పు, పశ్చిమ తీరాలను కలపడానికి ప్రైవేట్ రైలు కంపెనీల మధ్య భారీ పోటీ నడిచేది. 1869లో పూర్తయిన మొదటి ఖండాంతర (Transcontinental) రైలు మార్గం అమెరికా రవాణా రంగాన్నే మార్చేసింది. కాలక్రమేణా చిన్న చిన్న లైన్లన్నీ కలిసి భారీ కంపెనీలుగా మారాయి.

చాలా దేశాల్లో రైల్వేలు ప్రభుత్వ ఆధీనంలో ఉంటే, అమెరికాలో మాత్రం సరుకు రవాణా రైల్వేలు ఇప్పటికీ ప్రైవేట్ యాజమాన్యంలోనే ఉన్నాయి. అందుకే ఇవి చాలా వేగంగా అభివృద్ధి చెందాయి. నేడు యూనియన్ పసిఫిక్, BNSF రైల్వే, CSX వంటి ఆరు ప్రధాన 'క్లాస్ I' ప్రైవేట్ కంపెనీలు ఈ వ్యవస్థను నడిపిస్తున్నాయి.

సరుకు రవాణాలోనే తోపు
బుల్లెట్ ట్రైన్లు, సూపర్ ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్ల విషయంలో యూరప్, జపాన్ దేశాలు ముందుండొచ్చు. కానీ, సరుకు రవాణా విషయానికి వస్తే మాత్రం అమెరికాకు తిరుగే లేదు. అమెరికాలో మొత్తం సరుకు రవాణాలో 28 శాతం కేవలం రైళ్ల ద్వారానే జరుగుతుంది. జాతీయ ప్యాసింజర్ రైలు సంస్థ అయిన 'ఆమ్‌ట్రాక్' (Amtrak) నగరాల మధ్య ప్రయాణికుల రైళ్లను నడుపుతుంది. కానీ విచిత్రం ఏంటంటే.. ఈ ప్యాసింజర్ రైళ్లు కూడా ప్రైవేట్ సరుకు రవాణా కంపెనీల యాజమాన్యంలోని పట్టాలపైనే ప్రయాణించాల్సి ఉంటుంది.

ట్రక్కుల కంటే రైళ్లే బెటర్
రోడ్డుపై వెళ్లే 280 భారీ ట్రక్కులు ఎంత సరుకును మోయగలవో.. ఒకే ఒక్క అమెరికన్ గూడ్స్ రైలు అంత సరుకును మోసుకెళ్లగలదు. అంతేకాదు, కేవలం ఒక గ్యాలన్ (సుమారు 3.7 లీటర్లు) ఇంధనంతో ఒక టన్ను సరుకును ఏకంగా 480 మైళ్ల దూరం చేరవేయగలదు!

కొన్ని మైండ్ బ్లోయింగ్ ఫాక్ట్స్
*అమెరికాలోని 2,20,000 కిలోమీటర్ల రైలు పట్టాలతో మన భూమిని ఐదు సార్ల కంటే ఎక్కువగా చుట్టేయవచ్చు. ఈ వ్యవస్థలో భారీ కంపెనీల నుండి చిన్న చిన్న స్థానిక లైన్ల వరకు 6,000 కంటే ఎక్కువ మంది ఆపరేటర్లు పనిచేస్తున్నారు. గ్రేట్ ప్లెయిన్స్ మీదుగా వెళ్లే ఒక రైలు మార్గం దాదాపు 500 కిలోమీటర్ల వరకు ఎక్కడా ఎలాంటి వంపు (Curve) లేకుండా స్ట్రెయిట్‌గా సాగిపోతుంది. అమెరికాలోని కొన్ని రైలు వంతెనలు, సొరంగాలు 150 సంవత్సరాల క్రితం కట్టినవి. అయినా సరే, ఇప్పటికీ అవి చెక్కుచెదరకుండా వాడుకలో ఉన్నాయి.

అక్కడ సరుకు రవాణా రైళ్లు తరచుగా 3 కిలోమీటర్ల పొడవు ఉంటాయి. ఇవి ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైళ్లు. ఇంత పెద్ద నెట్‌వర్క్ ఉన్న, అక్కడ అత్యంత వేగవంతమైన ప్యాసింజర్ రైలు గరిష్ట వేగం గంటకు 240 కిలోమీటర్లు మాత్రమే. ఇది యూరప్, జపాన్ బుల్లెట్ రైళ్ల కంటే చాలా తక్కువ.

ఆర్థిక వ్యవస్థకు, పర్యావరణానికి ఎలా మేలు 
అమెరికా సప్లయ్ చైన్  సజావుగా సాగడానికి ఈ రైల్వేలే కారణం. పరిశ్రమలకు కావలసిన ముడిసరుకును, ఓడరేవుల నుండి కంటైనర్లను ఇవి దేశవ్యాప్తంగా రవాణా చేస్తాయి. పర్యావరణ పరంగా కూడా ఇవి ఎంతో మేలు చేస్తున్నాయి. భారీ ట్రక్కులతో పోలిస్తే, రైళ్ల ద్వారా సరుకు రవాణా చేయడం వల్ల ఇంధనం ఆదాతో పాటు హానికరమైన ఉద్గారాలు (Emissions) చాలా తక్కువగా విడుదలవుతాయి. అందుకే అమెరికా   రైల్వే మౌలిక సదుపాయాలపై ఎప్పుడు లక్షల కోట్లు పెట్టుబడి పెడుతూనే ఉంటుంది.