సర్కారు బడి పిల్లలకు బ్రాండెడ్ లుక్..కార్పొరేట్‌‌‌‌కు దీటుగా యూనిఫాం, షూస్

సర్కారు బడి పిల్లలకు బ్రాండెడ్ లుక్..కార్పొరేట్‌‌‌‌కు దీటుగా యూనిఫాం, షూస్
  • మఫత్‌‌‌‌లాల్ క్లాత్.. నాణ్యమైన కిట్లు
  • తొలిసారిగా ఇంటర్ విద్యార్థులకూ బ్యాగ్‌‌‌‌లు, బూట్లు 
  • కేంద్రీకృత సేకరణతో అక్రమాలకు చెక్.. రూ. 687 కోట్లు కేటాయింపు

హైదరాబాద్, వెలుగు: సర్కారు స్కూళ్లు, గురుకులాల్లో చదివే పేద విద్యార్థులు ఇకపై కార్పొరేట్ స్కూల్ పిల్లలకు ఏమాత్రం తీసిపోని విధంగా మెరిసిపోనున్నారు. విద్యార్థులకు నాణ్యమైన యూనిఫాంలు, బ్రాండెడ్ షూస్‌‌‌‌, సాక్సులు, టై, బెల్టులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్‌‌‌‌రెడ్డి.. వస్త్రం సరఫరా నుంచి కుట్టు పని వరకు ప్రతి దశలోనూ క్వాలిటీ విషయంలో రాజీ పడొద్దని అధికారులను ఆదేశించారు.

 దీనికోసం ప్రభుత్వం రూ. 687.78 కోట్లు ఖర్చు చేస్తోంది. గతంలో నాసిరకం యూనిఫామ్స్‌‌‌‌తో విద్యార్థులు ఇబ్బంది పడేవారు. ఈసారి ఆ పరిస్థితి లేకుండా, దేశంలోనే పేరున్న మఫత్‌‌‌‌లాల్ కంపెనీ నుంచి యూనిఫాం క్లాత్‌‌‌‌ను సేకరిస్తున్నారు. మొత్తం 27 లక్షల మంది విద్యార్థులకు రెండు జతల యూనిఫాంల కోసం 2.97 కోట్ల మీటర్ల వస్త్రాన్ని కొనుగోలు చేశారు. ఇందులో మఫత్‌‌‌‌లాల్ నుంచి 2.41 కోట్ల మీటర్లు, తెలంగాణ చేనేత సహకార సంస్థ నుంచి 55.32 లక్షల మీటర్లు సేకరించారు. 

యూనిఫాం కుట్టు పనిని రాష్ట్ర ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించింది. రోజుకు సుమారు లక్ష యూనిఫాంలు కుట్టే సామర్థ్యం ఉన్న ఈ సంఘాలకు, ఒక్కో జతకు కుట్టుకూలిగా రూ.75 చెల్లిస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలకు రూ.40 కోట్లకు పైగా ఆదాయం సమకూరనుంది. ఒకవైపు విద్యార్థులకు మేలు చేస్తూనే, మరోవైపు మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం బాటలు వేసింది. 

కాలేజీ స్టూడెంట్లకు బ్యాగ్‌‌‌‌లు

రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా సర్కారు జూనియర్ కాలేజీల్లో చదివే 2 లక్షల మంది విద్యార్థులకు కాలేజీ బ్యాగ్‌‌‌‌, బెల్టు, టై, నల్లటి బూట్లు, సాక్సులను ప్రభుత్వం అందజేస్తోంది. ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల విద్యార్థులకు, కేజీబీవీ, యూఆర్ఎస్‌‌‌‌ల్లో చదివే స్టూడెంట్లకు స్కూల్ బ్యాగ్‌‌‌‌, షూస్, సాక్స్‌‌‌‌లతో పాటు బెడ్డింగ్ సామగ్రి, ప్లేటు, గ్లాసు, కటోరా, ట్రంక్ బాక్సు, ట్రాక్ సూట్ వంటి వస్తువులతో కూడిన పూర్తిస్థాయి కిట్‌‌‌‌ను అందజేయనున్నారు. మైనారిటీ గురుకుల పిల్లలకు ఫస్ట్ టైమ్ నైట్ డ్రెస్‌‌‌‌లు, ట్రాక్ సూట్లు ఇస్తున్నారు. సర్కారు స్కూళ్లు, మోడల్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు తొలిసారిగా నల్లటి బూట్లు, బెల్టును రాష్ట్ర ప్రభుత్వం అంద‌‌‌‌జేయ‌‌‌‌నుంది. 

అక్రమాలకు ‘సెంట్రలైజ్డ్’ బ్రేక్

గత ప్రభుత్వ హయాంలో ఒక్కో విభాగం వేర్వేరుగా కొనుగోళ్లు చేయడం వల్ల నాణ్యతలో తేడాలు, భారీగా అవకతవకలు జరిగేవి. సరఫరాలో కొన్ని ముఠాలు పాతుకుపోయి నాసిరకం వస్తువులను పంపిణీ చేసేవి. వీటన్నింటికీ అడ్డుకట్ట వేస్తూ రేవంత్ సర్కార్ ఈ ఏడాది ‘సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌‌‌‌మెంట్ సిస్టమ్’ను తీసుకొచ్చింది. దీంతో అన్ని స్కూళ్లకు ఏకకాలంలో నాణ్యమైన వస్తువులు అందనున్నాయి. టెండర్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని, ప్రతిపక్షాల ఆరోపణల్లో అర్థం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

చేనేత, లెదర్ కార్మికులకు దన్ను

యూనిఫాం, బెడ్డింగ్ ఆర్డర్లలో 25–30 శాతం వాటాను టెస్కోకు అప్పగించి ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకుంది. అలాగే టైలు, బెల్టులు, ఐడీ కార్డుల ఆర్డర్‌‌‌‌ను తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్‌‌‌‌కు ఇవ్వడం ద్వారా ఆ సంస్థలోని కార్మికులకు ఉపాధి కల్పించింది. ఇప్పటికే పాఠ్య పుస్తకాలు స్కూళ్లకు చేరుకున్నాయని, బడి తెరిచిన తొలి వారంలోనే పంపిణీ పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు. మరోపక్క కిట్లనూ త్వరలోనే అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.