- ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశాలు
- నిబంధనలు కఠినంగా ఉండాలని సూచన
- మొత్తం స్కూళ్లను కేటగిరీలుగా విభజించే యోచన
- ఆ ప్రకారమే నిర్దిష్ట ఫీజుల ఖరారు
- ఈ నెలలోనే రూల్స్ తెచ్చేందుకు సర్కారు కసరత్తు
హైదరాబాద్, వెలుగు:ప్రైవేటు విద్యాసంస్థల ఇష్టారాజ్యానికి, ఫీజుల పేరిట సాగుతున్న నిలువుదోపిడీకి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో.. ప్రైవేటు యాజమాన్యాలు విడతలవారీగా (ఇన్‌స్టాల్‌మెంట్స్) ఫీజులు వసూలు చేసేలోపే కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చి.. వారిని కట్టడి చేయాలని భావిస్తోంది. విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలు రెడీ చేయాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలుస్తోంది.
రూల్స్ విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని, కఠినంగా వ్యవహరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఏటా అడ్మిషన్ల పేరిట మధ్యతరగతి, పేద తల్లిదండ్రుల రక్తాన్ని పిండి రూ. వేల కోట్లు కొల్లగొడుతున్న ప్రైవేటు స్కూళ్లు, ఇంటర్ కాలేజీల అక్రమ వసూళ్లకు తక్షణమే అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా చట్టపరమైన చర్యలకు పూనుకోవాలన్నారు. అత్యధికంగా పొలిటికల్‌గా యాక్టివ్‌గా ఉన్నవాళ్లే విద్యాసంస్థలు నడుపుతున్నందున.. ఎక్కడా రాజీపడకుండా కఠినంగా వ్యవహరించేలా ఫీజుల కట్టడి మార్గదర్శకాల వ్యవస్థ ఉండాలని సూచించారు.
ఇతర రాష్ట్రాల విధానాలపై స్టడీ.. రిపోర్టులు సిద్ధం
రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల నియంత్రణపై ఇప్పటికే తిరుపతి రావు కమిటీ, తెలంగాణ విద్యా కమిషన్‌తోపాటు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు నివేదికలు సమర్పించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలపైనా అధికారులు సుదీర్ఘంగా అధ్యయనం చేశారు. ముఖ్యంగా తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీ రాష్ట్రాల్లో ఫీజుల కట్టడికి అనుసరిస్తున్న చట్టాలు, అక్కడి కోర్టుల తీర్పులను క్షుణ్నంగా పరిశీలించి ప్రభుత్వానికి పలు సిఫార్సులు చేశారు. ఈ నివేదికల ఆధారంగానే ప్రతిపాదనలకు తుదిరూపు ఇవ్వాలని సీఎస్, సీఎంవో అధికారులకు సీఎం ఆదేశించినట్టు తెలిసింది.
3 కేటగిరీలుగా స్కూళ్ల విభజన
ఫీజుల నిర్ణయం అందరికీ ఒకేలా కాకుండా, విద్యాసంస్థల్లో ఉన్న వసతులు, మౌలిక సదుపాయాల ఆధారంగా శాస్త్రీయంగా వర్గీకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని మొత్తం ప్రైవేటు స్కూళ్లను 3 కేటగిరీలుగా విభజించనున్నారు. ల్యాబ్‌లు, లైబ్రరీ, ఆట స్థలం, భవన వసతులు, ఉపాధ్యాయుల జీతభత్యాల ఆధారంగా ఏ కేటగిరీ స్కూల్‌కు ఎంత ఫీజు ఉండాలనే గరిష్ట పరిమితిని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. దీనివల్ల సాధారణ వసతులు ఉంటూ.. డిజిటల్, గ్లోబల్, ఇంటర్నేషనల్ అనే బోర్డులు తగిలించి వేలాది రూపాయలు గుంజే స్కూళ్లకు బ్రేక్ పడనుంది. పకడ్బందీగా అమలుచేసేందుకు ప్రతి స్కూల్‌లో ఫీజు డిస్ ప్లే చేయడంతోపాటు.. పేమెంట్ రిసిప్ట్స్, ప్రభుత్వం తరఫున కంప్లైంట్ బాక్స్ , ఫీజుల చెల్లింపులో యజమాన్యాలతో తల్లిదండ్రుల కమిటీ ఏర్పాటు చేయడంలాంటివి పరిశీలిస్తున్నారు.
విడతల వసూళ్లకు ముందే ‘బ్రేక్’
ప్రస్తుతం అకడమిక్ ఇయర్ (విద్యాసంవత్సరం) ప్రారంభం కావడంతో ఇప్పటికే ప్రైవేట్ యాజమాన్యాలు అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేశాయి. అయితే, చాలావరకు విద్యాసంస్థలు ఫీజులను మూడు లేదా నాలుగు ఇన్‌స్టాల్‌మెంట్లలో వసూలు చేస్తుంటాయి. మొదటి విడత అడ్మిషన్ల సమయంలో తీసుకున్నా.. మిగిలిన విడతల ఫీజులు వసూలు చేసే లోపే కొత్త రూల్స్‌ను తీసుకువచ్చి కట్టడి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల (జూన్) లోనే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన కసరత్తు చేస్తున్నది. ప్రభుత్వ నిర్ణయం అమల్లోకి వస్తే అదనపు ఫీజుల బాదుడు నుంచి తల్లిదండ్రులకు పెద్ద ఉపశమనం లభించనున్నది.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
చదువు అనేది వ్యాపారంగా మారి, సామాన్యుడికి భారం కాకూడదన్నదే ప్రభుత్వ సంకల్పమని, నిబంధనలు ఉల్లంఘించే యాజమాన్యాలపై కఠిన చర్యలు ఉంటాయని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. కేవలం స్కూళ్లే కాకుండా, ఇంటర్మీడియెట్ కాలేజీల ఫీజులపై కూడా తక్షణ నిర్ణయం తీసుకోనున్నారు. మెటీరియల్స్, ఏసీ, స్పెషల్ కోచింగ్‌ల పేరిట దోపిడీ చేస్తే గుర్తింపు రద్దు చేసేలా రూల్స్ రెడీ చేస్తున్నారు. ప్రైవేటు స్కూళ్ల పరిస్థితి, ఇష్టారాజ్యంగా వసూళ్లపై ఎవరైనా సరే.. పలుకుబడిలాంటివి ఏమీ చూడకుండా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నది.
