- 380 ఎకరాల జాగీర్దార్ భూములు సాగు చేసుకుంటున్న 300 మంది రైతులు
- 2017 వరకు అనుభవదారుల కాలమ్ లో రైతుల పేర్లు
- ధరణి వచ్చిన తర్వాత ఆన్లైన్ లో పాత జాగీర్దార్ల పేర్లు
- అప్పట్లో కొనుక్కున్నా, రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడంతో సమస్య
ఖమ్మం/కొణిజర్ల, వెలుగు: ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలోని సింగరాయపాలెం రెవెన్యూ పరిధిలో జాగీర్ భూముల సమస్య దశాబ్దాలుగా కొనసాగుతోంది. సుమారు 380 ఎకరాల భూమిని 300కుపైగా చిన్న, సన్నకారు రైతులు తరతరాలుగా సాగు చేస్తున్నప్పటికీ, వారికి ఇప్పటికీ యాజమాన్య హక్కులు దక్కలేదు. ధరణి అందుబాటులోకి వచ్చే వరకు అనుభవదారుల కాలమ్లో ఆయా భూములు సాగు చేసుకుంటున్న రైతుల పేర్లు ఉండడంతో.. వాటి ప్రకారమే బ్యాంకుల్లో లోన్లు తీసుకొని పంటలు సాగు చేసుకునేవారు. ఆ తర్వాత ధరణిలో పేర్లు లేకపోవడంతో సమస్య మొదలైంది. అప్పటి నుంచి హక్కుల కోసం రైతులు తండ్లాడుతున్నారు. ఇదే అదనుగా జాగీర్దార్ల వారసుల మంటూ కొందరు తెరపైకి వచ్చి, సాగులో ఉన్న రైతులను ఇబ్బంది పెడుతున్నారు.
అప్పట్లో జరిగిందిదీ!
గతంలో సింగరాయపాలెం రెవెన్యూలో హైమదా బేగం, మొహినుద్దీన్, అసద్ అలీ తదితర జాగీర్దార్ కుటుంబ సభ్యుల పేరిట వందల ఎకరాల భూములు ఉండేవి. 1958–1960 కాలంలో ఈ భూములను స్థానిక రైతులకు విక్రయించినప్పటికీ, అధికారిక రికార్డుల్లో మ్యుటేషన్ పూర్తి కాలేదు. దీంతో పట్టాదార్ కాలంలో జాగీర్దార్ల పేర్లు, అనుభవదారు కాలంలో భూములు కొనుగోలు చేసిన రైతుల పేర్లు ఉండేవి. 1975లో అమల్లోకి వచ్చిన భూ సంస్కరణ చట్టం ప్రకారం జాగీర్దారులకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసి అధిక భూములపై వివరణ కోరింది. దీనికి ప్రతిగా జాగీర్దార్లు ఈ భూములు తమ వద్ద లేవని, అప్పటికే రైతులకు విక్రయించామని వరంగల్ ట్రిబ్యునల్‌లో డిక్లరేషన్ సమర్పించారు.
అనంతరం ఈ కేసును ఖమ్మం ఆర్డీవో కోర్టుకు బదిలీ చేస్తూ భూములను ఎవరు సాగు చేస్తున్నారో? క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అధికారులు సాగు చేస్తున్న రైతుల వివరాలను సేకరించినప్పటికీ, రైతుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం, చిన్న, సన్నకారు రైతులు కావడంతో సరైన విధంగా దరఖాస్తులు చేయలేకపోవడం వల్ల సమస్య పరిష్కారం కాలేదు. ఈ పరిస్థితిని అనుకూలంగా మలుచుకుంటున్న జాగీర్దార్ల వారసులు భూములు తమ పూర్వీకులవేనని న్యాయపరమైన వివాదాలు సృష్టించడం ప్రారంభించారు. దీంతో రికార్డుల్లో రైతుల పేర్లు పూర్తిగా నమోదు కాకుండా సమస్య మరింత క్లిష్టమైంది. పహాణీలు, అడంగల్ రికార్డుల్లో రైతుల పేర్లు నమోదై ఉండడంతో 2017 వరకు బ్యాంకుల నుంచి వ్యవసాయ రుణాలు పొందిన రైతులు, ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చాక ఆన్‌లైన్ రికార్డుల్లో పేర్లు కనిపించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
పంటల నమోదు, విక్రయాల్లోనూ ఇబ్బందులే!
ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములపై పూర్తి హక్కులు లేకపోవడంతో ఎరువులు కొనుగోలు చేయడం, పంట విక్రయాలు చేయడం, వ్యవసాయ రుణాలు పొందడం, ఇతర ప్రభుత్వ పథకాల లబ్ధి పొందడం వంటి ప్రయోజనాలు దక్కడం లేదని రైతులు వాపోతున్నారు. యాజమాన్య హక్కులు లేకపోవడంతో భూములను తనఖా పెట్టడం, విక్రయించడం, కుటుంబ సభ్యుల పేర్లపై మార్పిడి చేయడం కూడా సాధ్యం కావడం లేదు. భూముల మార్కెట్ విలువ పెరిగినా, రైతులు ప్రయోజనం పొందలేకపోతున్నారు. ఈ సమస్యను గత ప్రభుత్వ హయాంలో ప్రస్తుత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రస్తావించినప్పటికీ, అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో ఈ సమస్యపై జోక్యం చేసుకొని పరిష్కారం చూపాలని రైతులు వేడుకుంటున్నారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి పాత పహాణీలు, అడంగల్ రికార్డులు, వ్యవసాయ రుణాల వివరాలు, సాగు ఆధారాలను పరిశీలించి అర్హులైన రైతులకు పూర్తి హక్కులు కల్పించాలని కోరుతున్నారు. ఆరు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ జాగీర్ భూముల సమస్యకు పరిష్కారం లభిస్తే 300కు పైగా రైతు కుటుంబాలకు భరోసా కలుగుతుందని అంటున్నారు.
అర్హులకు న్యాయం చేస్తాం
సింగరాయపాలెం రెవెన్యూ పరిధిలోని వివాదాలు లేని జాగీర్దార్ భూములకు పట్టాదార్ హక్కులు కల్పించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయి. వాటన్నింటిని పరిశీలించి అర్హులైన రైతులకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
- అరుణ, తహసీల్దార్, కొణిజర్ల
