- చాలాచోట్ల ఇండిపెండెంట్లే కింగ్ మేకర్‌లు
- ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటు హక్కుపై ఈసీ క్లారిటీ
- రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలకు స్థానికంగా
- ఓటు హక్కు ఉండాల్సిందే హైకోర్టు తీర్పు మేరకు
- కొత్త మార్గదర్శకాలు.. మారుతున్న సమీకరణాలు
హైదరాబాద్, వెలుగు: హంగ్ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాని చోట్ల ఇండింపెండెంట్లే కింగ్ మేకర్లుగా మారడంతో బేరసారాలు జోరందుకున్నాయి. అన్నిచోట్లా క్యాంపు రాజకీయాలు నడుస్తున్నాయి. సోమవారం పరోక్ష పద్ధతిలో మేయర్, చైర్‌పర్సన్ ఎన్నికలు జరగనున్నాయి. గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లతోపాటు మీటింగ్‌కు హాజరయ్యే ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి 50 శాతానికి పైగా ఓట్లు వచ్చిన పార్టీ అభ్యర్థులే మేయర్, చైర్పర్సన్అవుతారు. డిప్యూటీ మేయర్, డిప్యూటీ చైర్‌పర్సన్ ఎన్నికలు కూడా ఇదే విధంగా నిర్వహిస్తారు. దీంతో హంగ్ మున్సిపాలిటీల్లో ఇండింపెండెంట్లు కీలకంగా మారారు. వీరిని తమవైపు తిప్పుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు బేరసారాలు మొదలుపెట్టాయి. క్యాంపు రాజకీయాలు జోరందుకున్నాయి. ఎక్స్అఫీషియో సభ్యుల ఓటు హక్కుపై శనివారం రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) క్లారిటీ ఇచ్చింది. ఎక్స్అఫీషియో సభ్యులుగా నమోదుచేసుకునే ఎమ్మెల్యేలు, ఎంపీల నియోజకవర్గాల్లో ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు భాగమై ఉండాలి. ఇక రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలకు ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో ఓటు కలిగి ఉండాలి. హైకోర్టు తీర్పుకు తగ్గట్టుగా ఎస్ఈసీ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో చాలా చోట్ల సమీకరణాలు మారనున్నాయి.
మేయర్, చైర్ పర్సన్ ఎన్నికకు అంతా రెడీ..
ఇటీవల ఎన్నికలు ముగిసిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో సోమవారం ఉదయం చైర్‌పర్సన్, మేయర్ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఆయా జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో గెజిట్లు విడుదల చేశారు. కొత్త కౌన్సిలర్లు, కార్పొరేటర్లతోపాటు ఓటు హక్కు నమోదు చేసుకున్న ఎక్స్అఫీషియో సభ్యులు ఉదయం 10 గంటలకల్లా ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జరిగే మీటింగ్‌కు హాజరుకావాలని ఆదేశించారు.
‘చేతులెత్తే పద్ధతిలో ’ మేయర్, చైర్‌పర్స్ ఎన్నికలు జరుగుతాయి. బరిలో ఉన్న ఇద్దరికి సమాన ఓట్లు వస్తే లాటరీ ద్వారా విజేతను ప్రకటిస్తారు. కొత్తగా ఎన్నికైన సభ్యులతోపాటు ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎక్స్అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులకు ఓటు హక్కు ఉంటుంది. ఈ మేరకు వీరి పేర్లను ఆయా జిల్లాల కలెక్టర్లు శనివారం ఫైనల్ చేసి ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఆఫీసర్లకు పంపించారు.
ఎస్‌ఈసీ గైడ్‌లైన్స్‌తో నిజామాబాద్‌లో మారిన సీన్..
రాష్ట్ర ఎన్నికల సంఘం గైడ్‌లైన్స్‌తో నిజామాబాద్ కార్పొరేషన్ లో ఒక్కసారిగా సీన్మారిపోయింది. ఈ కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్లు ఉండగా.. బీజేపీ 28, కాంగ్రెస్ 17, ఎంఐఎం14, బీఆర్‌ఎస్ ఒక సీటు సాధించాయి. ఇక్కడ ఎక్స్అఫీషియో సభ్యులుగా బీజేపీ నుంచి ఎంపీ ధర్మపురి అర్వింద్, బీజేపీకి చెందిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి, లోకల్‌గా ఓటు హక్కున్న ఎమ్మెల్సీ, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఉన్నారు. బీజేపీకి ఇద్దరు ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, అంజిరెడ్డి ఉన్నా.. వీరికి కార్పొరేషన్ పరిధిలో ఓటు హక్కు లేకపోవడంతో ఎన్నికకు దూరం కానున్నారు. 60 మంది కార్పొరేటర్లు, ఐదుగురు ఎక్స్ అఫీషియో సభ్యులు మీటింగ్‌కు హాజరైతే 33 ఓట్లు వచ్చిన అభ్యర్థి మేయర్ అవుతారు. బీజేపీకి 31 ఓట్లు మాత్రమే ఉండగా కాంగ్రెస్‌కు ఎంఐఎం మద్దతుతో కలిపి 33 ఓట్లతో మేయర్సీటు కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిప్యూటీ మేయర్ పదవి మజ్లిస్‌కు ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్లు తెలుస్తున్నది.
ఇక కరీంనగర్ కార్పొరేషన్‌లో 66 డివిజన్లు ఉండగా 30 బీజేపీ,13 కాంగ్రెస్, 9 బీఆర్ఎస్, 3 ఎంఐఎం, 2 ఫార్వర్డ్ బ్లాక్ , 9 ఇండిపెండెంట్లు గెలిచారు. మేయర్ సీట్ దక్కించుకోవాలంటే 34 ఓట్లు కావాలి. బీజేపీ 4 ఓట్ల దూరంలో ఆగిపోవడంతో ఇక్కడ కాంగ్రెస్, ఎంఐఎం కలిసి బీఆర్‌ఎస్, ఇండిపెండెంట్ల సపోర్ట్‌తో మేయర్ దక్కించుకోవాలని భావిస్తుండగా..కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇప్పటికే ముగ్గురు ఇండిపెండెట్లు, ఒక ఏఐఎఫ్‌బీ పార్టీ క్యాండిడేట్‌ను తమ పార్టీలో చేర్చుకొని మేయర్ పీఠం వైపు అడుగులు వేయిస్తున్నారు. మరో ఆరుగురు కార్పొరేటర్లు తమ పార్టీకి టచ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. ఇక్కడ ఆయన ఓటు సైతం ఎక్స్ అఫీషియోగా ఉన్నది. దీంతో బీజేపీ బలం 35 ఓట్లకు చేరింది.
ట్రయాంగిల్ ఫైట్..
- కామారెడ్డి మున్సిపాలిటీలో మొత్తం 49 వార్డులుండగా ఇక్కడ కాంగ్రెస్‌కు 19 , బీజేపీకి 16 , బీఆర్ఎస్‌కు 11 వచ్చాయి. ముగ్గురు ఇండిపెంట్స్ గెలిచారు. ఇండిపెండెంట్లు కాంగ్రెస్ తో జట్టుకట్టి క్యాంపుకు వెళ్లారు. ఇక్కడ చైర్‌పర్సన్ సీటు దక్కాలంటే 25 ఓట్లు అవసరం. ఏ పార్టీకి కూడా ఎక్స్ ఆఫీషియో సభ్యులు లేరు. దీంతో ఏవో రెండు పార్టీలు కలిసి ముందుకు పోవాలి. ఎవరెవరు కలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.
- నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో 12 వార్డు లకుగానూ బీజేపీ4, బీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 3, ఇండిపెండెంట్ఒకటి చొప్పున గెలిచారు. ఇండిపెండెంట్ కాంగ్రెస్‌లో చేరడంతో ఆ పార్టీ బలం నాలుగుకు చేరింది. ఇక్కడ చైర్మన్ ఎన్నిక కావాలంటే ఇంకా రెండు ఓట్లు అవసరం. ఏవో రెండు పార్టీల జత కలిస్తే తప్ప హైడ్రామాకు తెరపడదు.
- మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు ఉండగా కాంగ్రెస్‌కు 6, బీఆర్‌ఎస్‌కు 5, బీజేపీకి 4 సీట్లు వచ్చాయి. చైర్‌పర్సన్‌కు అవసరమైన మద్దతు కోసం 3 పార్టీలు మరో పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నాయి. దీంతో ఇక్కడ ఉత్కంఠ నెలకొన్నది.
- కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో 30 వార్డుల్లో బీఆర్ఎస్ 11, కాంగ్రెస్ 9, బీజేపీ 5, ఎంఐఎం 1, ఇండిపెండెంట్ 4 సీట్లలో విజయం సాధించారు. ఇక్కడ చైర్ పర్సన్ ఎన్నికకు 16 ఓట్లు కావాలి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ దండే విఠల్, ఎంఐఎం అభ్యర్థి సహా నలుగురు ఇండిపెండెంట్ల మద్దతుతో మున్సిపల్ పీఠం కైవసం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నా రెండు సీట్ల దూరంలో ఆగిపోతున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సైతం ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కోసం ప్రయత్నిస్తున్నా.. బీజేపీ అభ్యర్థులు ఎవరి పక్షాన నిలుస్తారన్నది ఆసక్తిగా మారింది.
- భైంసా మున్సిపాలిటీలో 26 వార్డులుండగా బీజేపీ 6, ఎంఐఎం 12, ఇండిపెండెంట్7, కాంగ్రెస్‌కు ఒక్క వార్డు దక్కాయి. గెలిచిన ఐదుగురు ఇండిపెండెంట్లు బీజేపీ రెబల్స్. వీరంతా కూడా ఆ పార్టీ వైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి, మరో ఇండిపెండెంట్ సహకారంతో చైర్‌పర్సన్ సీటు గెలుచుకోవాలని ఎంఐఎం లీడర్ జాబిర్ అహ్మద్
- రాజధానిస్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు.
- ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 49 వార్డులు ఉండగా బీజేపీ 21, కాంగ్రెస్ 11, ఎంఐఎం 6, బీఆర్ఎస్ 6, ఇండిపెండెంట్లు 5 గెలిచారు. చైర్ పర్సన్ సీటు గెలుచుకోవాలంటే 25 ఓట్లు అవసరం కాగా బీజేపీ ఎక్స్ అఫీషియో ఓటర్లుగా ఆదిలాబాద్ ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తోపాటు ఇండిపెండెంట్ల సహకారం కోసం ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సైతం ఎంఐఎం, బీఆర్ఎస్, ఇండిపెండెంట్ల మద్దతు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది.
- జనగామ మున్సిపాలిటీలో 30 వార్డులుండగా బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 12, సీపీఎం ఒకటి, నలుగురు ఇండిపెండెంట్లు గెలిచారు. రెండు పార్టీలకు 13 చొప్పున బలం ఉంది. మరో ఇద్దరు సపోర్ట్ చేస్తేనే చైర్‌పర్సన్ సీటు దక్కనున్నది. ఈ నేపథ్యంలో నలుగురు ఇండిపెండెంట్లు ఏ పార్టీ వైపు వెళ్తే ఆ పార్టీని విజయం వరిస్తుంది.
- ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉండగా, బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7, ఇండిపెండెంట్లు నలుగురు గెలిచారు. చైర్ పర్సన్ కోసం 11 ఓట్లు అవసరం కాగా ఇండిపెండెంట్ల మద్దతు కోసం రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఎక్స్ ఆఫీషియో మెంబర్‌గా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. దీంతో మరో ఇండిపెండెంట్‌కు గాలం వేసేందుకు బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తున్నది. మరోవైపు 7 స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్.. మెజార్టీ మార్క్‌కు చేరుకునేందుకు మరో 4 సీట్లు అవసరం ఉంది. కాగా, గెలిచిన నలుగురు ఇండిపెండెంట్లు కాంగ్రెస్ రెబల్స్ కావడంతో వీరిని లాగే ప్రయత్నాల్లో ఉంది.
ఇండిపెండెంట్లే కీలకం..
రాష్ట్రంలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీరాని మున్సి పాలిటీలు 33, కార్పొరేషన్లు 3 ఉన్నాయి. 19 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీకి ఒకటి నుంచి 3 సీట్లు మాత్రమే తక్కువ పడ్తున్నాయి. ఆయా చోట్ల ఇండిపెండెంట్ల మద్దతుతో చైర్ పర్సన్ స్థానాలను అధికార పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. ఇండిపెండెంట్లు మద్దతివ్వని చోట్ల ఎక్స్ అఫీషియో సభ్యుల సహకారంతో వీటిని తమ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ పకడ్బందీగా పావులు కదుపుతున్నది. ఇక బీఆర్‌ఎస్‌కు 6 చోట్ల, బీజేపీకి నాలుగు చోట్ల ఇలాంటి పరిస్థితి కనిపిస్తున్నది. ఇంకో 4 చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలో ఏ రెండు పార్టీల సభ్యులు ఏకమై తే తప్ప అక్కడ చైర్ పర్సన్ గెలుచుకునే పరిస్థితి లేదు. ఈ 14 సీట్లపై 3 పార్టీలు కన్నేశాయి. ఇండి పెండెంట్ అభ్యర్థులకు, ఇతర పార్టీల్లో గెలిచిన కౌన్సిలర్లకు భారీ మొత్తంలో ఆఫర్లు ఇస్తున్నా యి. కొన్ని చోట్ల డిప్యూటీ చైర్ పర్సన్ పదవులను ఎరవేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటు హక్కుపై ఈసీ క్లారిటీ
ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటు హక్కుపై రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం క్లారిటీ ఇచ్చింది. ఎంపీ, ఎమ్మెల్యే ఏ మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉండాలనుకుంటున్నారో, వారి నియోజకవర్గం పరిధి ఆ మున్సిపాలిటీ ఏరియాలో పూర్తిగా లేదంటే కొంత భాగమైనా కలిసిఉండాలి. అప్పుడే వారికి ఓటేసే అర్హత కల్పిస్తారు. ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యులు మాత్రం తాము ఓటు వేయాలనుకున్న కార్పొరేషన్, మున్సిపాలిటీలో తప్పనిసరిగా ఓటరు అయి ఉండాలి. ఈ మేరకు ఎస్‌ఈసీ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు శనివారం సర్క్యులర్ జారీ చేసింది. గతంలో రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు రాష్ట్రంలో తమకు నచ్చిన మున్సిపాలిటీ/కార్పొరేషన్‌ను ఎంచుకొని ఎక్స్ అఫీషియో సభ్యుల హోదాలో ఓటువేసే అవకాశం ఉండేది. దీనిపై గతంలో హైకోర్టులో వివాదం నడిచింది. విచారణ చేపట్టిన కోర్టు స్థానికంగా ఓటు లేకుండా ఇతర ప్రాంతాల్లో ఓటు వేయడం నిబంధనలకు విరుద్ధమని తేల్చిచెప్పింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎస్ఈసీ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
