ఎటు పోతుందో ఈ సమాజం.. తాగిన మత్తులో భార్య చేతిని నరికి చెరువులో విసిరేశాడు !

ఎటు పోతుందో ఈ సమాజం.. తాగిన మత్తులో భార్య చేతిని నరికి చెరువులో విసిరేశాడు !

సప్త వ్యసనాల్లో ఒకటైన తాగుడు మనిషిలో ఉండే రాక్షసుడిని నిద్ర లేపుతుందని ఈ దారుణమైన ఘటన మరోసారి రుజువు చేసింది. మద్యానికి బానిసైన భర్త భార్య చేయి నరికేసి ఆ నరికిన చేయిని చెరువులో విసిరేసిన అమానుష ఘటన తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో వెలుగుచూసింది.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని నాగపట్నం జిల్లాలోని వేదారణ్యం ప్రాంతంలోని నాగక్కుడైయాన్ గ్రామానికి చెందిన మదన్ రాజ్, అదే ప్రాంతానికి చెందిన ఇలకియా అనే యువతి ప్రేమించుకున్నారు. పదేళ్ల క్రితమే ప్రేమ పెళ్లి చేసుకున్నారు.

బీఫార్మసీ చేసిన ఇలకియా.. కతిరికులం ప్రాంతంలో సొంతంగా మెడికల్ షాప్ నడుపుతోంది. మదన్ రాజ్ బాధ్యత లేకుండా ఉన్నప్పటికీ ఆమె తన సంపాదనతో కుటుంబాన్ని పోషిస్తూ ధైర్యంగా ముందుకు సాగుతోంది. మదన రాజ్ మద్యానికి బానిసగా మారాడు. ఏ పనికీ వెళ్లకుండా భార్య సంపాదనతో తాగుతూ గడుపుతున్నాడు. మద్యానికి డబ్బులివ్వడం లేదని ఇటీవల భార్యతో గొడవ పడ్డాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య చాలాసార్లు గొడవలు జరిగాయి.

►ALSO READ | దగ్గుమందును ఇలా కూడా వాడొచ్చా! బానిసలవుతున్న టీనేజర్లు.. ప్రాణాలు కోల్పోతున్న చిన్నారులు

బలవంతంగా భార్య డబ్బులు తీసుకుని మరీ మద్యం తాగుతూ ఉండేవాడు. ఇంట్లోనే కాకుండా ఫార్మసీకి కూడా వచ్చి మదన్ రాజ్ డబ్బుల కోసం గొడవ చేస్తుండటంతో ఇలకియా విసిగివేసారి పోయింది. ఇదే క్రమంలో.. మదన్ రాజ్ ఇంటికి తాగొచ్చి మద్యం కొనుక్కోవడానికి డబ్బులు కావాలని మళ్లీ గొడవ పడ్డాడు. తాగిన మైకంలో ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో భార్యపై దాడి చేయడానికి ప్రయత్నించడంతో ఆమె ఇంట్లో నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది.

ఈ క్రమంలోనే.. విచక్షణ మరిచి కత్తితో ఆమె వెంటపడిన మదన్ రాజ్ ఆమెను దొరకబట్టి ఆమె కుడి చేతిని నరికేశాడు. ఈ ఘటనలో ఇలకియా చేయి తెగి రోడ్డుపై పడిపోయింది. నొప్పికి తాళలేక ఆమె అరుస్తుండటంతో చుట్టుపక్కల వాళ్లు గమనించి ఆమె దగ్గరకు వెళ్లారు. వాళ్లు కొడతారనే భయంతో మదన్ రాజ్ అక్కడ నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మదన్ రాజ్ను అరెస్ట్ చేసి.. హత్యాయత్నం కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.