బొగ్గు ఉత్పత్తి టార్గెట్ లో సింగరేణి డీలా!..11 నెలల్లో 52.83 మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి

బొగ్గు ఉత్పత్తి టార్గెట్ లో సింగరేణి డీలా!..11 నెలల్లో 52.83 మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి
  • లక్ష్య సాధనకు 17.53 మిలియన్​ టన్నుల దూరంలో సంస్థ
  • ఇంకా మిగిలింది 28 రోజులే..
  • ఐదు ఏరియాల్లో 70 శాతం దాటని ప్రొడక్షన్​

కోల్‌‌బెల్ట్, వెలుగు: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్​సీసీఎల్​) సంస్థ 2025–26 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడం కష్టసాధ్యంగా మారింది. ఆర్థిక సంవ త్సరం ముగియడానికి మరో 28 రోజులు మాత్రమే మిగిలి ఉండగా లక్ష్య సాధన దూరంగా కనిపిస్తోంది. సంస్థ ఈ ఏడాది 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.

అదనంగా ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్ నుంచి 4 మిలియన్ టన్నుల ఉత్పత్తి టార్గెట్ పెట్టుకుంది. అయితే గడిచిన 11 నెలల్లో(మార్చి 3 నాటికి) కేవలం 54.47 మిలియన్ టన్నుల ఉత్పత్తి మాత్రమే జరిగింది. లక్ష్యం చేరుకోవాలంటే మిగిలిన రోజుల్లో 17.53 మిలియన్ టన్నులు సాధించాల్సి ఉంది. అంటే రోజుకు సుమారు 6.5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం రోజుకు 1.5 నుంచి 2 లక్షల టన్నుల మధ్య మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఉత్పత్తిని నాలుగింతలు పెంచడం సాధ్యమయ్యే పనిలా కనిపించడం లేదు.

ప్రతికూల పరిస్థితులతో..

ఈ ఆర్థిక సంవత్సరంలో పలు ప్రతికూల పరిస్థితులు బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం చూపాయి. కొన్ని గనుల జీవితకాలం ముగియడం, కొత్త గనుల ప్రారంభంలో ఆలస్యం, విస్తరణ పనులు నిలిచిపోవడం, భారీ వర్షాలు వంటి కారణాలు ఉత్పత్తిని దెబ్బతీశాయి. అదనంగా, మేడారం జాతర సమయంలో కార్మికులు గైర్హాజరు కావడం, స్థానిక సంస్థల ఎన్నికలు, పర్మినెంట్ సీఎండీ నియామకంలో ఆలస్యం కూడా ప్రభావం చూపినట్లు సమాచారం.

ముఖ్యంగా ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్‌‌లో ఈ ఏడాది ఉత్పత్తి ప్రారంభించలేకపోవడం మరో పెద్ద లోటుగా మారింది. ఓబీ కాంట్రాక్ట్ టెండర్ల సమస్యలతో రామగుండం, శ్రీరాంపూర్, మందమర్రి ఏరియాల్లో ఆశించిన స్థాయిలో ఉత్పత్తి జరగలేదు. కార్మికులకు ప్రోత్సాహక పథకం అమలు చేయకపోవడం కూడా ఉత్సాహాన్ని తగ్గించిన అంశంగా భావిస్తున్నారు.

ఒకే ఏరియా టార్గెట్​ కంప్లీట్​​..

సింగరేణిలోని 12 ఏరియాల్లో సత్తుపల్లి ఏరియా మాత్రమే 101 శాతం లక్ష్యాన్ని సాధించింది. బెల్లంపల్లి 99 శాతం, కొత్తగూడెం 92 శాతం, మణుగూరు 92 శాతం, ఆర్జీ-(2) 92 శాతం సాధించి లక్ష్యానికి దగ్గరగా ఉన్నాయి. ఇక, అడ్రియాల లాంగ్‌‌వాల్ ప్రాజెక్టు(ఏపీఏ) మాత్రం 11 శాతం ఉత్పత్తితో చివరి స్థానంలో నిలిచింది. మిగతా ఏరియాలు 70 శాతం లోపే ఉన్నాయి.