- మానసహిల్స్‌లో మంత్రి పొంగులేటి సంస్థ కొండలను పిండి చేస్తున్నది
- సీఎం అల్లుడి అనుచరులకు 17 ఎకరాలు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టిన్రు
- ఎలాంటి అనుమతులు లేకుండా మైనింగ్ ఎట్లా చేస్తరు? అని ప్రశ్న
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అక్రమ మైనింగ్, రియల్ ఎస్టేట్ దందాలకు పాల్పడుతున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. అసలు రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వమా? లేక రియల్ ఎస్టేట్ కంపెనీనా? అని ప్రశ్నించారు. రాజేంద్రనగర్ మానసహిల్స్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా మంత్రి పొంగులేటి సంస్థ రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కొండలను పిండి చేస్తున్నదని అన్నారు. సీఎం రేవంత్ అల్లుడి అనుచరులకు ఎలాంటి ఓపెన్ బిడ్డింగ్ లేకుండా 17 ఎకరాల ప్రభుత్వ భూమి కట్టబెట్టారని మంగళవారం హరీశ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
పేదల ఇండ్లను కూల్చే హైడ్రాకు.. మంత్రులు, వాళ్ల బంధువులు చేస్తున్న అక్రమ క్వారీలు, భూకబ్జాలు ఎందుకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. వెంటనే అక్రమ మైనింగ్ నిలిపివేసి, దోచుకున్న సంపదను పెనాల్టీతోసహా రికవరీ చేయడంతోపాటు అడ్డగోలు భూకేటాయింపులను రద్దుచేయాలని డిమాండ్ చేశా రు. నిబంధనలకు తూట్లు పొడుస్తూ, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ క్వారీలతో సహజ సంపదను కొల్లగొట్టే గలీజ్ దందా చేస్తుంటే రెవెన్యూ, మైనింగ్, పీసీబీ, హెచ్ఎండీఏ అధికారులు ఎందుకు అటువైపు కన్నెత్తి చూడటం లేదని అడిగారు.
రాత్రి, పగలు తేడా లేకుండా భారీ యంత్రాలతో బండరాళ్లను తొలుస్తూ, అక్రమంగా తరలిస్తూ వ్యాపారం చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదని అన్నారు. సాధారణ వ్యక్తులకు ఒక న్యాయం? మంత్రికి ఒక న్యాయమా? అని ప్రశ్నించారు. విద్యుత్, పర్యావరణ, గనుల శాఖలు ఎందుకు మొద్దు నిద్ర నటిస్తున్నాయని ప్రశ్నించారు. ఆయా శాఖల్లోని విజిలెన్స్ విభాగాలు పని చేయడం లేదా? లేక సహచర మంత్రి చీకటి వ్యాపారానికి ఉద్దేశపూర్వకంగానే సహకరిస్తున్నా యా? అని నిలదీశారు. ఇందులో ఎవరెవరికి ఎంతెంత వాటాలు ముడుతున్నాయి? అని ఆయన ప్రశ్నించారు.
మైనింగ్‌కు అనుమతులే లేవు..
మంత్రి సంస్థ మైనింగ్ చేసుకునేందుకు ఎలాంటి అను మతులూ లేవని హరీశ్‌రావు ఆరోపించారు. టీఎస్‌పీసీబీ నుంచి కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్‌మెంట్, కన్సెంట్ ఫర్ ఆపరేషన్, పర్యావరణ అనుమతి, మైనింగ్/క్వారీయింగ్ లీజ్– మైన్స్, జియాలజీ విభాగం పర్మిషన్, స్థానిక గ్రామపంచాయతీ/మున్సిపల్ అనుమతి, ల్యాండ్ యూజ్ మార్పిడి, హెచ్ఎండీఏ క్లియరెన్స్, ఎక్స్‌పోజివ్స్ లైసెన్స్, గ్రౌండ్ వాటర్ అనుమతులు, రెవెన్యూ పర్మిషన్స్‌లాంటివి ఏవీ లేవు అని తెలిపారు. “ఒక వైపు సీఎం కుర్చీలో కూర్చొని రేవంత్‌రెడ్డి.. రియల్ ఎస్టేట్ దందా కోసం పేదల ఇండ్లు కూల్చుతడు.
మరోవైపు అదే సీఏం తన అల్లుడి అనుచరుల క్వారీ కోసం ఎలాంటి బిడ్డింగ్ లేకుండా గంపగుత్తగా 17 ఎకరాల ప్రభుత్వ భూమి నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ పద్ధతిలో కట్టబెడతడు. ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం జరుగుతున్నదని, ఓపెన్ బిడ్డింగ్ పిలవాలని మేం డిమాండ్ చేస్తే 3 రోజులైనా తేలు కుట్టిన దొంగల్లా ఉలుకరు పలకరు. ఇంకోవైపు మంత్రి పొంగులేటి అక్రమ క్వారీతో ఏకంగా కొండలనే ఖతం చేస్తడు. ప్రభుత్వ భూములు రక్షించాల్సిన సీఎం, మంత్రులే బకాసురులుగా మారి భూము లను భక్షిస్తుంటే ఇక రక్షించే వారెవరు?” అని హరీశ్ రావు ప్రశ్నించారు.
