పశ్చిమబెంగాల్ లో మరోసారి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మాజీ సీఎం మమతా బెనర్జీ కారుపై బురద, ఇటుకలు, రాళ్లతో దాడి జరగటం ఆందోళనకరంగా మారింది. 2026 ఆగస్టు 9వ తేదీన జరిగిన దాడితో బెంగాల్ మరోసారి భగ్గుమన్నది.
పోలీసు కస్టడీలో మృతి చెందిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న క్రమంలో.. దీదీ కాన్వాయ్ పై కొందరు దుండగులు దాడులకు దిగారు. రాళ్లు, ఇటుకలతో పాటు బురద చల్లి రచ్చ రచ్చ చేశారు. 24 పరగనాల జిల్లాలో జరిగింది ఈ దాడి.
దీదీ కాన్వాయ్ కు అడ్డువచ్చిన కొందరు దొంగ అంటూ నినాదాలు చేస్తూ బాటిల్స్, చెప్పులు విసిరారు. పోలీసులు విశ్వప్రయత్నం చేసి నిరసనకారులను అడ్డుకున్నారు.
చనిపోయి ఉండేదాన్ని:
నిరసనకారుల దాడిపై మాజీ సీఎం మమతా బెనర్జీ భయాందోళనకు గురయ్యారు. రౌడీ మూకలు తమపై దాడి చేశాయని.. కాస్తయితే చచ్చిపోయి ఉండేదాన్ని అని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల ముందే సంఘవిద్రోహ శక్తులు దాడులకు దిగాయి. కారు అద్దాలు మూసి ఉండకుంటే నా తల పగిలిపోయాది.. నేను చచ్చేదాన్ని.. ఇంత ఘోరమైన దాడి నా జీవితంలో చూడలేదు. పోలీసులు చేసిందేమీ లేదు.. బీజేపీ నేతలను, కార్యకర్తలను మాత్రమే కాపాడారు.. అని అన్నారు. బీజేపీ చేసిన దాడి అని ఆరోపించారు.
►ALSO READ | సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్కు షాక్.. ముఖ్య అతిథిగా వద్దంటూ హైదరాబాద్ నల్సార్ విద్యార్థుల లేఖ
దీదీతో పాటు ఎంపీలు కళ్యాణ్ బెనర్జీ, దోలా సేన్ ఘటనా సమయంలో ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం, పోలీసులు దాడులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. పోలీసులను ఉపయోగించి సీఎం సువేందు అధికారి డ్రామా నడిపిస్తున్నారని ఆరోపించారు.
మమతపై దాడిని రాష్ట్ర బీజేపీ చీఫ్ సమిక్ భట్టాచార్య ఖండించారు. హింసను సహించేది లేదని అన్నారు. ఈ ఘటనకు బీజేపీకి సంబంధం లేదని అన్నారు. పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
నెల క్రితమే మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీపై అతని సొంత నియోజకవర్గంలో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఏకంగా దీదీపై దాడి జరగటం తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా మారింది.
పోలీసు కస్టడీలో చనిపోయిన బిర్జు కోయెట్ అనే కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు నార్త్ 24 పరగనా జిల్లాను సందర్శించారు దీదీ. ఈ క్రమంలోమార్గమధ్యలోనే కొంత మంది మమత కాన్వాయ్ పై ఊహించని రీతిలో మెరుపు దాడికి దిగారు.
