ఐఐటీ బాంబే(IIT Bombay) లో బిటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో క్యాంపస్‌లో చెలరేగిన ఆందోళనల దృష్ట్యా మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్26, 27 తేదీల్లో జరగాల్సిన మిడ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ను వాయిదా వేసింది. ఈ పరీక్షలను తిరిగి అక్టోబర్ 10, 11 తేదీలలో నిర్వహించనున్నట్లు గురువారం(సెప్టెంబర్ 24) ఐఐటీ బాంబే అధికారికంగా ప్రకటించింది.
ఐఐటీ బాంబేలో ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సెకండియర్ చదువుతున్న సాహిల్ వాకోడే అనే 19 ఏళ్ల విద్యార్థి, సెప్టెంబర్ 18న పరీక్షా హాల్‌లో మొబైల్ ఫోన్ (చాట్‌జీపీటీ) వాడుతూ దొరికిపోయాడు. ఆ తర్వాత తీవ్ర మనస్తాపానికి గురైన సాహిల్, అదే రోజు సాయంత్రం తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
క్యాంపస్‌లో నిరసనలు..
సాహిల్ ఆత్మహత్య విషయం తెలుసుకున్న 400 మందికి పైగా విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. కాలేజీ యాజమాన్యం వేధింపుల వల్లే సాహిల్ ప్రాణాలు కోల్పోయాడని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి.
కుల వివక్ష ఆరోపణలు..
సాహిల్ కుటుంబ సభ్యులు తమ బిడ్డ చనిపోయేంత పిరికివాడు కాదు.. క్యాంపస్‌లో కుల వివక్ష, వేధింపులకు గురయ్యాడని తీవ్ర ఆరోపణలు చేశారు. విద్యార్థిని పట్టుకున్న ప్రొఫెసర్ సూర్యనారాయణ దూల్లా, డైరెక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రొఫెసర్‌ను సెలవుపై పంపించి, కేసు దర్యాప్తు కోసం10 మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఐఐటీ బాంబే ఏర్పాటు చేసింది.
ఎగ్జామ్స్ రీషెడ్యూల్..
విద్యార్థి ప్రతినిధులతో చర్చలు జరిపిన అనంతరం యాజమాన్యం పరీక్షలను వాయిదా వేసింది. రీషెడ్యూల్ చేసిన ఎగ్జామ్స్ అక్టోబర్ 10, 11 (శని, ఆదివారాలు) తేదీల్లో జరుగుతాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ ఈ కేసును దర్యాప్తు చేపట్టింది.
