బెంగళూరు: ఐపీఎల్ కొత్త సీజన్‌లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సొంతగడ్డపై ఆడేందుకు లైన్ క్లియర్ అయింది. ఆర్సీబీ తమ మొత్తం ఏడు హోమ్ మ్యాచ్‌ల్లో ఐదింటిని బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో, మిగిలిన రెండింటిని రాయ్‌పూర్‌లో ఆడుతుందని ఆ ఫ్రాంచైజీ మంగళవారం ప్రకటించింది.
గతేడాది చిన్నస్వామి స్టేడియంలో ట్రోఫీ విజయోత్సవ వేడుకల్లో జరిగిన తొక్కిసలాట ఘటనతో భద్రతా కారణాల దృష్ట్యా ఇక్కడ మ్యాచ్‌ల నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రభుత్వం, పోలీసు శాఖ, కర్నాటక క్రికెట్ అసోసియేషన్ సమన్వయంతో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయడంతో చిన్నస్వామిలో మ్యాచ్‌ల నిర్వహణకు ఫ్రాంచైజీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సీజన్ ప్రారంభ వేడుకలు, తొలి మ్యాచ్‌తో పాటు ప్లే-ఆఫ్స్, ఫైనల్ కూడా చిన్నస్వామిలోనే జరగనుండటం విశేషం.
