- ఒక దేశాధినేత హత్యకు ప్రధాన మంత్రి మద్దతు ఇస్తున్నారా?
- సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే దాడులు సంక్షోభాన్ని పెంచుతాయి
- ఇరాన్‌పై దాడి.. ఇతర దేశాలపై ఇరాన్ దాడులు.. రెండింటినీ ఖండించాలని డిమాండ్
న్యూఢిల్లీ: ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హత్యపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రధానమంత్రి మౌనం ప్రపంచ వేదికలపై భారత్ప్రతిష్టను తగ్గిస్తుందని అన్నారు. అమెరికా–ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది లక్షలాది మంది భారతీయులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని తీవ్ర అనిశ్చిత పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నదని మంగళవారం రాహుల్తన ఎక్స్‌ఖాతాలో పేర్కొన్న పోస్టులో ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘అమెరికా–ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఘర్షణలు సున్నితమైన పశ్చిమాసియా ప్రాంతాన్ని విస్తృత యుద్ధం వైపు నడిపిస్తున్నాయి. కోట్లాది మంది, వారిలో దాదాపు ఒక కోటి భారతీయులు అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు’’ అని ఆయన అన్నారు. దేశాల సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే దాడులు సంక్షోభాన్ని తీవ్రతరం చేస్తాయని, ఇరాన్‌పై ఏకపక్ష దాడులు, ఇతర దేశాలపై ఇరాన్ దాడులు రెండింటినీ ఖండించాలని పేర్కొన్నారు.
‘హింస.. హింసనే పుట్టిస్తుంది. చర్చలు, సంయమనమే శాంతికి ఏకైక మార్గం’ అని చెప్పారు. భారత్ నైతికంగా స్పష్టంగా ఉండాలని, అంతర్జాతీయ చట్టాలు, మానవ ప్రాణాల రక్షణలో ధైర్యంగా మాట్లాడాలని కోరారు. ‘ప్రపంచ క్రమాన్ని కొత్తగా నిర్వచించే మార్గంగా ఒక దేశాధినేత హత్యకు ప్రధాని మద్దతు ఇస్తున్నారా? మన మౌనం ఇప్పుడు ప్రపంచంలో భారత ప్రతిష్ఠను తగ్గిస్తోంది’ అని అన్నారు.
ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై దాడి చేసి ఖమేనీని చంపేసిన సంగతి తెలిసిందే. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ విషయంలో మోదీ మౌనాన్ని సోనియా గాంధీ కూడా ఖండించారు. ఇది తటస్థ వైఖరి కాదని, పరాజయమని అన్నారు.
