బాంబుల మోతతో మిడిల్ ఈస్ట్ మార్మోగుతోంది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులకు దిగడంతో యుద్ధ వాతావరణం తీవ్రరూపం దాల్చింది. యూఎస్ ఎంబసీలే టార్గెట్ గా ఇరాన్ ప్రతి దాడులకు దిగింది. ఈ యుద్ధ పరిణామాలతో గల్ఫ్ దేశాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాలలో విమాన సర్వీసులు నిలిచిపోవడంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లో చిక్కుకుపోయారు. ఈ గందరగోళ పరిస్థితుల నడుమ, గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా సామాజిక మాధ్యమాల వేదికగా శాంతి సందేశాన్ని పంచుకున్నారు. హోలీ పండుగను పురస్కరించుకుని ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ప్రపంచ శాంతి కోసం ఆకాంక్ష
హోలికా దహన్ మంటల చుట్టూ ప్రజలు ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలపై ప్రియాంక చోప్రా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. ఇది చాలా కఠినమైన సమయం, మనసు భారంగా అనిపిస్తోంది. కానీ, చీకటిని చీల్చుకుని వెలుగు దారి చూపుతుందని నేను నమ్ముతున్నాను. చెడుపై మంచి సాధించే విజయానికి ఇది సంకేతం అంటూ ఆమె రాసుకొచ్చారు. యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ప్రియాంక పంచుకున్న ఈ ఆశావాద సందేశం అభిమానుల మనసు గెలుచుకుంటోంది.
దుబాయ్‌లో చిక్కుకున్న సెలబ్రిటీలు
యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లో గగనతలం మూసివేయడంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో మన టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు కూడా దుబాయ్‌లో చిక్కుకుపోయారు. మంచు విష్ణు, ఈషా గుప్తా, నర్గిస్ ఫక్రీ, సోనాల్ చౌహాన్ వంటి నటీనటులు ప్రస్తుతం దుబాయ్‌లోనే ఉండిపోయారు. ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ పి.వి. సింధు కూడా దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. ఆమె బస చేసిన హోటల్ సమీపంలోనే భారీ పేలుడు శబ్దం వినిపించిందని, పరిస్థితి చాలా భయంకరంగా ఉందని ఆమె సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
వరుస సినిమాలతో..
మరోవైపు ప్రియాంక వరుస భారీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. లేటెస్ట్ గా ఆమె నటించిన హాలీవుడ్ యాక్షన్ మూవీ 'ది బ్లఫ్' ఫిబ్రవరి 25, 2026న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై విశేష ఆదరణ పొందుతోంది. ఇందులో ఆమె 'బ్లడీ మేరీ' అనే సముద్రపు దొంగగా (పైరేట్) పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించారు. ఈ సినిమాకు రాజమౌళి, మహేష్ బాబు సైతం సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించారు.
తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్ మూవీ 'వారణాసి'లో ప్రియాంక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా గురించి ఆమె ఒక ఆసక్తికర విషయాన్ని లీక్ చేశారు. ఈ మూవీలోని కొన్ని కీలక సన్నివేశాలను అంటార్కిటికాలో చిత్రీకరించనున్నట్లు ఆమె హింట్ ఇచ్చారు. ఇది ఏప్రిల్ 2027లో విడుదల కానుంది. మరో వైపు హాలీవుడ్ స్టార్స్ విల్ ఫెర్రెల్, జాక్ ఎఫ్రాన్‌లతో కలిసి ప్రియాంక ఒక కామెడీ ఎంటర్టైనర్ 'జడ్జిమెంట్ డే'లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తికావచ్చింది.
