సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌.. ఈ రెండు టీమ్స్లో టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌‌ చేరేదెవరంటే..

సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌.. ఈ రెండు టీమ్స్లో టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌‌ చేరేదెవరంటే..

కోల్‌‌కతా: బలమైన హిట్టర్లు.. నాణ్యమైన బౌలర్లు.. తిరుగులేని ఆల్‌‌రౌండర్లకు కొదవలేని రెండు మేటి జట్ల మధ్య టీ20 వరల్డ్‌‌ కప్‌‌ తొలి సెమీస్‌‌ పోరుకు రంగం సిద్ధమైంది. బుధవారం ఈడెన్‌‌ గార్డెన్స్‌‌లో జరిగే ఈ మ్యాచ్‌‌లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌‌ మధ్య చిన్నపాటి యుద్ధమే జరగనుంది. ముఖ్యంగా ఇద్దరు టాలెంటెడ్ కెప్టెన్లు ఐడెన్‌‌ మార్‌‌క్రమ్‌‌, మిచెల్‌‌ శాంట్నర్‌‌ మధ్య కీలక పోరుగా మారింది. 

2015లో జరిగిన వన్డే వరల్డ్‌‌ కప్‌‌ సెమీస్‌‌తో కివీస్‌‌, సఫారీల మధ్య ఐసీసీ ఈవెంట్‌‌లో పోటీ తారాస్థాయికి చేరుకుంది. ఆ మ్యాచ్‌‌లో కివీస్‌‌ 4 వికెట్ల తేడాతో గెలవడంతో రెండు జట్ల మధ్య వైరం కూడా పెరిగింది. ఆ ఓటమి డేల్‌‌ స్టెయిన్‌‌, డివిలియర్స్‌‌లాంటి సూపర్‌‌ స్టార్ల కెరీర్‌‌కు మచ్చగా మారింది. కానీ ఇప్పుడు కోచ్‌‌ కన్రాడ్‌‌ ఆధ్వర్యంలో సౌతాఫ్రికా అత్యంత బలమైన జట్టుగా రూపొందింది.

గతేడాది వరల్డ్‌‌ టెస్ట్ చాంపియన్‌‌షిప్‌‌ను గెలవడమే ఇందుకు నిదర్శనం. అయితే వైట్‌‌బాల్‌‌ క్రికెట్‌‌లో చెప్పుకోదగ్గ ట్రోఫీని గెలవలేక ‘చోకర్స్‌‌’ అనే ముద్రను మాత్రం తొలగించుకుంది. గత ఎడిషన్‌ ఫైనల్లో ఇండియా చేతిలో ఓడి కొద్దిలో టీ20 కప్‌‌ను చేజార్చుకున్న ఆ జట్టు ఈసారి అజేయంగా సెమీఫైనల్ చేరుకుంది. మరి అదే జోరును కొనసాగిస్తూ  న్యూజిలాండ్‌‌ను పడగొట్టి ఆ జట్టు వరుసగా రెండోసారి ఫైనల్ చేరుతుందా?  లేదా బ్లాక్‌‌క్యాప్స్ టీమ్ ముందుకెళ్తుందా? చూడాలి.

మార్‌‌క్రమ్‌‌ X  శాంట్నర్‌‌
ఈ మ్యాచ్‌‌లో ఇరుజట్ల కెప్టెన్లు మార్‌‌క్రమ్‌‌, శాంట్నర్‌‌పై ఎక్కువ ఫోకస్‌‌ ఉంది. మార్‌‌క్రమ్‌‌ 175 ప్లస్‌‌ స్ట్రయిక్‌‌ రేట్‌‌తో 268 రన్స్‌‌ చేశాడు. పవర్‌‌ప్లేలో ప్రత్యర్థి బౌలర్లపై విధ్వంసకర బ్యాటింగ్‌‌తో రెచ్చిపోవడం సఫారీలకు కలిసొచ్చే అంశం. అదే టైమ్‌‌లో శాంట్నర్‌‌ 6.35 ఎకానమీ రేట్‌‌తో చాలా పొదుపుగా బౌలింగ్‌‌ చేసి బ్యాటర్లను తీవ్ర ఇబ్బందుల్లో పడేస్తున్నాడు. డికాక్‌‌, బ్రెవిస్‌‌, ర్యాన్‌‌ రికెల్టన్‌‌, మిల్లర్‌‌, మార్కో యాన్సెన్‌‌లాంటి పవర్‌‌ హిట్టింగ్‌‌ లైనప్‌‌తో ప్రొటీస్‌‌ ఏ జట్టుకైనా నిద్రలేని రాత్రులను చూపిస్తోంది. కానీ కివీస్‌ జట్టులో రచిన్‌‌ రవీంద్ర 7 ఎకానమీ రేట్‌‌తో 9 వికెట్లు తీసి ప్రత్యర్థులకు దీటుగా జవాబిస్తున్నాడు.

గ్లెన్‌‌ ఫిలిప్స్‌‌, ఇష్‌‌ సోధీ, కోల్‌‌ మెకాంచీ కూడా ఫామ్‌‌లో ఉండటం కలిసొచ్చే అంశం. అయితే నాణ్యమైన రిస్ట్‌‌ స్పిన్నర్‌‌ లేకపోవడం కివీస్‌‌కు లోటుగా కనిపిస్తోంది. ఈడెన్‌‌ పిచ్‌‌పై పరుగుల వరద పారే చాన్స్‌‌ ఉండటంతో ఫిన్‌‌ అలెన్‌‌, టిమ్‌‌ సిఫర్ట్‌‌, ఫిలిప్స్‌‌, డారిల్‌‌ మిచెల్‌‌ బ్యాట్లు ఝుళిపించాలని కివీస్ కోరుకుంటోంది. 

అయితే ఈ పిచ్‌‌పై సఫారీ పేసర్‌‌ లుంగి ఎంగిడి వేసే స్లో డెలివరీలు, వైడ్‌‌ యార్కర్లు, స్లో లెగ్‌‌ కట్టర్లు కివీస్‌‌ బ్యాటర్లపై ఎంతవరకు ప్రభావం చూపిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో కివీస్‌‌ పేసర్‌‌ ఫెర్గూసన్‌‌ తొలి స్పెల్‌‌ను శాసించే అవకాశాన్ని కూడా తీసివేయలేం. మొత్తానికి హోలీడే తర్వాత  ఈ సమ ఉజ్జీల మధ్య సెమీస్ ఫైట్ ఉత్కంఠగా సాగి అభిమానులను అలరించే చాన్సుంది.

జట్లు (అంచనా)
న్యూజిలాండ్‌‌: శాంట్నర్‌‌ (కెప్టెన్‌‌), సిఫర్ట్‌‌, ఫిన్‌‌ అలెన్‌‌, రచిన్‌‌ రవీంద్ర, గ్లెన్‌‌ ఫిలిప్స్‌‌, మార్క్‌‌ చాప్‌‌మన్‌‌, డారిల్‌‌ మిచెల్‌‌, కోల్‌‌ మెకాంచీ / జాకబ్‌‌ డఫీ, నీషమ్‌‌, మ్యాట్‌‌ హెన్రీ, లోకీ ఫెర్గూసన్‌‌.
సౌతాఫ్రికా: మార్‌‌క్రమ్‌‌ (కెప్టెన్‌‌), డికాక్‌‌, ర్యాన్‌‌ రికెల్టన్‌‌, బ్రెవిస్‌‌, డేవిడ్‌‌ మిల్లర్‌‌, ట్రిస్టన్‌‌ స్టబ్స్‌‌, యాన్సెన్‌‌, కార్బిన్‌‌ బాష్‌‌, కగిసో రబాడ, కేశవ్‌‌ మహారాజ్‌‌, లుంగి ఎంగిడి. 

* 5టీ20.. వరల్డ్‌‌ కప్‌‌ మ్యాచ్‌‌ల్లో సౌతాఫ్రికా ఒక్కసారి కూడా కివీస్‌‌ చేతిలో ఓడలేదు. ఆడిన ఐదుసార్లూ గెలిచింది. 
* 32.. ఒక ఎడిషన్‌ టీ20 వరల్డ్‌‌ కప్‌‌లో 300 రన్స్‌‌ చేసిన ఆరో ప్లేయర్‌‌గా నిలిచేందుకు మార్‌‌క్రమ్‌‌కు కావాల్సిన రన్స్‌‌.