Dhanush: ‘ఓం’ మూవీ రిలీజ్ వేళ.. ఫ్యాన్స్‌కు హీరో ధనుష్ కీలక విజ్ఞప్తి

Dhanush: ‘ఓం’ మూవీ రిలీజ్ వేళ.. ఫ్యాన్స్‌కు హీరో ధనుష్ కీలక విజ్ఞప్తి

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఓం’ విడుదలకు ముందే వార్తల్లో నిలుస్తోంది. ఒకవైపు స్టార్ క్యాస్టింగ్.. మరోవైపు ఇంట్రెస్టింగ్ స్టోరీ బ్యాక్ డ్రాప్.. ఇంకోవైపు అడ్వాన్స్ బుకింగ్స్‌లో కనిపిస్తున్న జోరు.. ఇలా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. రేపు శుక్రవారం నవంబర్ 20న విడుదల కానున్న ఈ సినిమాకు తెల్లవారుజామున 6 గంటల నుంచే షోలు ప్రదర్శించుకునేందుకు అనుమతి లభించింది. దీంతో ధనుష్ అభిమానులు తొలి ఆటను చూసేందుకు సిద్ధమవుతున్నారు.

సీఎం విజయ్ కీలక నిర్ణయం..

తమిళనాడు సీఎం విజయ్ ప్రభుత్వం సినిమా రంగానికి గుడ్‌న్యూస్ చెప్పింది. కొత్త సినిమాల విడుదలైన తొలి వారంలో రోజుకు ఆరు షోలు ప్రదర్శించుకునేందుకు అనుమతించింది. ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత 2.30 గంటల వరకు షోలు నిర్వహించుకోవచ్చు. సినిమా నిర్మాతలు, యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, థియేటర్ యాజమాన్యాలు చేసిన విజ్ఞప్తుల నేపథ్యంలో సీఎం విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిబంధనతో నవంబర్ 20న విడుదల కానున్న ధనుష్ ‘ఓం’ సినిమాకు కూడా ఉదయం 6 గంటల షోలకు అనుమతి లభించింది.

సీఎం విజయ్‌కు ధనుష్ థ్యాంక్స్.. ఫ్యాన్స్‌కు కీలక విజ్ఞప్తి!

‘ఓం’ సినిమాకు ఉదయం 6 గంటల షోలకు అనుమతి ఇవ్వడంపై హీరో ధనుష్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు తమిళనాడు సీఎం విజయ్‌తో పాటు ప్రభుత్వానికి ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. సినిమా విజయం వెనుక వందలాది మంది సినీ కార్మికుల కష్టం ఉంటుందని, ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమాను చూడటం ద్వారా వారికి అండగా నిలవాలని కోరారు.

ఫ్యాన్స్ అత్యుత్సాహం వద్దు.. ధనుష్ సూచన!

తెల్లవారుజామున 6 గంటల షోలకు వచ్చే అభిమానులు తప్పనిసరిగా భద్రతా నిబంధనలు పాటించాలని ధనుష్ విజ్ఞప్తి చేశారు. సంబరాల పేరుతో ఇతర ప్రేక్షకులకు ఇబ్బందులు కలిగించవద్దని సూచించారు. థియేటర్లలో సినిమాను ప్రశాంతంగా ఆస్వాదించడమే అసలైన వేడుక అని పేర్కొన్నారు. పైరసీని ప్రోత్సహించకుండా థియేటర్లలోనే సినిమా చూసి సినీ పరిశ్రమకు మద్దతివ్వాలని అభిమానులను కోరారు.

ఎర్రచందనం స్మగ్లింగ్.. అండర్‌కవర్ పోలీస్‌గా ధనుష్!

‘ఓం’ సినిమా కథాంశం కూడా ఆసక్తికరంగా ఉండనుంది. శేషాచలం అడవుల నేపథ్యంలో సాగే ఎర్రచందనం స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ ప్రధాన ఇతివృత్తంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో ధనుష్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. స్మగ్లింగ్ ముఠా గుట్టు రట్టుచేసేందుకు సాధారణ కూలీగా మారి అండర్‌కవర్ ఆపరేషన్ చేపడతారు. ఈ క్రమంలో ఎదురయ్యే పరిణామాలే సినిమా కథలో కీలకం కానున్నాయి. ‘అమరన్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న రాజ్‌కుమార్ పెరియసామి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. 

విడుదలకు ముందే ‘ఓం’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో మంచి జోరు చూపిస్తోంది. నవంబర్ 19 ఉదయం నాటికి దేశవ్యాప్తంగా సుమారు రూ.15.47 కోట్ల గ్రాస్ ప్రీ-సేల్స్ నమోదైనట్లు ట్రేడ్ నివేదికలు వెల్లడించాయి. ఇందులో తమిళ వెర్షన్ రూ.9.71 కోట్లు, తెలుగు వెర్షన్ రూ.5.69 కోట్లతో ముందంజలో ఉన్నాయి. రాష్ట్రాల వారీగా తమిళనాడు తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ మంచి స్పందన కనిపిస్తోంది. తెలంగాణలో రూ.2.95 కోట్లు, ఏపీలో రూ.2.66 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ నమోదయ్యాయి.

►ALSO READ | ENE 2 Review: ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ రివ్యూ.. ఫస్ట్ పార్ట్ మ్యాజిక్ రిపీట్ అయిందా?

ఈ జోరు చూస్తుంటే తొలి రోజు బాక్సాఫీస్ వద్ద ధనుష్‌కు డబుల్ డిజిట్ ఓపెనింగ్ వచ్చే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతేకాదు, తమిళనాడులో ధనుష్ కెరీర్‌లోనే అత్యుత్తమ ఓపెనింగ్ సాధిస్తుందనే అంచనాలు కూడా ఉన్నాయి. మరి ఈ అడ్వాన్స్ బుకింగ్స్ థియేటర్లలోనూ అదే స్థాయిలో వసూళ్లుగా మారతాయా? అనేది ఆసక్తికరంగా మారింది.

భారీ తారాగణంతో ‘ఓం’!

ధనుష్ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ స్టార్ కాస్ట్. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో సాయి పల్లవి ఐపీఎస్ అధికారిణి నిత్యారెడ్డిగా కనిపించనుండగా.. స్మగ్లింగ్ నెట్‌వర్క్‌కు సంబంధించిన కీలక పాత్రలో మమ్ముట్టి అలరించనున్నారు. నజీరుద్దీన్ షా, ఇంద్రన్స్ తదితరులు కూడా నటిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్‌టేక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. రేపు నవంబర్ 20న తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ధనుష్‌కు బిగ్ హిట్ దక్కేనా?

భారీ తారాగణం, ఆసక్తికరమైన కథాంశం, అడ్వాన్స్ బుకింగ్స్‌లో మంచి స్పందనతో ‘ఓం’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా తమిళంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ వస్తున్న ఆదరణ సినిమాకు కలిసొచ్చే అంశంగా మారింది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు సాధిస్తుంది? ధనుష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్‌గా నిలుస్తుందా? మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల కాంబినేషన్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుంది? అన్నది తెలియాలంటే మరికొన్ని గంటలు వరకు వేచి చూడాల్సిందే.