- స్పష్టమైన విధానం లేకపోవడం విదేశాంగ విధానానికే మంచిదికాదని కామెంట్
న్యూఢిల్లీ: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్యపై కేంద్ర ప్రభుత్వం మౌనం వహించడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ విషయంలో మౌనంగా ఉండటం అంటే తటస్థంగా ఉండటం కాదని, అది బాధ్యతల నుంచి తప్పించుకోవడమే అని ఆమె విమర్శించారు. ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రికకు రాసిన వ్యాసంలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత్-–ఇరాన్ సంబంధాలు కేవలం వ్యూహాత్మకమైనవి మాత్రమే కాదని, అవి చరిత్రాత్మకంగా బలమైనవని పేర్కొన్నారు. ‘‘మార్చి 1న తమ సుప్రీం లీడర్ ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్ దళాలు హత్య చేశాయని ఇరాన్ ధ్రువీకరించింది. చర్చలు జరుగుతున్న సమయంలో ఒక దేశాధినేతను ఇలా చంపడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం. ఇలాంటి సమయంలో భారత్ సర్కారు మౌనం వహించడం ఆశ్చర్యకరం” అని వ్యాఖ్యానించారు.
ప్రధాని మోదీ తీరుపై సోనియాగాంధీ మండిపడ్డారు. ‘‘మొదట్లో అమెరికా-–ఇజ్రాయెల్ దాడులను పట్టించుకోకుండా, యూఏఈపై ఇరాన్ చేసిన ప్రతీకార దాడిని మాత్రమే ప్రధాని ఖండించారు. ఆ తర్వాత ‘తీవ్ర ఆందోళన’, ‘చర్చలు–-దౌత్యం’ లాంటి మాటలు మాట్లాడారు. కానీ ఇజ్రాయెల్, అమెరికాలు దాడులు చేయకముందే అక్కడ దౌత్య చర్చలు జరుగుతున్నాయనే విషయాన్ని ఆయన మర్చిపోయారు” అని ఎద్దేవా చేశారు.
కాశ్మీర్ విషయంలో భారత్‌కు ఇరాన్ సపోర్ట్
కాశ్మీర్ విషయంలో గతంలో భారత్‌కు ఇరాన్ ఏవిధంగా అండగా నిలిచిందో ఈ సందర్భంగా మోదీ సర్కారుకు సోనియాగాంధీ గుర్తు చేశారు. ‘‘1994లో కాశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్‌లో భారత్‌కు వ్యతిరేకంగా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) తీర్మానం ప్రవేశపెట్టాలని చూసినప్పుడు, దాన్ని అడ్డుకోవడంలో ఇరాన్ కీలక పాత్ర పోషించింది. ఆ సమయంలో ఇరాన్ జోక్యం వల్ల కాశ్మీర్ అంశం నేషనల్ ఇష్యూ కాకుండా ఆగిపోయింది’’ అని ఆమె గుర్తు చేశారు. అలాగే, పాకిస్తాన్ సరిహద్దు సమీపంలోని జహెదాన్‌లో భారత్ దౌత్యపరమైన ఉనికిని చాటుకోవడానికి ఇరాన్ సహకరించిందని, ఇది చైనా–-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్‌కు గట్టి ఎదురుదెబ్బ అని పేర్కొన్నారు.
2001లో అటల్ బిహారీ వాజ్‌పేయి ఇరాన్ పర్యటనలో రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలను కొనియాడారని గుర్తు చేశారు. ‘‘ఇటు ఇజ్రాయెల్‌తో, అటు ఇరాన్‌తో సంబంధాలు ఉన్నందున భారత్‌కు మధ్యవర్తిత్వం వహించే అవకాశం ఉంది. కానీ, సూత్రబద్ధంగా మాట్లాడకుండా కేవలం అవకాశవాదంతో వ్యవహరిస్తే భారత్ తన విశ్వసనీయతను కోల్పోతుంది” అని సోనియాగాంధీ హెచ్చరించారు.
గతంలో యుద్ధాలు జరిగినప్పుడు భారత్ ఒక స్వతంత్ర శక్తిగా వ్యవహరించడం వల్లే మన పౌరులను కాపాడుకోగలిగామని చెప్పారు. ఇప్పుడు ఏదో ఒక పక్షాన నిలబడితే అది ప్రమాదకరమని అన్నారు. గ్లోబల్ సౌత్ దేశాలకు ప్రతినిధిగా ఉండాలని భారత్ కోరుకుంటున్నదని, కానీ ఒక దేశ సార్వభౌమాధికారం దెబ్బతిన్నప్పుడు భారత్ మౌనంగా ఉంటే, రేపు ఇతర దేశాలు భారత్‌ను ఎలా నమ్ముతాయని ఆమె ప్రశ్నించారు.
