ఏప్రిల్, మేలో హీట్ వేవ్స్.. హైదరాబాద్ సిటీలో ఈసారి ఎండలు ఎలా ఉండబోతున్నాయంటే..

ఏప్రిల్, మేలో హీట్ వేవ్స్.. హైదరాబాద్ సిటీలో ఈసారి ఎండలు ఎలా ఉండబోతున్నాయంటే..
  • దక్షిణ, మధ్య భారతంలో ఎక్కువ ఎఫెక్ట్.. భారత వాతావరణ శాఖ వెల్లడి

హైదరాబాద్ సిటీ, వెలుగు: దేశవ్యాప్తంగా ఈసారి మార్చి నుంచి మే వరకు సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్​లోని భారత వాతావరణ శాఖ  తెలిపింది. వచ్చే ఏప్రిల్, మేలో దక్షిణ, మధ్య భారతంలో హీట్ వేవ్స్  ఎఫెక్ట్  ఎక్కువ ఉంటుందని పేర్కొంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఈసారి దేశవ్యాప్తంగా వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. 2024లో రాష్ట్రంలో ఏప్రిల్​లో మొత్తం14 రోజులు వడగాలుల తీవ్రత ఉంది.

2025లో కూడా దాదాపు ఇదే పరిస్థితి కొనసాగింది. అయితే, 2025 మే నెలలో మాత్రం అల్పపీడనాలు ఏర్పడి వర్షాలు కంటిన్యూగా పడటంతో  హీట్ వేవ్స్ తగ్గాయి. తర్వాత నైరుతి రుతుపవనాలు తొందరగానే వచ్చినప్పటికీ జూన్, జులైలో వర్షాలు ముఖం చాటేశాయి. ఈసారి మాత్రం ఏప్రిల్, మే నెలలో వడగాలుల తీవ్రత అధికంగా ఉండొచ్చు.

హైదరాబాద్​లో వేడి తీవ్రత 

రాజధాని హైదరాబాద్ కూడా వేడి తీవ్రత నుంచి తప్పించుకోలేకపోతోంది. 2024 మేలో నగరంలో 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదు కాగా, 2025లో కూడా 42 నుంచి 44  మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నగర విస్తరణ, కాంక్రీట్  నిర్మాణాలు, చెట్ల కొరత కారణంగా ‘అర్బన్ హీట్ ఐలాండ్’ ప్రభావం పెరుగుతోందని పర్యావరణ నిపుణులు అంటున్నారు. రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు పెద్దగా తగ్గకపోవడం ప్రజలకు ఇబ్బందిగా మారింది.

ఒకేచోట డెవలప్​మెంట్​ కారణం

ప్రధాన నగరాల్లో జనాభా ఒకేచోట విపరీతంగా పెరగడం, అవసరాలు కూడా అదే రీతిలో పెరగడంతో తీవ్ర కాలుష్యం ఏర్పడుతోందని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్  తెలిపారు. కాలుష్యం తగ్గాలంటే చెట్లు పెంచాలని చెప్పారు.