చమురు సరిపోయేది వారాలకే.. మళ్లీ రష్యా వైపే భారత్ చూపు ?

చమురు సరిపోయేది వారాలకే.. మళ్లీ రష్యా వైపే భారత్ చూపు ?
  • హార్ముజ్ ​జలసంధి నుంచి సరఫరా బంద్​
  • ఇతర మార్గాల్లో కొనుగోలుకు ప్రయత్నాలు
  • ప్రతి గంటకూ ఒకసారి పరిస్థితిపై సమీక్ష
  • ఎగుమతులపై ఆంక్షలు విధించే అవకాశం
  • పరిశీలనలో ఎల్‌‌పీజీ రేషనింగ్ ప్రతిపాదన

న్యూఢిల్లీ: పశ్చిమ ఆసియాలో యుద్ధం వల్ల మనదేశ చమురు నిల్వలపై ఆందోళనలు పెరుగుతున్నాయి. మరోవైపు క్రూడ్​ బ్యారెల్​ ధర 80 డాలర్లు దాటింది. ప్రస్తుత నిల్వలు ఎనిమిది వారాలకు మాత్రమే సరిపోతాయని కేంద్రం ప్రకటించింది. 

హార్ముజ్ జలసంధిని ఇరాన్​ మూసివేయడం వల్ల సరఫరాకు ఆటంకం కలుగుతోందని, సమీప భవిష్యత్​లో ఇబ్బందులు రాకుండా ఈ నిల్వలు రక్షణగా నిలుస్తాయని తెలిపింది. భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురు, ఎల్‌‌పీజీలో సగం వాటా ఈ కీలక సముద్రమార్గం నుంచే వస్తుంది. ప్రస్తుతం యూఎస్, ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇరాన్ ఈ మార్గాన్ని మూసేసింది. ఇక్కడ ట్యాంకర్ల రాకపోకలు నిలిచిపోవడంతో బీమా సంస్థలు తమ సేవలను ఉపసంహరించుకున్నాయి. ఈ పరిస్థితిని చమురు మంత్రిత్వ శాఖ గంట గంటకూ పర్యవేక్షిస్తోంది.

మంగళూరు, పాడూరు, విశాఖపట్నంలోని భూగర్భ వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రాలలో సుమారు 100 మిలియన్ బారెళ్ల చమురు అందుబాటులో ఉంది. పైప్‌‌లైన్లు, ఓడల్లో ఉన్న నిల్వలు మరో 25 రోజులకు సరిపోతాయి. సంక్షోభం మరికొంత కాలం కొనసాగితే యూఎస్, రష్యా, పశ్చిమ ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి దేశాల నుంచి దిగుమతులు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. మనదేశం ఏప్రిల్ 2025 నుంచి జనవరి 2026 వరకు 206.3 మిలియన్ టన్నుల చమురు దిగుమతి కోసం 100.4 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.

రెడీ అంటున్న రష్యా
ఇండియాకు ఇబ్బందులు వస్తే తాము ఆదుకుంటామని రష్యా ప్రకటించింది. అయితే అక్కడి నుంచి చమురు కొనుగోళ్లు పెంచడంపై కేంద్రం తర్జనభర్జన పడుతోంది. యూఎస్‌‌తో కుదుర్చుకున్న తాత్కాలిక వాణిజ్య ఒప్పందం ప్రకారం రష్యా నుంచి కొనుగోళ్లు తగ్గించాలి. లేదంటే యూఎస్ సుంకాలు తిరిగి పెరిగే అవకాశం ఉంది. రష్యా చమురును భారీగా కొనుగోలు చేయడం వల్ల ఇంధన ధరలు నియంత్రణలో ఉంటాయి కానీ అంతర్జాతీయ దౌత్య సంబంధాలపై ఒత్తిడి పెరుగుతుంది. 

సుంకాల విషయంలో అమెరికా కఠినంగా వ్యవహరిస్తుండటంతో భారత్ ఆచితూచి అడుగులు వేస్తోంది.   యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగితే అమెరికా షరతుల కంటే దేశీయ ఇంధన అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. చమురు కొరతను అధిగమించడానికి పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై ఆంక్షలు విధించడం తో పాటు ఎల్‌‌పీజీ రేషనింగ్ వంటి అత్యవసర చర్యలను పరిశీలిస్తున్నారు.  

ఉత్పత్తిని కచ్చితంగా పెంచాలి... 
భారత్ తన చమురు అవసరాల కోసం 90 శాతం దిగుమతులపై ఆధారపడటం  దేశ భద్రతకే ముప్పు! దేశీయంగా చమురు ఉత్పత్తిని పది రెట్లు పెంచాలి. భారత్‌‌లో 300 బిలియన్ బారెళ్ల చమురు నిక్షేపాలు ఉన్నాయి.  ఇది గయానా సామర్థ్యం కంటే 30 రెట్లు ఎక్కువ! దిగుమతి ఖర్చులో సగం ధరకే స్వదేశీ చమురును ఉత్పత్తి చేయవచ్చు. అమెరికా తరహాలో చిన్న పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ ఎక్స్​ప్లోరేషన్​ లైసెన్సుల సంఖ్యను 200 నుంచి 2,000కు పెంచాలి. కేవలం రూ.ఐదు కోట్లతో స్టార్టప్‌‌లు డ్రిల్లింగ్ రంగంలోకి వచ్చేలా నిబంధనలు సులభతరం చేయాలి.

వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ చైర్మన్ అనిల్ అగర్వాల్

గ్యాస్​ సరఫరా చేయలేం.. ప్రకటించిన ఖతర్​
భారత్కు అతిపెద్ద సహజ వాయువు సరఫరాదారు ఖతర్ గ్యాస్​ సరఫరాను ఆపుతున్నట్టు ప్రకటించింది. ఇరాన్ డ్రోన్ దాడుల వల్ల  గ్యాస్ ఉత్పత్తి నిలిచిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల భారత పరిశ్రమలకు సరఫరా అయ్యే గ్యాస్​లో 40 శాతం వరకు కోత పడింది. భారత్ ఏటా దిగుమతి చేసుకునే 2.7 కోట్ల టన్నుల లిక్విఫైడ్​ నేచురల్​గ్యాస్​(ఎల్ఎన్​జీ)లో ఖతర్ వాటా 40 శాతం  ఉంది. విద్యుత్ ఉత్పత్తి, ఎరువుల తయారీ, సీఎన్​జీ పంపిణీ వంటి కీలక రంగాలకు ఇది ఎంతో అవసరం.   ఎల్ఎన్​జీ ఉత్పత్తిని నిలిపివేసిన విషయాన్ని గ్యాస్ దిగుమతి సంస్థ పెట్రో నెట్ ఎల్ఎన్​జీ.. మనదేశ గ్యాస్ మార్కెటింగ్ సంస్థలకు తెలియజేసింది.

గ్యాస్ విక్రయ సంస్థలు సీఎన్​జీ అమ్మకాలను కొనసాగిస్తూనే పరిశ్రమలకు ఇచ్చే సరఫరాలో 10 నుంచి 40 శాతం వరకు కోత విధించాయి. పెట్రోనెట్ సంస్థ ఖతార్ నుంచి ఏటా 85 లక్షల టన్నుల ఎల్ఎన్​జీ కొనుగోలుకు దీర్ఘకాలిక ఒప్పందం చేసుకుంది. వీటితో పాటు స్పాట్ మార్కెట్ నుంచి కూడా అదనంగా గ్యాస్ కొనుగోలు చేస్తోంది. గ్యాస్ కొరతను అధిగమించేందుకు గెయిల్, ఐఓసీ సంస్థలు ప్రస్తుతం స్పాట్ మార్కెట్ వైపు చూస్తున్నాయి.  అక్కడా ధరలు భారీగా పెరిగాయి.  ఎల్ఎన్​జీ ధర ప్రస్తుతం ఒక మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్​కు 25 డాలర్లకు చేరింది. ఇది సాధారణ ధరల కంటే దాదాపు రెట్టింపు.