గాంధీ భవన్‌ కు చేరిన కామారెడ్డి కాంగ్రెస్ పంచాయితీ

గాంధీ భవన్‌ కు చేరిన కామారెడ్డి కాంగ్రెస్ పంచాయితీ
  • పీసీసీ క్రమశిక్షణ కమిటీకి కామారెడ్డి నియోజకవర్గ నేతల పరస్పర ఫిర్యాదులు
  • పీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డిపై షబ్బీర్ అలీ అనుచరులు, 
  • షబ్బీర్‌‌పై చంద్రశేఖర్ రెడ్డి వర్గీయుల కంప్లైంట్‌

హైదరాబాద్, కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పంచాయితీ గాంధీ భవన్‌కు చేరింది. నియోజకవర్గానికి చెందిన నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయి పీసీసీ క్రమశిక్షణ కమిటీకి పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డిపై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వర్గీయులు, నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు ఫిర్యాదు చేశారు.

సీనియర్ నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేయడంతో పాటు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని గడ్డం చంద్రశేఖర్ రెడ్డిపై గత నెల 31న పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి ఫిర్యాదు చేశారు. చంద్రశేఖర్ రెడ్డిపై పలు కేసులు ఉండటమే కాకుండా పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఆయనపై చర్య తీసుకోవాలని కోరారు. దీంతో గురువారం చంద్రశేఖర్ రెడ్డికి పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి షోకాజ్ నోటీసు జారీ చేశారు. దీనిపై ఈ నెల 11లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

షబ్బీర్ అలీపై ఫిర్యాదు..

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీపై కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు గురువారం గాంధీ భవన్‌కు వచ్చి మల్లు రవికి ఫిర్యాదు చేశారు. మున్సిపల్ మాజీ చైర్మన్ గడ్డం ఇందుప్రియ, పార్టీ సీనియర్ నాయకుడు మామిండ్ల అంజయ్య ఆధ్వర్యంలో పలువురు నాయకులు చైర్మన్‌ను కలిసి ఫిర్యాదు అందజేశారు. కామారెడ్డి నియోజకవర్గంలో పార్టీలో గ్రూపు తగదాలకు ఆజ్యం పోయటమే కాకుండా పార్టీ బలోపేతం కాకుండా అడ్డుకుంటున్నారని, ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని షబ్బీర్ అలీపై ఫిర్యాదు చేశారు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో రేవంత్ రెడ్డి, నిజామాబాద్‌లో షబ్బీర్ అలీ పోటీ చేయగా.. కామారెడ్డిలో రేవంత్ గెలుపు కోసం షబ్బీర్ అలీ అనుచరులు పని చేయలేదని, ఇదే విషయాన్ని షబ్బీర్ సోదరుడు నహీం కూడా ఆ ఫిర్యాదులో ప్రస్తావించారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఓటమికి షబ్బీర్ అలీ పనిచేశారని అందులో పేర్కొన్నారు.

చంద్రశేఖర్ రెడ్డికి నోటీసులు ఇచ్చాం: మల్లు రవి

షబ్బీర్ అలీ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు. ఈ మేరకు గురువారం గాంధీ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ నెల 11లోపు షోకాజ్‌ నోటీసుపై రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. ఇదే సమయంలో షబ్బీర్ అలీపై గడ్డం ఇందు ప్రియ, ఇతర నేతలు ఇచ్చిన ఫిర్యాదును తీసుకున్నామని ఆయన చెప్పారు. దీన్ని పరిశీలించి విచారణ చేస్తామని వెల్లడించారు.