PEDDI Review: ‘పెద్ది’ ఫుల్ రివ్యూ.. రామ్ చరణ్ మూవీ ఎలా ఉందంటే?

PEDDI Review: ‘పెద్ది’ ఫుల్ రివ్యూ.. రామ్ చరణ్ మూవీ ఎలా ఉందంటే?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో తెరకెక్కిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (PEDDI). ఇవాళ గురువారం (జూన్ 4, 2026న) ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. జాన్వీ కపూర్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటించగా, కన్నడ స్టార్ శివ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు గ్రాండ్ గా నిర్మించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. టీజర్, ట్రైలర్, సాంగ్స్తో భారీ అంచనాలు పెంచుకున్న పెద్ది.. ప్రేక్షకుల్ని ఎంతవరకు అలరించింది? చరణ్ పడిన కష్టానికి, బుచ్చిబాబు ఏ మేరకు న్యాయం చేశాడనేది పూర్తి రివ్యూలో చూద్దాం..  

కథేంటంటే..?

విజ‌య‌నగ‌రానికి స‌మీపంలోని కొండ కింద ఊరికి చెందిన వ్యక్తి పెద్ది (రామ్ చరణ్). ఆ ఊరికి వెళ్లాలంటే కాలి నడకన కొండ‌లు, వాగులు దాటడం తప్ప ఎలాంటి రవాణా సౌకర్యం ఉండదు. పక్కనే రైల్వే ట్రాక్ ఉన్నా ఆ ఊరికి పేరు, ఎలాంటి గుర్తింపు లేదు కనుక రైలు అక్కడ ఆగదు. అక్కడ ఎవ‌రికి ఓటు హ‌క్కు లేకపోవడంతో ప్రభుత్వం, రాజకీయ నేతలు వాళ్లను పట్టించుకోరు. విజయనగరం బెల్లం బట్టీలలో పని చేస్తూ వచ్చే అరాకొర కూలీతో అక్కడి వాళ్లంతా జీవనం సాగిస్తుంటారు. పెద్ది ఆ పనితో పాటు ఆట కూలీగా క్రికెట్ ఆడుతుంటాడు. ఏ ఊరి ప్రజలు ఎక్కువ డబ్బులకు పాడుకుంటే ఆ ఊరి తరఫున క్రికెట్ ఆడుతూ, తనదైన ఆట తీరుతో ఆ ప్రాంతంలో చక్కని గుర్తింపు తెచ్చుకుంటాడు. 

అలాగే లోకల్ పొలిటీషియన్ (రావు రమేష్) కూతురు అచ్చియమ్మ (జాన్వీ కపూర్) ను ప్రేమిస్తుంటాడు. ఆమె కారణంగా రామ్ బుజ్జి (దివ్యేందు శర్మ)తో గొడవ పడతాడు. దాంతో క్రికెట్ ఆటలో పెద్దిని అవమానించి తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తారు. మరోవైపు రైల్వే స్టేషన్ తోనే తమ ఊరికి గుర్తింపు వస్తుందని 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్న అప్పలసూరి (జగపతి బాబు) చేసిన త్యాగం, తదనంతర పరిస్థితులు పెద్దిలో మార్పు తీసుకొస్తాయి. ఆ మార్పు ఏమిటి..? ఎంతో ఇష్ట‌మైన క్రికెట్‌ను వ‌దిలి గౌర్నాయుడు ( శివ రాజ్ కుమార్) దగ్గర కుస్తీ ఎందుకు నేర్చుకున్నాడు..? రెజ్లింగ్ లో  నేష‌న‌ల్స్ వ‌ర‌కు వెళ్లిన పెద్దికి ఎదురైన అడ్డంకులు ఏంటి..? కుస్తీ నుంచి మరో ఆటకు ఎందుకు మారాల్సి వచ్చింది..? అందుకోసం అతను చేసిన త్యాగం ఏమిటి.. తన ఊరికి గుర్తింపును, రైల్వే స్టేషన్‌ను ఎలా తీసుకు వచ్చాడు..? అనేది అసలు కథ.

ఎలా ఉందంటే..? 

సింగిల్ లైన్‌గా చెప్పాలంటే ‘‘ప్రపంచం గెలిచిన వాడి మాటే వింటుంది.. తన గెలుపుతో ఊరికి గుర్తింపు తీసుకురావాలి..” అనేది ‘పెద్ది’ స్టోరీ ఇది. మనిషికి గుర్తింపు అనేది ఆత్మ గౌరవం. కానీ ఒక ఊరికే గుర్తింపు లేకపోతే..! ప్రభుత్వ రికార్డుల్లో లేని తన ఊరి ఆత్మగౌరవం కోసం విజయనగరం నుంచి ఢిల్లీ వరకు ఓ క్రీడాకారుడు చేసిన స్ఫూర్తిదాయక ప్రయాణం ఈ సినిమా. క్రికెట్, కుస్తీ నేపథ్యంలో వచ్చే సీన్స్‌ సినిమాకు మేజర్‌‌ హైలైట్‌గా నిలిచాయి. ముఖ్యంగా ఇద్దరు రెజ్లర్స్‌తో పెద్ది ఒకేసారి పోరాడే సీన్‌లో హీరోయిజాన్నిఎలివేట్ చేసిన తీరు కిక్ ఇస్తుంది. అయితే ఫస్ట్ హాఫ్‌లోని కొన్ని సీన్స్‌ సినిమాకు పెద్ద మైనస్‌. విజయ నగరం నేపథ్యంలో వచ్చే సీన్స్‌ మెయిన్ స్టోరీలైన్‌కు సంబంధం లేకుండా విసిగిస్తాయి. హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్ కూడా అంతగా కనెక్ట్ అవదు. బలవంతంగా ఇరికించిన భావన కలుగుతుంది.

అప్ప‌ల‌సూరి ప్రాణత్యాగం, తన బాడీ కోసం రైల్వే పోలీసుల‌తో పెద్ది ఫైట్ చేసే సీన్స్‌తో అసలు స్టోరీ ట్రాక్ ఎక్కుతుంది. సెకండాఫ్‌లో వచ్చే సీన్స్‌, ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌ను రాసుకున్న తీరు ఇంప్రెస్ చేస్తుంది. రెగ్యులర్‌‌ కమర్షియల్ సినిమాకు భిన్నంగా ఆ సీన్స్‌ తీర్చిదిద్దారు. స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఇలా క్రాస్‌ ఓవర్‌‌ అథ్లెట్‌ స్టోరీతో సినిమా రావడం ఈ సినిమాకు ప్లస్ అయింది. కానీ అదే కొంత మైనస్ కూడా. రెండో ఆటకు మూడో ఆటకు మధ్య ట్రాన్సిషన్ సరిగా కుదరలేదు. ఆ సీన్స్‌ కొంత హడావుడిగా ముగిసినట్టు అనిపిస్తాయి. రామ్ చరణ్ క్యారెక్టర్, నటన మీద ఎక్కువ ఫోకస్ పెట్టిన దర్శకుడు... జగపతిబాబు, శివరాజ్ కుమార్ మినహా మిగతా పాత్రలను అంతగా పట్టించుకోలేదు. ముఖ్యంగా ఒక ఊరి కోసం వ్యక్తి చేసే పోరాటంలో ఆ ఊరు, అక్కడి భావోద్వేగాలు కనిపించాలి. అప్పలసూరి, పెద్ది పాత్రలకే ఆ పోరాటాన్ని పరిమితం చేశారు.

రైల్వే స్టేషన్ కోసం, తమ గుర్తింపు, ఆత్మగౌరవం కోసం గ్రామస్థులు ఎంతలా తపన పడుతున్నారో చూపించలేకపోవడం వల్ల స్టోరీలో ఎమోషనల్ కనెక్ట్ కొంత మిస్ అయ్యింది.  ఇక సీన్‌కు తగ్గట్టు విలన్ వచ్చిపోవడం మినహా బలమైన విలన్ ట్రాక్ కూడా లేదు. ఫస్ట్ హాఫ్‌లో నెగిటివ్ క్యారెక్టర్స్‌ సెకెండాఫ్‌లో అనూహ్యంగా మారిపోతాయి. బోమన్ ఇరానీ పోషించిన నేషనల్ ఒలంపిక్స్‌ టీమ్ మెంబర్‌ పాత్రకు జాతీయ స్థాయిలో, రెండు ఆటల్లో సత్తా చాటిన స్పోర్ట్స్ పర్సన్ గురించి తెలియకపోవడం, తనకు ఆ ఊరి వ్యక్తి చెప్పే ‘పెద్ది’ కథతో సినిమా నడిపించడం లాజిక్‌కు అందదు.

ALSO READ : ‘పెద్ది’ X రివ్యూ..

సినిమాకు మేజర్ హైలైట్ అవ్వాల్సిన ఢిల్లీ ఎపిసోడ్‌లో ఎలాంటి ఆసక్తి, వావ్ ఫ్యాక్టర్ కనిపించదు. కథనంలో కొన్ని లోపాలున్నా కమర్షియల్ సినిమాలో ఓ మంచి స్ఫూర్తిదాయక కథను చెప్పాలనుకోవడం, అలాంటి కథకు రామ్ చరణ్‌ లాంటి స్టార్ యాక్సప్ట్ చేయడం అభినందనీయం. ఇలాంటి ప్రయోగాలు, ప్రయత్నాలు తెలుగులో అరుదు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాకు భిన్నంగా ఒక స్పోర్ట్స్ డ్రామా చూద్దామనుకున్న ప్రేక్షకులకు బెస్ట్ ఛాయిస్ ‘పెద్ది’. హై ఎక్స్‌పెక్టేషన్స్‌ లేకుండా థియేటర్‌‌కు వెళ్లి ఎంజాయ్ చేయొచ్చు.

ఎవరెలా నటించారు..?

‘రంగస్థలం’ తరహాలో కథను, పాత్రను బలంగా నమ్మి రామ్ చరణ్‌ చేసిన సినిమా ఇది. వన్ మ్యాన్‌ షోగా సినిమాను నడిపించాడు. నటన పరంగా తన కెరీర్‌‌లోనే బెస్ట్‌ మూవీగా నిలుస్తుంది. కుస్తీ క్రీడాకారుడిగా తన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్, ఆ సీన్స్‌లో పడ్డ కష్టం తెరపై స్పష్టంగా కనిపించింది. క్రికెట్, డ్యాన్సుల్లోనూ అదరగొట్టాడు. క్లైమాక్స్‌ సీన్స్‌లో ఎమోష‌న‌ల్ యాక్టింగ్‌తో మెప్పించాడు. హీరోయిజంకు దూరంగా ఉండే మూడో ఆటకు సంబంధించిన క్లైమాక్ష్‌ను కమర్షియల్ హీరోలు యాక్సెప్ట్‌ చేయడం కష్టం. కానీ స్టోరీకి సరెండర్ అయ్యి చేశాడు చరణ్‌.

పాటల ద్వారా సినిమాకు అందం తీసుకొచ్చేందుకు మినహా జాన్వీకపూర్ పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత లేదు. తన స్క్రీన్ స్పేస్ కూడా తక్కువే. స్పెషల్‌ సాంగ్‌లో శ్రుతి హాసన్ తేలిపోయింది. రామ్ చ‌ర‌ణ్ త‌ర్వాత సినిమాలో హైలైట్‌ అయిన మరో పాత్ర అప్ప‌ల‌సూరి. ఈ పాత్రను డిజైన్ చేసిన తీరు, గెటప్ ఆకట్టుకున్నాయి. ఆ పాత్ర‌కు జ‌గ‌ప‌తిబాబు పూర్తి న్యాయం చేశారు. తన కెరీర్‌‌లో బెస్ట్ క్యారెక్టర్‌‌గా నిలుస్తుంది.

గౌర్నాయుడు పాత్రకు సంబంధించిన ప్లాష్ బ్యాక్ స్టోరీతో పాటు, రెజ్లింగ్ ట్రైనర్‌‌గా శివరాజ్ కుమార్ చూపించిన  హుందాతనం ఆకట్టుకుంది. రావు రమేష్‌, దివ్యేందు శ‌ర్మ‌, తార‌క్ పొన్న‌ప్ప‌, అజ‌య్ ఘోష్‌, ఉపేంద్ర లిమాయో లాంటి టాలెంటెడ్ యాక్టర్స్‌ చాలామంది ఉన్నా ఆ పాత్రలకు సరైన ప్రాధాన్యత లభించలేదు. 

ALSO READ : ‘పెద్ది’గాడి ఎంట్రీకి ఉపాసన ఫిదా.. పేపర్‌లు ఎగరేస్తూ ఫ్యాన్స్‌తో కలిసి రచ్చ రచ్చ

టెక్నీకల్ అంశాలు..?

ఏఆర్ రెహమాన్ అందించిన పాటల్లో చికిరి, రైరా రారా ఇంప్రెస్ చేశాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా సీన్స్‌ను ఎలివేట్ చేసింది. క్రికెట్, కుస్తీ సీన్స్‌, కొండ కింది సీన్స్‌లో రత్నవేలు కెమెరా వర్క్ సినిమాకు ప్రాణం పోసింది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉండాల్సింది. ఆర్ట్ వర్క్‌, ప్రొడక్షన్ వ్యాల్యూస్‌ బాగున్నాయి. ‘ఉప్పెన’ మూవీతో సంచలన విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు.. ‘పెద్ది’తో భారీ ప్రయోగం చేశాడనే చెప్పొచ్చు.

బుచ్చిబాబు కథ చెప్పిన  విధానం, ఆయన టేకింగ్‌లోని ఫ్రెష్‌నెస్, భావోద్వేగాలను బలంగా తెరపై చూపించిన తీరు మెప్పిస్తుంది. ఈ విషయంలో బుచ్చి సక్సెస్ అయ్యాడు. తన రెండో సినిమానే రామ్ చరణ్ తో తీయడం ఒక ఎత్తైతే, ఇలాంటి సబ్జెక్టు తో ఒప్పించడం మరో ఎత్తు. సినిమా క్వాలిటీ విష‌యంలో నిర్మాత వెంక‌ట స‌తీష్ కిలారు ఎక్క‌డ‌ కాంప్ర‌మైజ్ కాకుండా తీశారు.