PEDDI Twitter Review: ‘పెద్ది’ X రివ్యూ.. సినిమా చూసిన ఆడియన్స్ టాక్ ఎలా ఉంది?

PEDDI Twitter Review: ‘పెద్ది’ X రివ్యూ.. సినిమా చూసిన ఆడియన్స్ టాక్ ఎలా ఉంది?

మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’ (PEDDI) ప్రేక్షుకుల ముందుకొచ్చింది. రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో వచ్చిన ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ఇవాళ జూన్ 4న రిలీజ్ కాగా, ఒకరోజు ముందే జూన్ 3న రాత్రి ప్రీమియర్స్ పడ్డాయి. ఈ సందర్భంగా సినిమా చూసిన ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా తమ రివ్యూలు షేర్ చేస్తున్నారు. మరి తెలుగు సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూసిన ‘పెద్ది’ టాక్ ఎలా ఉంది? రామ్‌చరణ్‌-బుచ్చిబాబుల మ్యాజిక్ వర్కౌట్ అయిందా.. లేదా? సినిమాపై ఉన్న భారీ అంచనాలను పెద్ది ఏ మేరకు అందుకుంది? అనేది X రివ్యూలో చూద్దాం. 

‘పెద్ది’ కథ:

‘పెద్ది’ ఇదొక విలేజ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా. ముఖ్యంగా గుర్తింపు కోసం పోరాడే ఓ ఆదివాసి యువకుడి జీవిత ప్రయాణమే ‘పెద్ది’. రోజు కూలీ పనులకు వెళ్లే పెద్దికి (రామ్ చరణ్) క్రికెట్ అంటే పిచ్చి. తనదైన ఆటతో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టగలిగిన నికార్సైన దమ్మున్నోడు.

అదే ఊరిలో ఉండే అప్పలసూరి (జగపతిబాబు). గవర్నమెంట్ రికార్డుల్లో ఏ మాత్రం గుర్తింపు లేని వారి గ్రామానికి రైలు తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎలాగైనా, తన ఊరి మీదుగా వెళ్లే రైలుకి ఒక స్టేషన్ ఏర్పాటు చేసి ఆగేలా చేయాలని అప్పలసూరి పోరాటం చేస్తాడు.

మరోవైపు విజయనగరం, బొబ్బిలి క్రికెట్ జట్లు వేలంలో పెద్దిని కొనేందుకు పోటీపడుతుంటాయి. ఈ క్రమంలో ఓ ఇన్సిడెంట్ ద్వారా పెద్ది ఆత్మగౌరవంపై కొందరు దెబ్బకొడుతారు. ఆ తర్వాత క్రికెట్‌ని వదిలి కుస్తీ ఆటగాడిగా గౌరీ నాయుడు (శివ రాజ్‌కుమార్) దగ్గర పెద్ది చేరాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే కుస్తీ ద్వారా నేషనల్స్ సాధించి తన ఊరికి ఐడెంటిటీ తీసుకురావాలని డిసైడ్ అవుతాడు.

అలా పెద్ది చేసిన ఈ భావోద్వేగ ప్రయాణంలో ఏం కోల్పోయాడు? ఏం సాధించాడు? ఇంతకీ పెద్ది ఢిల్లీ ఎందుకు వెళ్లాల్సి వస్తుంది? ఇందులో అచ్చియమ్మ (జాన్వీ కపూర్) పాత్ర ఏంటి? అప్పలసూరికి ఏమైంది? చివరకు ఆ గ్రామంలో రైలు ఆగిందా, లేదా? అనే ప్రశ్నలకు సమాధానమే ‘పెద్ది’ కథ.

ఆడియన్స్ టాక్..

ఓ నెటిజన్ రివ్యూ ఇస్తూ..‘‘పెద్ది రెగ్యులర్ కమర్షియల్ టెంప్లేట్‌లో సాగినప్పటికీ, నిజాయితీగా చెప్పిన కథతో కొన్ని చోట్ల ఆకట్టుకునే కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందని’’ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. 

‘‘ఫస్ట్ హాఫ్ సాధారణ కమర్షియల్ అంశాలతో సగటుగా సాగుతుంది. జాన్వీ కపూర్ ట్రాక్ కూడా పెద్దగా ప్రభావం చూపదు. అయితే ప్రీ-ఇంటర్వెల్ నుంచి ‘మాస్సా మాస్సా’ సీక్వెన్స్ కంప్లీట్ అయ్యే వరకు వచ్చే ఎపిసోడ్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయి. ఆ పోర్షన్ ని దర్శకుడు చాలా బాగా తెరకెక్కించాడు. ఆ తర్వాత సెకండ్ హాఫ్‌లో స్క్రీన్ ప్లే కొంత నెమ్మదిస్తుంది. కొన్ని మంచి సన్నివేశాలు ఉన్నప్పటికీ, ఎత్తుపల్లాలు కనిపిస్తాయి. అయితే క్లైమాక్స్‌ను ఎండ్ చేసిన విధానం మాత్రం అల్టిమేట్.

రామ్ చరణ్ తన అద్భుత నటనతో సినిమాను భుజాలపై మోశాడు. పాత్ర కోసం ఆయన పడిన కష్టం, చూపించిన ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రతి సన్నివేశంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. పాటలు, నేపథ్య సంగీతం సినిమాకి ఇంపాక్ట్ తీసుకొచ్చాయి.

దర్శకుడు బుచ్చిబాబు సానా ఒక నిజాయితీ గల కథను చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. అయితే స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్ విభాగాల్లో ఇంకాస్త మెరుగైన పనితనం ఉండి ఉంటే సినిమా మరింత ప్రభావవంతంగా ఉండేదనే భావన కలుగుతుందని’’ రివ్యూ ఇచ్చారు.

మరో నెటిజన్ స్పందిస్తూ.. ‘‘ఫస్ట్ హాఫ్ యావరేజ్ అనిపించినా, క్రికెట్ సన్నివేశాలు, జగపతిబాబు ఎమోషనల్ పాత్ర, "చికిరి" సాంగ్ ఆకట్టుకున్నాయి. అయితే డబ్బింగ్, లిప్ సింక్, రొటీన్ స్క్రీన్‌ప్లే నిరాశపరిచాయి.

సెకండ్ హాఫ్‌లో ఇంటర్వెల్ తర్వాత వచ్చే 20 నిమిషాలు, రామ్ చరణ్ ఎలివేషన్ సీన్లు మెప్పించాయి. కానీ "మాస్సా మాస్సా" పాట తర్వాత కథనం పూర్తిగా డిస్‌కనెక్ట్ అయిందని, సంగీతం, ఎలివేషన్స్ ఆశించిన స్థాయిలో లేవని’’ మరో నెటిజన్ అభిప్రాయపడ్డారు.