Con City OTT: నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేస్తున్న తమిళ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Con City OTT: నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేస్తున్న తమిళ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

క్రైమ్ థ్రిల్లర్ లవర్స్‌కి అదిరిపోయే వీకెండ్ ట్రీట్ రెడీ అయిపోయింది. తన బేస్ వాయిస్‌తో సాలిడ్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న అర్జున్ దాస్, మలయాళ బ్యూటీ అన్నా బెన్ లీడ్ రోల్స్‌లో నటించిన తమిళ్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘కాన్ సిటీ’ (Con City) ఓటీటీ డేట్ లాక్ చేసుకుంది. డెబ్యూ డైరెక్టర్ హరీష్ దురైరాజ్ తెరకెక్కించిన ఈ క్రేజీ థ్రిల్లర్ రైడ్.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో జూలై 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగులో కూడా అందుబాటులోకి రానుంది.  

ఈజీగా మనీ సంపాదించడం కోసం స్కామ్‌లు చేసే ఒక క్రేజీ ఫ్యామిలీ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. ఈ గ్యాంగ్‌లో అర్జున్ దాస్, అన్నా బెన్‌లతో పాటు వర్సటైల్ కమెడియన్ యోగి బాబు కీ రోల్ ప్లే చేశాడు. అయితే, వీరు అనుకోకుండా ఒక పెద్ద క్రైమ్ నెట్‌వర్క్‌లో ఇరుక్కుపోవడం.. ఆ తర్వాత సిట్యుయేషనల్ కామెడీ, మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో కథ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తుంది. 

కథేంటంటే:

మంగళూరులో శరవణన్ (అరుణ్ దాస్), అతని భార్య మిత్ర (అన్నా బెన్) కలిసి ఓ చిన్న హోటల్‌ను నిర్వహిస్తూ జీవనం సాగిస్తుంటారు. వీరికి జీవా (అఖిలన్) అనే శారీరక వికలాంగుడైన కుమారుడు ఉంటాడు. మిత్ర సోదరుడు జాకీ (యోగి బాబు), కుటుంబ పెద్ద జానకి (వడివుక్కరసి) కూడా వారితోనే నివసిస్తుంటారు.

అయితే శరవణన్, మిత్ర దంపతుల మధ్య విభేదాల కారణంగా మాటలు ఉండవు. అయినప్పటికీ తమ కుమారుడి కోసం ఒకే ఇంట్లో కలిసి జీవిస్తుంటారు. ఇలాంటి సమయంలో ఒకరోజు స్కూల్‌కు వెళ్లిన జీవా అనూహ్యంగా కిడ్నాప్‌కు గురవుతాడు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన తర్వాత శరవణన్, మిత్రల గతం ఒక్కొక్కటిగా బయటపడుతుంది.

ట్రైలర్‌లో చూపించినట్లుగానే వీరంతా ఒకప్పుడు స్కామ్‌లు, మోసాలకు పాల్పడిన వ్యక్తులని తెలుస్తుంది. అసలు వీరంతా ఎలా ఒక్కచోటికి చేరారు? ఎవరినుంచి తప్పించుకుంటూ జీవిస్తున్నారు? జీవాను కిడ్నాప్ చేసింది ఎవరు? తన కుమారుడిని శరవణన్ ఎలా రక్షించుకున్నాడు? చివరికి వారి గతం వర్తమానాన్ని ఎలా ప్రభావితం చేసింది? అన్నదే మిగతా కథ.

విశ్లేషణ:

క్రైమ్ థ్రిల్లర్‌లను ఇష్టపడే ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు కథను ఆసక్తికరమైన పాయింట్‌తో ప్రారంభించాడు. సినిమా ఆరంభంలోనే చిన్నారి కిడ్నాప్ ఎపిసోడ్‌తో ఉత్కంఠను పెంచి, ఆ తర్వాత ప్రధాన పాత్రల గతాన్ని ఫ్లాష్‌బ్యాక్ రూపంలో చూపిస్తూ కథను ముందుకు తీసుకెళ్లాడు. ట్రైలర్‌లోనే ప్రధాన ట్విస్ట్‌ను రివీల్ చేసినప్పటికీ, కథనాన్ని ఆసక్తికరంగా నడిపించే ప్రయత్నం చేశాడు. ఫస్ట్ హాఫ్‌లో పాత్రల పరిచయం, వారి బ్యాక్‌స్టోరీ, స్కామ్‌లకు సంబంధించిన అంశాలు కాస్త నెమ్మదిగా సాగినా, సెకండ్ హాఫ్‌లో వచ్చే ట్విస్టులు, ఎమోషనల్ సన్నివేశాలు కథకు బలం చేకూరుస్తాయి. ముఖ్యంగా తండ్రి-కొడుకుల మధ్య బంధాన్ని చూపించిన విధానం ప్రేక్షకులను ఎమోషనల్‌గా కనెక్ట్ చేస్తుంది.

అయితే, దర్శకుడు హరీష్ దురైరాజ్ ప్రేక్షకులను థ్రిల్ చేయాలనే మంచి ఐడియాతోనే ఈ సినిమాను స్క్రిప్ట్ రాసుకున్నారు. కానీ, స్క్రీన్‌ప్లే చాలా నెమ్మదిగా సాగుతుంది. ముఖ్యంగా సినిమా ప్రారంభంలో వచ్చే కొన్ని సీన్లు బోర్ కొట్టిస్తాయి. ఒక క్యారెక్టర్ చూసిన సీన్‌నే, కాసేపటి తర్వాత మరో క్యారెక్టర్ గుర్తుచేసుకున్నప్పుడు అదే విజువల్స్‌ని మళ్లీ మళ్లీ చూపించడం ప్రేక్షకులకు అసహనం కలిగిస్తుంది.

థియేటర్లలో మిస్ అయిన వాళ్లు, వీకెండ్‌లో ఒక మంచి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్లు జూలై 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ క్రేజీ థ్రిల్లర్ ను చూసేయొచ్చు.