Bangladesh: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నమెంట్లో ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఉదంతం బంగ్లాదేశ్ వర్సెస్ భారత్ మధ్య ఉన్న క్రికెట్ సంబంధాలను తీవ్రంగా దెబ్బతీసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దౌత్యపరమైన చర్చల ద్వారా భారత క్రికెట్ బోర్డుతో శత్రుత్వాన్ని వీడి, సంబంధాలను మళ్లీ మునుపటిలా పునరుద్ధరించుకోవచ్చని బంగ్లాదేశ్ భావిస్తోంది.
ముస్తాఫిజుర్ ఐపీఎల్ వివాదం.. టీ20 వరల్డ్ కప్ బహిష్కరణ:
ఈ వివాదం ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు స్టార్ట్ అయింది. బీసీసీఐ మార్గదర్శకాల ప్రకారం కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) యాజమాన్యం బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను తమ స్క్వాడ్ నుంచి రిలీజ్ చేసింది. ఈ నిర్ణయంతో తీవ్ర అసంతృప్తికి గురైన బంగ్లా.. ఆ తర్వాత భారత్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ నుంచి భద్రతా కారణాలను సాకుగా చూపిస్తూ వైదొలిగింది. ఐసీసీ (ICC) భద్రతపై స్పష్టమైన హామీ ఇచ్చినప్పటికీ, బంగ్లాదేశ్ ఆ టోర్నీని బహిష్కరించడం ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు తెగిపోయాయి.
క్రీడా దౌత్యమే మా ఆయుధం: బంగ్లాదేశ్ క్రీడా మంత్రి
ఈ ఉద్రిక్తతలను తగ్గించి, భారత జట్టును తమ దేశానికి రప్పించేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పుడు స్పోర్ట్స్ డిప్లమసీ (క్రీడా దౌత్యం) పైనే పూర్తి ఆశలు పెట్టుకుంది. ఈ విషయంపై బంగ్లా యువజన, క్రీడల సహాయ మంత్రి అమీనుల్ హక్ (Aminul Haque) స్పందిస్తూ, పొరుగు దేశమైన ఇండియాతో క్రీడా సంబంధాలను పునరుద్ధరించడానికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని వెల్లడించారు.
ఇండియన్ ఎంబసీతో డీప్ డిస్కషన్:
ప్రస్తుత ప్రభుత్వం స్పోర్ట్స్ డిప్లమసీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. క్రికెట్ అనేది మాకు ఎంతో ప్రతిష్టాత్మకమైనది, ప్రపంచ క్రికెట్‌లో బంగ్లాదేశ్‌కు మంచి స్థానం ఉందని బంగ్లాదేశ్ స్పోర్ట్స్ మినిస్టర్ అమీనుల్ హక్ తెలిపారు. మేము ఇప్పటికే ఇండియన్ హైకమిషన్ అధికారులతో చర్చించాం.. సెప్టెంబర్‌లో భారత జట్టు బంగ్లాదేశ్‌కు రావాలని ఇరుపక్షాలూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.. గతంలో జరిగిన ఒక చిన్న ఘటనతో ఏర్పడిన ఉద్రిక్తతలను వదిలి పెట్టి.. క్రీడలు, కమ్యూనికేషన్ ద్వారా భారత్‌తో సత్సంబంధాలు కొనసాగుతాయని ఆశిస్తున్నామని అమీనుల్ హక్ చెప్పుకొచ్చారు.
సెప్టెంబర్‌లో భారత్ - బంగ్లాదేశ్ వైట్‌బాల్ సిరీస్:
భారత జట్టు బంగ్లాదేశ్‌లో 3 వన్డేలు, 3 టీ20ల పరిమిత ఓవర్ల సిరీస్ ఆడాల్సి ఉంది. నిజానికి ఈ సిరీస్ 2025 ఆగస్టులోనే జరగాల్సి ఉండగా, ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో సెప్టెంబర్ 2026కు వాయిదా పడింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) జూలై 1న బ్రాడ్‌కాస్ట్/మీడియా హక్కుల కోసం టెండర్లను కూడా ఆహ్వానించింది. అయితే కొన్ని లాజిస్టికల్ కారణాలతో ప్రస్తుతం ఆ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది.
ALSO READ : రేపే జింబాబ్వేతో తొలి టీ20.. భారత్ ప్లేయింగ్ XIలో బిగ్ ట్విస్ట్.. వైభవ్, ఇషాన్ ఔట్!
భద్రత పెంచేందుకు బీసీబీ రెడీ:
భారత జట్టు పర్యటన సునాయాసంగా జరగడం కోసం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అవసరమైతే ఇండియన్ టీమ్ కి అత్యున్నత స్థాయి అదనపు భద్రతను కల్పించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. మరోవైపు, టీ20 ప్రపంచకప్ నుంచి వైదొలగడానికి దారితీసిన పరిస్థితులు, దానివల్ల జరిగిన దౌత్యపరమైన వైఫల్యాలపై నిజాలను తేల్చేందుకు బంగ్లాదేశ్ క్రీడా మంత్రిత్వ శాఖ రెండు వేర్వేరు విచారణ కమిటీలను కూడా ఏర్పాటు చేసింది.
