తొలి ఏకాదశి( జులై25): చాలా శక్తిమంతమైన రోజు.. ఇలా చేయండి.. ఏడు తరాల పాపాలు పోతాయి..!

తొలి ఏకాదశి( జులై25): చాలా శక్తిమంతమైన రోజు.. ఇలా చేయండి.. ఏడు తరాల పాపాలు పోతాయి..!

హిందువులు పండుగలు.. పూజలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు.  ఆషాఢమాసం వారాహి నవరాత్రి ఉత్సవాలతో ప్రారంభమవుతాయి.  ఇదే నెలలో తొలి ఏకాదశి వస్తుంది. ఈ ఏడాది తొలి ఏకాదశి ( జులై 25) శనివారం వచ్చింది.  ఆరోజు కొన్ని రకాల పూజలు.. కొన్ని పరిహారాలు చేస్తే ఏడు తరాల పాపాలు పోతాయని పురాణాల ద్వారా తెలుస్తుంది.  ఆరోజు ఎలాంటి పూజలు..  పరిహారాలు చేయాలి. ఆ రోజు స్వామి వారిని ఎలా పూజించాలి, ఆ పూజా విధానం ఏంటి మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .! 

తొలి ఏకాదశి రోజు లక్ష్మీనారాయణులను పూజిస్తే  గత జన్మల్లో పాపాలు తొలగడమే కాకుండా.. ఈ జన్మలో కోరుకున్న పనులు అవుతాయని పండితులు చెబుతున్నారు.  తొలి ఏకాదశిని దేవశయని ఏకాదశి అంటారు. 
హిందూ గ్రంథాల ప్రకారం విష్ణుమూర్తి క్షీర సాగరంలో  నాలుగు నెలల పాటు విశ్రాంతి తీసుకున్న కాలాన్ని  చాతుర్మాసం అంటారు. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు.

విష్ణుపూజలో తులసీ దళం కంపల్సరీ..

తొలి ఏకాదశి రోజున భక్తులు ఉపవాసం పాటించాలి. విష్ణువుకు ప్రార్థనలు చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు విష్ణుమూర్తి అనుగ్రహమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభించి ఏడుతరాల పాపాలు ప్రక్షాళన జరుగుతుందని పండితులు చెబుతున్నారు. విష్ణుమూర్తికి ఇష్టమైన వాటిల్లో తులసీ ఆకులు ఒకటి. తులసీ దళం సమర్పించకుండా విష్ణుపూజ అసంపూర్ణమే.  కాబట్టి శ్రీమహా విష్ణు దర్శనానికి వెళ్లినా, పూజ చేసిన కచ్చితంగా తులసీ ఆకులు వాడాలి.

ఉపవాస దీక్ష పాటించాలి

తొలి ఏకాదశి రోజు ఆహారం అస్సలు  తీసుకోవద్దు.   బియ్యంతో తయారు చేసిన ఎలాంటి పదార్దాన్ని తినకూడదని పండితులు చెబుతున్నారు.ఆరోగ్య కారణాల రీత్యా ఉపవాసం ఉండలేని వారు పాలు, పండ్లు తీసుకోవచ్చని పురాణాలు చెబుతున్నాయి.  మాంసం, ఉల్లి, వెల్లుల్లి. మద్యం, ధూమపానం  వంటి వాటిని ముట్టుకోకూడదు. ఎందుకంటే ఈ విషయాలు మనసులో ప్రతికూల ఆలోచనలకు దారి తీస్తాయి. 

ALSO READ : ఇలాంటి ధ్యానం చేయండి.. ఏకాగ్రతతో అన్ని పనులు సాధిస్తారు..

దానాలు చేయాలి

తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నా లేకున్నా, పూజ చేసినా చేయకపోయినా... దానం మాత్రం చేయాలని పండితులు చెబుతున్నారు.  పిసినారి తనం చూపించకుండా బియ్యం, బట్టలు, డబ్బులు, నీళ్లు ఇలా ఏదైనా దానం చేయాలి. ఎందుకంటే దేవశయని ఏకాదశి రోజున ఇలాంటి పనులు చేస్తే లభించే గొప్ప పుణ్యఫలంతో గత జన్మల్లో పూర్వీకులు చేసిన పాపాలకు విముక్తి  లభిస్తుందని నమ్ముతారు.

బ్రహ్మచర్యం చాలా అవసరం

తొలి ఏకాదశి వ్రతం రోజున ప్రతి  వ్యక్తి బ్రహ్మచర్యం పాటించాలి. భక్తులు తమ శరీరం, మనస్సుపై నియంత్రణ ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈరోజును మీరు విష్ణు మంత్రాలను పఠిస్తూ.. రోజంతా గడవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. 

 విష్ణు మంత్రాలు పఠించాలి

తొలి ఏకాదశి రోజున విష్ణు మంత్రాలను పఠించడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఆరోజు  ( జులై 25) పఠించే విష్ణు మంత్రం  ఏకాదశి ఫలాలను అనుగ్రహిస్తుంది. తొలి ఏకాదశి నాడు మీరు.. ఓం నమో భగవతే వాసుదేవయానమం:  అనే మంత్రాన్ని పఠించాలి. ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుంది. పైన చెప్పినవన్నీ ఫాలో అవుతూ.. పూజ చేస్తే కచ్చితంగా మంచి ఫలితాలు లభిస్తాయి. ఇంట్లోనే ఉండి విష్ణు ఆరాధన చేసుకొని పుణ్యంతో పాటు మోక్షం పొందండి. సాయంత్రం సమయాల్లో విష్ణుసంబంధ ఆలయాలను దర్శనం చేసుకొంటే జీవితంలో అనుకున్న ఫలితాన్ని పొందుతారని పండితులు  చెబుతున్నారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.