తిరుమల కొండపై ఊహించని ఘటన.. కొండ మార్గంలో నిత్యం పూజలు అందుకునే ఆంజనేయస్వామి విగ్రహం చోరీ అయ్యింది. ఈ ఘటన ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. తిరుమలలో రోజూ పూజలు అందుకునే ఆంజనేయస్వామి విగ్రహం చోరీ కావటం ఏంటంటూ భక్తులు తీవ్ర మనోవేదన పడుతున్నారు. తిరుమల కొండకు వెళ్లే దారిలో.. మొదటి ఘాట్ రోడ్డులో 7వ మైలు రాయి దగ్గర ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలోని.. చిన్న విగ్రహం చోరీ కావటం.. ఆ విజువల్స్ సీసీ కెమెరాలో కనిపించటంతో తిరుమల పోలీసులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.
అర్థరాత్రి సమయంలో ఓ వ్యక్తి ఆలయంలోకి వెళ్లటం.. కొంత సమయం తర్వాత బయటకు పరుగులు తీయటం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆ తర్వాతనే ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించలేదు. ఈ క్రమంలోనే సీసీ కెమెరాలో ఉన్న వ్యక్తినే ఈ విగ్రహాన్ని ఎత్తుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు.
మొదటి ఘాట్ రోడ్డులో.. 7వ మైలు రాయి దగ్గర ఉన్న ఈ ఆంజనేయ స్వామి ఆలయంలో నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. విశేషమైన రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం.. టీటీడీ ఉన్నతాధికారులు వచ్చి స్వామి పూజల్లో పాల్గొనటం ఆనవాయితీ. ఇటీవల టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆలయంలో పూజలు చేశారు.
2026, జూలై 22వ తేదీ ఉదయం ఆలయానికి వచ్చిన పూజారులు.. గుడిలోకి స్వామి విగ్రహం కనిపించకపోవటంతో టీటీడీ అధికారులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ వెంటనే ఉరుకులు, పరుగులు పెడుతున్నారు పోలీసులు. తిరుమల భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశంతోపాటు ఇది చాలా సున్నితమైన అంశం కావటంతో టీటీడీ అధికారులు, పోలీసులు మౌనం వహిస్తున్నారు.
