పెళ్లి చేసుకోకుండా రిలేషన్ నుంచి విడిపోతే అది రేప్ కిందకు రాదు: ఉత్తరాఖండ్ హైకోర్టు

పెళ్లి చేసుకోకుండా రిలేషన్ నుంచి విడిపోతే అది రేప్ కిందకు రాదు: ఉత్తరాఖండ్ హైకోర్టు

డేటింగ్ యాప్‌లో పరిచయమైన ఇద్దరు అడల్ట్స్ మధ్య పరస్పర అంగీకారంతో కొనసాగిన శారీరక సంబంధాన్ని, తర్వాత పెళ్లి జరగలేదనే కారణంతో అత్యాచారంగా పరిగణించలేమని ఉత్తరాఖండ్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. టిండర్‌లో పరిచయమైన ఓ యువకుడిపై "పెళ్లి చేసుకుంటానని మోసం చేసి శారీరక సంబంధం పెట్టుకున్నాడు" అంటూ నమోదైన అత్యాచార కేసును కోర్టు కొట్టివేసింది. కేసు విచారణను కొనసాగించడం చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అవుతుందని స్పష్టం చేసింది.

అసలు కేసు ఎలా మొదలైంది?
2019 ఆగస్టులో టిండర్ యాప్ ద్వారా యువతి, యువకుడికి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ తరచూ మాట్లాడుకుంటూ సన్నిహితులయ్యారు. ఆ తర్వాత యువకుడు హల్ద్వానీకి వచ్చి యువతిని కలిశాడు. ఇద్దరూ కలిసి భీమ్‌తాల్, హనుమాన్ ధామ్ ప్రాంతాలను సందర్శించారు. ఆ తర్వాత హోటల్‌లో మద్యం సేవించి పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం పెట్టుకున్నారు. ఆ తర్వాత కూడా నెలల తరబడి తరచూ కలుసుకుంటూ సంబంధాన్ని కొనసాగించారు.

కొంతకాలం తర్వాత యువకుడు పెళ్లి విషయంలో దూరంగా ఉంటున్నాడని, చివరకు మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడని సోషల్ మీడియాలో తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ అత్యాచార కేసు నమోదు చేయించింది.

హైకోర్టు ఏమి పరిశీలించింది?
కేసులోని ఎఫ్‌ఐఆర్, ఇతర ఆధారాలను పరిశీలించిన జస్టిస్ సిద్ధార్థ్ సాహ్.. ఫిర్యాదుదారు పూర్తి వయోజనురాలని, తన స్వచ్ఛంద నిర్ణయంతోనే ఈ సంబంధంలోకి వెళ్లినట్లు గుర్తించారు. టిండర్ అనేది వివాహాల కోసం రూపొందించిన వేదిక కాదని, స్నేహాలు, పరిచయాల కోసం ఉపయోగించే డేటింగ్ యాప్ అని కోర్టు పేర్కొంది. ఇద్దరూ చాలా కాలం పాటు సంబంధాన్ని కొనసాగించారని, మొదటి నుంచే పెళ్లి పేరుతో మోసం చేసి శారీరక సంబంధం పెట్టుకున్నట్లు చూపించే స్పష్టమైన ఆధారాలు లేవని అభిప్రాయపడింది కోర్టు.

ALSO READ : ఈ20 పెట్రోల్‌తో ఇంజన్‌లకు నష్టం లేదు.. 

పెళ్లి జరగకపోతే అది అత్యాచారం కాదు..
సంబంధం తర్వాత విభేదాలు రావడం లేదా పెళ్లి జరగకపోవడం మాత్రమే అత్యాచార నేరాన్ని నిరూపించదని కోర్టు స్పష్టం చేసింది. శారీరక సంబంధం పూర్తిగా పరస్పర అంగీకారంతో ఏర్పడితే.. తర్వాత రిలేషన్షిప్ విఫలమైందనే కారణంతో దానిని "తప్పుడు పెళ్లి హామీపై అత్యాచారం"గా పరిగణించలేమని పేర్కొంది. మొదటి నుంచే మోసం చేయాలనే ఉద్దేశంతో పెళ్లి హామీ ఇచ్చినట్లు నిరూపించే ఆధారాలు ఉండాల్సిందేనని కోర్టు వ్యాఖ్యానించింది.

కేసును కొట్టివేసిన హైకోర్టు..
ఈ కేసులో అత్యాచారం నేరానికి అవసరమైన ప్రాథమిక అంశాలు కనిపించలేదని హైకోర్టు తేల్చింది. ఇలాంటి పరిస్థితుల్లో క్రిమినల్ కేసును కొనసాగించడం చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేసినట్టేనని పేర్కొంటూ ఎఫ్‌ఐఆర్, ఛార్జ్‌షీట్, సమన్లు, ట్రయల్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న అన్ని తదుపరి విచారణలను రద్దు చేసింది. ఈ తీర్పు "పెళ్లి చేసుకుంటానని హామీతో అత్యాచారం" కేసుల్లో అంగీకారంతో సంబంధాలు, మోసం చేయాలనే ఉద్దేశం మధ్య ఉన్న చట్టపరమైన తేడాను మరోసారి స్పష్టంగా వివరించింది.