న్యూఢిల్లీ: ఇరవై శాతం ఇథనాల్‌తో కూడిన ఈ20 పెట్రోల్‌తో వాహనాల ఇంజన్‌లకు ఎలాంటి నష్టం ఉండదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ 20 పెట్రోల్ వాడకంతో ఇంజన్లు ఖరాబ్ అయినట్లు సైంటిఫిక్‌గా జరిగిన టెస్టుల్లో, వాస్తవంగా బండ్లను వాడి చూసి చేసిన పరీక్షల్లో ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొంది. ఈ మేరకు రాజ్యసభలో ఎంపీలు రాజీవ్ శుక్లా, జాన్ బ్రిట్టాస్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి సురేశ్ గోపి రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
ఈ20ని మార్కెట్‌లోకి తేవడానికి ముందే ఏఆర్‌ఏఐ, నీతి ఆయోగ్, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్, వెహికల్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు కలిసి అన్ని రకాల పరీక్షలు నిర్వహించాయని తెలిపారు. ఇంజన్ మన్నిక, పనితీరు, పెట్రోల్ సామర్థ్యం, పొల్యూషన్, వాహన స్థిరత్వం, తుప్పుపట్టడం, అరిగిపోవడం వంటి అంశాలను ఆ టెస్టుల్లో పరిశీలించారని వెల్లడించారు.
ఈ20 పెట్రోల్‌ను ప్రమాణాల ప్రకారం వాడితే వాహనాల జీవితకాలంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదన్నారు. అయితే, పాత మోడల్ వెహికల్స్‌లో ఫ్యూయెల్ కెపాసిటీ మూడు నుంచి ఐదు శాతం తగ్గే అవకాశం ఉందని మాత్రం కేంద్రం అంగీకరించింది.
