మనకు 'సండే' హాలిడే ఎలా వచ్చింది ? ఆదివారమే ఎందుకు ? ఆసక్తికరమైన కథ ఇదే..

మనకు 'సండే' హాలిడే ఎలా వచ్చింది ? ఆదివారమే ఎందుకు ? ఆసక్తికరమైన కథ ఇదే..

ఆదివారం అనగానే మన ముఖాలపై సంతోషం, చిరునవ్వు వికసిస్తుంది. ఇంట్లో వాళ్లతో గడపడానికి, ఆఫీసు నుండి కాస్త ప్రశాంతత పొందడానికి ఆదివారం సరైన రోజు. భారతదేశంలో ఆదివారం అందరికీ సెలవు రోజనే విషయం మనకు తెలిసిందే, కానీ ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. ఆదివారాన్ని వారపు సెలవుగా మార్చడం వెనుక కార్మికుల హక్కుల కోసం జరిగిన ఒక పెద్ద పోరాటం ఉంది. ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం....

సెలవు లేకుండా ఏడు రోజులూ పని
ఈ రోజుల్లో మనకు శని, ఆదివారాలు దొరుకుతున్న విశ్రాంతి ఒకప్పుడు అస్సలు ఉండేది కాదు. బ్రిటిష్ వారి కాలంలో, ముఖ్యంగా ముంబైలోని బట్టల మిల్లుల్లో పనిచేసే కార్మికుల పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. వాళ్లకు ఎలాంటి సెలవు లేకుండా వారంలో ఏడు రోజులూ పని చేయించేవారు. దీనివల్ల వాళ్ల ఆరోగ్యం బాగా పాడైపోయేది. అలాంటి కష్ట సమయంలో నారాయణ్ మేఘాజీ లోఖండే అనే నాయకుడు కార్మికుల పక్షాన నిలబడ్డారు.

ఏడేళ్ల పాటు సాగిన పోరాటం
కార్మికుల కష్టాలను చూసి తట్టుకోలేక లోఖండే వారి కోసం పోరాటం మొదలుపెట్టారు. 1881 నుండి 1884 వరకు ఆయన ఎన్నో నిరసనలు చేశారు, బ్రిటిష్ ప్రభుత్వానికి ఎన్నో లేఖలు రాశారు. ఆయన మాట విని వేల మంది కార్మికులు ఒకటయ్యారు. ఈ పోరాటం అంత తేలికగా ముగియలేదు, ఏకంగా ఏడు సంవత్సరాల పాటు సాగింది. చివరికి కార్మికుల ఐక్యత ముందు బ్రిటిష్ ప్రభుత్వం లొంగిపోయింది. అలా 1890 జూన్ 10న భారతదేశంలో ఆదివారాన్ని అధికారికంగా వారపు సెలవు దినంగా ప్రకటించారు.

ఆదివారాన్నే ఎందుకు ఎంచుకున్నారు
ఆదివారం రోజే సెలవు ఇవ్వడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. బ్రిటిష్ వారి ఆచారం  ప్రకారం ఆ రోజుల్లో మనల్ని పాలిస్తున్న బ్రిటిష్ వారు క్రైస్తవ మతాన్ని పాటించేవారు. వారికి ఆదివారం చర్చికి వెళ్లే పవిత్రమైన రోజు. అందుకే ఆ రోజును సెలవుగా పెట్టారు.

 భారతీయ సంస్కృతిలో ఆదివారం సూర్య భగవానుడికి, కొన్ని చోట్ల ఖండోబా దేవుడికి పూజలు చేసే రోజు. కాబట్టి, బ్రిటిష్ వారిలాగే భారతీయ కార్మికులకు కూడా పూజలు చేసుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఆదివారం రోజు ఉపయోగపడుతుందని భావించారు.

ALSO READ : నూనెలో ఉప్పు కాదు నెయ్యి వేయాలా.. 

1700 ఏళ్ల నాటి చరిత్ర
నిజానికి ఆదివారం నాడు సెలవు ఇచ్చే పద్ధతి భారతదేశంలో పుట్టలేదు. దీనికి చాలా పాత చరిత్ర ఉంది. క్రీస్తు శకం 321లో, రోమన్ చక్రవర్తి కాన్‌స్టాంటైన్ ది గ్రేట్ మొదటిసారిగా తన సామ్రాజ్యంలో ఆదివారాన్ని విశ్రాంతి దినంగా ప్రకటించారు. ఆ తర్వాత ఈ పద్ధతి ఐరోపా అంతటా, ఆ తరువాత బ్రిటన్‌కు పాకింది. చివరికి బ్రిటీష్ వారు మన దేశానికి వచ్చినప్పుడు ఈ అలవాటును ఇక్కడికి కూడా తీసుకువచ్చారు.