- అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తలెత్తే అవకాశాల నేపథ్యంలో రైతులను ముందస్తుగా అప్రమత్తం చేయాలని, ప్రత్యామ్నాయ పంటల సాగుపై వారికి అవగాహన కల్పించాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆదేశించారు. గురువారం ఆయన సెక్రటేరియెట్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ నెల 6, 8, 10 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించాలని సూచించారు. జిల్లాల వారీగా పంటల ప్రణాళిక ప్రకారం రైతులకు తక్కువ నీటితో సాగు చేయగల పంటలు, వర్షాభావాన్ని తట్టుకునే పంటలపై అవగాహన కల్పించాలని దిశానిర్దేశం చేశారు.
లిఫ్ట్ ఇరిగేషన్, బోర్‌వెల్ ఆధారిత సాగు ప్రాంతాల్లో తక్కువ పంటకాలం కలిగిన సన్నరకం వరి రకాలను ప్రోత్సహించడంతో పాటు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలన్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంటలను ఎంపిక చేసుకునేలా ఏఈవోలు కృషి చేయాలని సూచించారు. పంట కొయ్యలు, వ్యర్థాలను కాల్చివేయడం వల్ల నేల సారం దెబ్బతినడంతో పాటు పర్యావరణ కాలుష్యం పెరుగుతోందని తుమ్మల ఆందోళన వ్యక్తం చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో 37,319 ఎకరాల్లో నమోదైన పంట వ్యర్థాల కాల్చివేతలకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి శాటిలైట్ నివేదికలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. పంట వ్యర్థాలను కాల్చేవారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
6న కొహెడ మార్కెట్‌కు శంకుస్థాపన
ఈ నెల 6న కొహెడలో రూ.2,284.32 కోట్లతో నిర్మించనున్న 'అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్'కు సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నట్లు తుమ్మల తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిన ఫెర్టిలైజర్ యాప్ పనితీరును కేంద్ర వ్యవసాయ శాఖ ప్రశంసించిందని మంత్రి తెలిపారు.
