అణుబాంబుల ఫ్యాక్టరీని చూపించిన కిమ్.. అమెరికాకు నార్త్ కొరియా డైరెక్ట్ వార్నింగ్

అణుబాంబుల ఫ్యాక్టరీని చూపించిన కిమ్.. అమెరికాకు నార్త్ కొరియా డైరెక్ట్ వార్నింగ్

అంతర్జాతీయ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఉత్తర కొరియా తన అణ్వాయుధ సంపత్తిని మరింత పెంచుకునేందుకు సిద్ధమైంది. అణుబాంబులకు అవసరమైన ఇంధనాన్ని తయారు చేసే సరికొత్త రహస్య కేంద్రాన్ని ఆ దేశం తాజాగా ప్రపంచానికి వెల్లడించింది. ఈ ప్లాంట్‌ను స్వయంగా సందర్శించిన నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. దేశ అణు బలగాలను వేగంగా విస్తరిస్తామన్నారు. గత ఐదేళ్లలో తమ దేశంలో ఆయుధాల తయారీకి ఉపయోగపడే అణు పదార్థాల ఉత్పత్తి రెట్టింపు కంటే ఎక్కువైందని కిమ్ క్లెయిమ్ చేశారు. అయితే ఇది ఎంత వరకూ నిజం అనే విషయం తెలియదు. 

యురేనియంను అప్ గ్రేడ్ చేయడానికి ఉపయోగించే వందలాది అధునాతన సిలిండ్రికల్ సెంట్రిఫ్యూజ్‌లతో కూడిన ఒక భారీ హాల్ ఫోటోను ఆ దేశ అధికారిక వార్తా సంస్థ ప్రసారం చేసింది. ఈ ప్లాంట్ అత్యంత అధునాతన సాంకేతికతతో నిర్మితమైందని కేసీఎన్ఏ పేర్కొన్నప్పటికీ.. దాని లొకేషన్, పనితీరుకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం గోప్యంగా ఉంచింది. ఈ పరిణామాలపై పొరుగు దేశమైన దక్షిణ కొరియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇది యురేనియం ఎన్రిచ్మెంట్ కేంద్రమేనని ప్రాథమికంగా అంచనా వేసిన దక్షిణ కొరియా ఆర్మీ.. అమెరికాతో కలిసి ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపింది.

ఉత్తర కొరియా వద్ద ప్రస్తుతం ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయనే దానిపై భిన్నమైన అంచనాలు ఉన్నాయి. 2018 నాటి నివేదికల ప్రకారం ఆ దేశం వద్ద 20 నుండి 60 అణ్వాయుధాలు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 100 దాటి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి ఏటా కొత్తగా 6 నుంచి 18 అదనపు ఆయుధాలను తయారు చేసే సామర్థ్యం నార్త్ కొరియా దగ్గర ఉందని అంచనా. అమెరికా, దక్షిణ కొరియా వంటి శత్రు దేశాల నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఈ అణు కార్యక్రమం అత్యంత అవసరమని కిమ్ వాదిస్తున్నారు. తమ అణు ప్రయాణం వెనక్కి తీసుకోలేనిదని స్పష్టం చేశారు.

1993లో అణు నివారణ ఒప్పందం నుండి వైదొలిగిన ఉత్తర కొరియా.. ఇప్పటివరకు 6 సార్లు అణు పరీక్షలు నిర్వహించి ఐక్యరాజ్యసమితి నుంచి అనేక ఆంక్షలను ఎదుర్కొంటోంది. 2017 తర్వాత నేరుగా అణు పరీక్షలు జరపనప్పటికీ.. అమెరికా ప్రధాన భూభాగాన్ని తాకగల క్షిపణుల అభివృద్ధిని మాత్రం ఆపలేదు. 2019లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన చర్చలు విఫలమైనప్పటి నుండి కిమ్ దూకుడు మరింత పెంచారు. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ కూడా ఉత్తర కొరియా అణు కేంద్రాలలో కార్యకలాపాలు వేగంగా పెరిగాయని ధృవీకరించడంతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి అణుయుద్ధ భయాలు నెలకొన్నాయి.