రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి.. 8 మంది మృతి, 60 మందికి గాయాలు

రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి.. 8 మంది మృతి, 60 మందికి గాయాలు

మాస్కో: రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ దాడుల్లో 8 మంది ప్రాణాలు కోల్పోగా, 60 మందికి పైగా గాయపడ్డారని రష్యా అధికారులు తెలిపారు. రష్యాకు చెందిన ప్రముఖ ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ రిటైలర్ 'వైల్డ్‌‌‌‌‌‌‌‌బెర్రీస్'కు చెందిన 2 భారీ వేర్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌లపై డ్రోన్లు దాడి చేయడంతో మంటలు చెలరేగాయి. కొటోవ్స్క్ వేర్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌లో నైట్ షిఫ్ట్ చేస్తున్న ఏడుగురు కార్మికులు చనిపోగా, 25 మంది గాయపడ్డారు. మాస్కో ప్రాంతంలో మరో 37 మంది గాయపడగా, చికిత్స పొందుతూ ఒకరు చనిపోయారు.

ఎలెక్ట్రోస్టల్‌‌‌‌‌‌‌‌లో డ్రోన్ శకలాలు పడి ఓ స్కూల్ భవనంలో మంటలు అంటుకున్నాయి. మరోవైపు, నోగిన్స్క్ నగరంలోని ఆయిల్ డిపోపై డ్రోన్ దాడి జరగడంతో పక్కనే ఉన్న ప్రసూతి ఆస్పత్రిని అధికారులు ఖాళీ చేయించారు. వ్లాదిమిర్ సిటీలో ఓ భవనంపై డ్రోన్ పడినా ప్రమాదం తప్పింది. డ్రోన్ల తయారీ, నావిగేషన్ పరికరాల సరఫరాకు రష్యా వాడుతున్న 2 ప్రధాన లాజిస్టికల్ కేంద్రాలపై లాంగ్ రేంజ్ దాడులు చేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్​స్కీ ధ్రువీకరించారు.