పాక్ ప్రభుత్వ ఆస్పత్రిలో భారీ నిర్లక్ష్యం.. 200 మంది చిన్నారులకు సోకిన HIV

పాక్ ప్రభుత్వ ఆస్పత్రిలో భారీ నిర్లక్ష్యం.. 200 మంది చిన్నారులకు సోకిన HIV

పాకిస్థాన్ ప్రభుత్వ వైద్య వ్యవస్థలో మరోసారి తీవ్ర నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. కరాచీలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే వలికా ఆస్పత్రిలో జరిగిన ఘోర వైద్య లోపాల కారణంగా HIV వ్యాప్తి కలకలం రేపింది. ఆస్పత్రిలో చికిత్స పొందిన కనీసం 78 మంది చిన్నారులు హెచ్‌ఐవీ బారిన పడగా, అనంతరం సమీప ప్రాంతాల్లో నిర్వహించిన పరీక్షల్లో మరో 120 మంది హెచ్‌ఐవీ పాజిటివ్‌గా గుర్తించారు. ఈ ఘటనతో పాకిస్థాన్ ఆరోగ్య వ్యవస్థలోని లోపాలు, ముఖ్యంగా ఇన్‌ఫెక్షన్ నియంత్రణలో జరిగిన నిర్లక్ష్యం తీవ్ర విమర్శలకు దారితీసింది.

సింధ్ హెల్త్‌కేర్ కమిషన్ (SHCC) నిర్వహించిన తనిఖీల్లో ఆస్పత్రిలో వైద్య వ్యర్థాల నిర్వహణ అత్యంత నిర్లక్ష్యంగా సాగుతున్నట్లు తేలింది. వాడిన సిరంజీల సూదులను చేతులతోనే వేరు చేసి పారవేస్తున్నారని, ప్రమాదకర వ్యర్థాల కోసం ఉంచాల్సిన ప్రత్యేక షార్ప్స్ బిన్లలో అవి కనిపించలేదని అధికారులు గుర్తించారు. ఆ సూదులు ఎక్కడికి వెళ్లాయి? ఎలా నిర్వీర్యం చేశారు? అనే ప్రశ్నలకు ఆస్పత్రి సిబ్బంది సమాధానం చెప్పలేకపోయారు. ఒక్కసారి మాత్రమే ఉపయోగించాల్సిన సిరంజీలను మళ్లీ వాడినట్లు కూడా విచారణలో బయటకు రావడం పరిస్థితి తీవ్రతను మరింత పెంచింది.

తనిఖీల్లో ఇన్‌ఫెక్షన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ కమిటీ ఉన్నప్పటికీ.. సిబ్బందికి భద్రతా శిక్షణ ఇవ్వకపోవడం, రాతపూర్వక మార్గదర్శకాలు లేకపోవడం, వైద్య పరికరాలను శుభ్రపరిచే ఆటోక్లేవ్ సరిగా పనిచేస్తోందో లేదో కూడా నిర్ధారించలేకపోవడం బయటపడింది. వైద్య వ్యర్థాలను నిబంధనల ప్రకారం వేరు చేసి పారవేయడం జరగకపోవడం, వాటిని సేకరించే ప్రైవేట్ కాంట్రాక్టర్‌కు కూడా సరైన శిక్షణ లేకపోవడం వంటి అంశాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తనిఖీ సమయంలో నర్సింగ్, ఆపరేషన్ థియేటర్ సిబ్బంది లేకపోవడం కూడా అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది.

ALSO READ : ప్రమోషన్‌తో శత్రువులుగా మారిన సహఉద్యోగులు

ఈ ఘటనపై స్వతంత్ర విచారణలు కూడా ఇన్‌ఫెక్షన్ నియంత్రణ నిబంధనలను భారీగా ఉల్లంఘించినట్లు నిర్ధారించడంతో పాకిస్థాన్ సింధ్ ముఖ్యమంత్రి సయ్యద్ మురాద్ అలీ షా కఠిన చర్యలు చేపట్టారు. ఆస్పత్రి నిర్వాహకులు, ల్యాబ్ సిబ్బంది, నర్సులు సహా మొత్తం 37 మందిని సస్పెండ్ చేశారు. ప్రాణాలను కాపాడాల్సిన ఆస్పత్రుల్లోనే నిర్లక్ష్యం, అసురక్షిత వైద్య పద్ధతులు అమలైతే ఎలాంటి విపత్తులు సంభవిస్తాయో ఈ ఘటన స్పష్టంగా చూపించింది. ఎయిడ్స్ వంటి ప్రాణాంతక వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే ఆస్పత్రుల్లో కఠిన ఇన్‌ఫెక్షన్ నియంత్రణ, సురక్షిత సిరంజీల వినియోగం, వైద్య వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ తప్పనిసరి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.