మన దేశంలో కొన్ని కోట్ల మందికి డైలీ కాఫీ తాగే ఉంటుంది. అయితే.. ఏదైనా అతిగా శరీరంలోకి పంపించినా ఆరోగ్యానికి చేటు చేస్తుంది. కానీ.. కాఫీ ఎంత ఎక్కువ తాగితే ఆరోగ్యానికి, ముఖ్యంగా కాలేయానికి అంత మంచిదని యూకే బయోబ్యాంక్ అధ్యయనం పరిశోధనల్లో వెల్లడైంది. ఈ అధ్యయన ఫలితాలను క్లినికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్ హెపటాలజీలో ప్రచురించారు. దాదాపు 3 లక్షల 55 వేల మంది కాఫీ తాగే వారిపై, కాఫీ తాగని వారిపై దశాబ్దాని పైగా చేసిన అధ్యయనాల్లో కాఫీ కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తుందని తేలిందని స్టడీ పేర్కొంది.
రోజుకు 5 కప్పుల కాఫీ తాగడం వల్ల కాలేయానికి రక్షణ కవచంలా కాఫీ పనిచేస్తుందని ఈ అధ్యయనం తెలిపింది. కాఫీ తాగని వారితో పోలిస్తే.. రోజూ ఐదు లేదా అంతకంటే ఎక్కువ కప్పులు తాగే వారికి లివర్ సిర్రోసిస్ వచ్చే ప్రమాదం 32 శాతం తక్కువగా, కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 47 శాతం తక్కువగా ఉందని ఈ అధ్యయనం పేర్కొంది. కాలేయ సంబంధిత వ్యాధులతో మరణించే ప్రమాదం 42 శాతం తక్కువగా ఉందని వెల్లడించింది.
అయితే.. దీని అర్థం ప్రతి ఒక్కరూ వెంటనే డైలీ తాగే కాఫీల మోతాదును పెంచాలని కాదని నిపుణులు నొక్కి చెబుతున్నారు. రోజుకు రెండు, మూడుకు మించి కాఫీలు తాగే అలవాటు ఉన్న వాళ్లు కంగారు పడాల్సిన పని లేదని ఈ ఫలితాలతో వెల్లడైంది. అయితే.. కాఫీ వినియోగానికి, మెరుగైన కాలేయ ఆరోగ్యానికి మధ్య బలమైన సంబంధం ఉందని ఈ పరిశోధన ఫలితాలు స్పష్టం చేశాయి.
ALSO READ : తిన్న తర్వాతే కాదు.. రోగాలకూ కూడా చెక్ పెట్టే సోంపులో దాగున్న హెల్త్ సీక్రెట్స్ ఇవే!
కాఫీలో కాలేయ ఆరోగ్యానికి తోడ్పడే అనేక సహజ సమ్మేళనాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ ఉంటాయని, ఇవి వాపును తగ్గించడంలో సహాయపడతాయని చెప్పారు. ఫ్రీ రాడికల్స్ అని పిలువబడే హానికరమైన అణువుల వల్ల కలిగే నష్టం నుంచి కణాలను కాపాడతాయని తెలిపారు. కాఫీ కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని కూడా తగ్గించవచ్చు. వాపును నియంత్రించే శరీర సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
