డ్రగ్స్కు బదులు నిద్రమాత్రలు, దగ్గు సిరప్లు.. కొత్త దుకాణం ఓపెన్ చేసిన ముఠా హైదరాబాద్లో అరెస్ట్

డ్రగ్స్కు బదులు నిద్రమాత్రలు, దగ్గు సిరప్లు.. కొత్త దుకాణం ఓపెన్ చేసిన ముఠా హైదరాబాద్లో అరెస్ట్

డ్రగ్స్ కంట్రోల్ చేశామని పోలీసులు భావిస్తుంటే.. వాటికి ఆల్టర్నేటివ్ గా కొత్త దుకాణం ఓపెన్ చేసింది ఓ ముఠా. మాదక ద్రవ్యాలు లేకపోతనేం.. అందుబాటులో ఉన్న వాటితోనే మత్తు ఎక్కిస్తాం రండి.. అంటూ నిద్రమాత్రలు, దగ్గు సిరప్‌లను అమ్ముతున్నారు. మత్తుకు బానిసలైన వారికి అధిక ధరలకు అమ్ముతూ లక్షల్లో సంపాదిస్తున్న ముఠాను  హైదరాబాద్‌ సీసీఎస్‌ స్పెషల్‌ క్రైమ్‌ టీం, హబీబ్‌నగర్‌ పోలీసులు పట్టుకున్నారు. 

శనివారం (జులై 18) జరిపిన రైడ్స్ లలో  భారీగా మత్తు మందులను స్వాధీనం చేసుకున్నారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్‌ లేకుండా వీటిని అక్రమంగా విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు హైదరాబాద్‌ అడిషనల్‌ సీపీ క్రైమ్స్‌ శ్రీనివాస్‌ తెలిపారు. హైదరాబాద్ బషీర్ బాగ్ లోని సీసీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. 

హబీబ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మాంగర్‌ బస్తీలో విశ్వసనీయ సమాచారం మేరకు ఓ ఇంటిపై పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా మొహమ్మద్‌ సర్వార్‌ అలియాస్‌ రహీమ్‌ (30), మొహమ్మద్‌ రబ్బాని (32)లను అరెస్టు చేశారు. వారి నుంచి మొత్తం 77 వేల700 నిద్రమాత్రలు, 170 చాకో దగ్గు సిరప్‌ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మందుల విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని తెలిపారు. 

స్వాధీనం చేసుకున్న వాటిలో నిట్రాజోమ్‌ 10 ఎంజీకి చెందిన 49 వేల 200 టాబ్లెట్లు, నిట్‌కోర్‌ 10 ఎంజీకి చెందిన 18వేల 300 టాబ్లెట్లు, నైట్రావెట్‌ 10 ఎంజీకి చెందిన 10 వేల200 టాబ్లెట్లు, 170 దగ్గు సిరప్‌ బాటిళ్లు ఉన్నాయని వెల్లడించారు. నిందితులు బీదర్‌ నుంచి భారీ మొత్తంలో నిద్రమాత్రలు, దగ్గు సిరప్‌లను హైదరాబాద్‌కు తీసుకువచ్చి, వైద్యుల ప్రిస్క్రిప్షన్‌ లేకుండానే అక్రమంగా విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు.

ఇటీవల మాంగర్‌ బస్తీలో నిర్వహించిన కార్డన్‌ సెర్చ్‌ సందర్భంగా పలువురు గంజాయి సేవించినట్లు గుర్తించిన పోలీసులు, ఈ ప్రాంతంలో మత్తు పదార్థాల అక్రమ వినియోగంపై నిఘా పెంచారు. ఈ క్రమంలో అందిన సమాచారంతో నిర్వహించిన దాడిలో నిద్రమాత్రలు, దగ్గు సిరప్‌ల అక్రమ విక్రయాల గుట్టు రట్టయింది. మత్తు కోసం ఈ మందులను యువత, నేరస్థులు వినియోగిస్తున్నట్లు నిందితులు వెల్లడించారని శ్రీనివాస్‌ 

ALSO READ : పాక్ ప్రభుత్వ ఆస్పత్రిలో భారీ నిర్లక్ష్యం..

వీటిని అధిక మోతాదులో వినియోగిస్తే వ్యక్తి తనపై తాను నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉందని, మత్తులో దొంగతనాలు, ఇతర నేరాలకు పాల్పడే అవకాశముందని హెచ్చరించారు. ఈ కేసులో జమ్ము భాయ్‌, మహధరి, వీర్ధరి, ఎచ్చధరి, అమన్‌లాల్‌, కోహినూర్‌ అనే మరో ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. 

బీదర్‌లోనూ నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ మందులను ఎంతమందికి విక్రయించారు? అక్రమ సరఫరా వెనుక ఉన్న నెట్‌వర్క్‌ ఏమిటి? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్‌ లేకుండా నిద్రమాత్రలు, దగ్గు సిరప్‌లను కొనుగోలు చేయవద్దని హైదరాబాద్‌ పోలీసులు ప్రజలకు సూచించారు. ఇలాంటి మందుల అక్రమ విక్రయాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.