డాక్టర్ల నిర్లక్ష్యం ఖరీదు నాలుగేళ్ల చిన్నారి ప్రాణం.. పేరుకు ముందు డాక్టర్ను తీసేయండి: సుప్రీం ఆగ్రహం

డాక్టర్ల నిర్లక్ష్యం ఖరీదు నాలుగేళ్ల చిన్నారి ప్రాణం..  పేరుకు ముందు డాక్టర్ను తీసేయండి: సుప్రీం ఆగ్రహం

అత్యాచార ఘటన బాధితురాలి పట్ల డాక్టర్లు వ్యవహరించిన తీరుపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు అసలు మనుషులేనా..? మీ పేరుకు ముందు డాక్టర్ అనే పదం ఎందుకు.. వెంటనే తొలగించండి.. అంటూ గట్టిగా మందలించింది. డాక్టర్ల తీరుపై.. సుప్రీం కోర్టు వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

ఘజియాబాద్ లో ఇటీవల నాలుగేళ్ల మైనర్ పై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లగా చేర్చుకోవడానికి నిరాకరించారు వైద్యులు.  పాపం గుండెలు బాదుకుంటూ ఆ కుటుంబం బాలికను రెండు ప్రైవేట్ ఆసుపత్రులకు తీసుకెళ్లారు. అక్కడ కూడా చేర్చుకోవడానికి హాస్పిటల్ యాజమాన్యాలు నిరాకరించాయి. దీంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే బాలిక చనిపోయింది.  

అత్యాచారానికి గురైన తమ బిడ్డ రెండు గంటల పాటు బతికే ఉందని, సకాలంలో చికిత్స అందించి ఉంటే ప్రాణాలను కాపాడి ఉండేవారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం మానవత్వం చూపని డాక్టర్లపై కేసు వేశారు. ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టు సిట్ ఏర్పాటు చేసింది.

ఆసుపత్రులు సకాలంలో వైద్యం  అందించలేదన్న అతని ఆరోపణలలో నిజం ఉందని సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)  తేల్చింది. మీరు మీ డ్యూటీని సరిగ్గా చేయనప్పుడు, మీ బాధ్యత మీరు నిర్వర్తించనప్పుడు  మీ పేరు ముందు డాక్టర్ అని రాసుకునే హక్కు మీకు లేదు అని చీఫ్ జస్టిస్  ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మీకు మానవత్వం ఉండి ఉంటే,  ఆ బిడ్డను చేర్చుకునేవారు.  వాళ్లు పేద వాళ్లు కావడం.. ఫీజు భరించలేకపోవడం వల్ల మీరు పట్టించుకోలేదు.. అని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. దీనికి శిక్షగా, బాధితురాలి కుటుంబానికి స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వాలని కోర్టు ఆసుపత్రులకు సూచించింది. అలా చేయని పక్షంలో ఖర్చులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

ఈ కేసులో పోలీసుల పాత్ర కూడా సుప్రీంకోర్టు పరిశీలనలోకి వచ్చింది. ఘటన జరిగిన వెంటనే బాలిక కుటుంబం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది., కానీ  పోలీసులు కేసు విచారణకు స్వీకరించకపోగా, ప్రశ్నించినందుకు భౌతిక దాడి చేశారని ఆరోపణలు ఉన్నాయి.

ఘజియాబాద్ లో సంచలనం సృష్టించిన ఈ అత్యాచార ఘటనపై  తీవ్ర నిరసనలతో, మరుసటి రోజే మార్చి 17న ఎఫ్ఐఆర్ నమోదు చేసి, మార్చి 18న నిందితుడిని అరెస్టు చేశారు.