పెళ్లి అనేది జీవితంలో ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెళ్లి సంబంధాలు చూడటం మొదలుకొని... అప్పగింతల వరకు ప్రతి మూమెంట్ ఓ స్వీట్ మెమరీ. ఒకప్పుడు బంధువులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ద్వారా సంబంధాలు కుదుర్చుకొని పెళ్లి చేసుకునేవారు కానీ.. ఇప్పుడు అలా లేదు పరిస్థితి. పెళ్లి సంబంధాల కోసం మాట్రిమోనీ యాప్స్, మ్యారేజ్ బ్యూరోల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. మాట్రిమోనీ యాప్స్, మ్యారేజ్ బ్యూరోల ముసుగులో స్కామ్స్ కూడా జరుగుతున్నాయి. మ్యారేజ్ బ్యూరోకి డబ్బులు కట్టి తొమ్మిదేళ్లు చెప్పులు అరిగేలా తిరిగినా లాభం లేకపోవడంతో కన్స్యూమర్ ఫోరమ్ ను ఆశ్రయించాడు బాధితుడు. కేరళలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...
2016లో కేరళలోని కన్నూర్కు చెందిన 40 ఏళ్ల వ్యక్తి మ్యారేజ్ బ్యూరోలో పెళ్లి సంబంధాల కోసం డబ్బులు చెల్లించాడు. ఆ తర్వాత కాసరగోడ్ నుండి తనకు తగిన వధువు ఉందని చెప్పారు మ్యారేజ్ బ్యూరో సిబ్బంది, కానీ ఆ తర్వాత వారి నుండి ఎటువంటి స్పందన రాలేదు. ఫిర్యాదుదారుడి తండ్రి క్యాన్సర్ తో బాధపడుతూ, తన కొడుకు పెళ్లి చూడాలని చాలా కాలంగా ఎదురుచూశారు. అయితే, ఆ కోరిక నెరవేరలేదు, అతని తండ్రి గత సంవత్సరం కన్నుమూశారు.
ఈ క్రమంలో రిజిస్ట్రేషన్ ఫీజు వాపసు కోరుతూ, అలాగే తన విలువైన సమయం మరియు మానసిక ప్రశాంతత కోల్పోయినందుకు అదనంగా రూ.15వేలు చెల్లించాలని వినియోగదారుల ఫోరమ్ ను ఆశ్రయించాడు బాధితుడు. రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.వేలు, మానసిక వేదనకు పరిహారంగా రూ.3వేలు ఖర్చుల కింద రూ. 2వేలు చెల్లించాలని జిల్లా వినియోగదారుల ఫోరమ్ బ్యూరోను ఆదేశించింది.
ఈ కేసులో ప్రతివాదిగా ఉన్న వివాహ బ్యూరో అధికారులు ఫోరం ముందు హాజరు కానందున, బాధితుడు సమర్పించిన సాక్ష్యాధారాల ఆధారంగా తీర్పునిచ్చింది కన్స్యూమర్ ఫోరమ్. నెలలోగా ఆ మొత్తాన్ని చెల్లించాలని ఫోరం బ్యూరోను ఆదేశించింది. నిర్దేశించిన గడువులోగా చెల్లింపు చేయని పక్షంలో, ఉత్తర్వు తేదీ నుండి 9శాతం వార్షిక వడ్డీ వసూలు చేయాలని కూడా పేర్కొంది ఫోరమ్.
