మహానుభావుడు: 1 + 1.. 2 కాదంట.. అది మన భ్రమ అంట.. నిత్యానంద కొత్త లెక్కలు..!

మహానుభావుడు: 1 + 1.. 2 కాదంట.. అది మన భ్రమ అంట.. నిత్యానంద కొత్త లెక్కలు..!

ఇన్నాళ్లూ 1 + 1=2 అనుకున్నాం. కానీ.. అదంతా మన భ్రమ అని వివాదాస్పద నిత్యానంద తేల్చి పారేశారు. ఒకటి, ఒకటి కలిస్తే రెండు కాదు. 'ఒకటి ప్లస్ ఒకటి రెండు అవుతుంది' అనేది మీ మనస్సు చెప్పే అబద్ధం; అనంతాన్ని మర్చిపోవడానికి అది అలా చెబుతుంది. ఒకటి ప్లస్ ఒకటి అంటే కేవలం ఒకటి ప్లస్ ఒకటి మాత్రమే అంతే. అక్కడ 'రెండు' అనేదే ఉండదు.

పరమాద్వైతంలో 'నేను' (అహం) కూడా కరిగిపోయి, కేవలం 'నేను ఉన్నాను' (అస్తిత్వం) అనే భావన మాత్రమే మిగులుతుంది. 'రెండు' అనేది కేవలం మీ మనస్సులో మాత్రమే ఉంటుంది. అది ఒక ప్రేతం, ఒక భ్రమ, లేదా ఒక కల్పితం; అనంతం అనే భావనపై కలిగే భయాన్ని తట్టుకోలేక మీ మనస్సు సృష్టించుకున్న ఒక సౌకర్యవంతమైన కల్పన అది.’’ అని నిత్యానంద తన ‘ఎక్స్’ ఖాతా వేదికగా గణితాతీతంగా కొత్త లెక్కలు చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా.. నిత్యానంద ప్రకటిత దేశమైన కైలాస నుంచి అతని ప్రతినిధులు తమిళనాడుకు వెళ్లి టీవీకే ప్రభుత్వంలోని కొందరు మంత్రులను కలిశారు. తమిళనాడు ప్రభుత్వంతో దౌత్య సంబంధాలపై తన ప్రతినిధులు చర్చించారని, తాను కైలాసంపై రాసిన ఒక చారిత్రక పుస్తకాన్ని మంత్రులకు బహుకరించారని నిత్యానంద చెప్పుకొచ్చారు. సనాతన ధర్మ పునరుద్ధరణ, పరిరక్షణ ఆవశ్యకతపై తాను రాసిన పుస్తకం దృష్టి సారించేలా చేస్తుందని నిత్యానంద చెప్పడం కొసమెరుపు.

2019లో అత్యాచారం, చిన్నారుల అక్రమ రవాణా కేసుల్లో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరైన నిత్యానంద ఇండియా నుంచి పారిపోయిన సంగతి తెలిసిందే. ఇండియా నుంచి కనుమరుగైన కొన్నాళ్లకు ‘కైలాస' దేశం స్థాపించినట్లు ప్రకటించాడు. ఐక్యరాజ్యసమితి సమావేశాలకు ఈ ఉనికి లేని 'కైలాస' దేశం నుంచి ప్రతినిధులు కూడా హాజరయ్యారు. అంతర్జాతీయ నేతలతో ఫొటోలకు ఫోజులిచ్చారు. మన దేశం నుంచి పారిపోయే లోపు నిత్యానంద పేరు ఎలా మారుమోగిందో తెలిసే ఉంటుంది. సినీ నటి రంజితతో నిత్యానంద రాసలీలలు సాగిస్తున్న వీడియో బయటకు రావడం అప్పట్లో పెద్ద సంచలనం.

ఇప్పుడు ఉన్నంత యాక్టివ్గా 2010లో సోషల్ మీడియా లేదు గానీ న్యూస్ ఛానల్స్లో నిత్యానంద, రంజితల రాసలీలల వీడియో హల్చల్ చేసింది. తమిళ ఛానల్ SUN TV తొలుత ఆ వీడియో రికార్డింగ్ను బయటపెట్టింది. తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా కూడా అప్పట్లో నిత్యానంద రాసలీలల ఎపిసోడ్ చర్చనీయాంశమైంది. ఆ వీడియో ఎవరో దురుద్దేశపూర్వకంగా సృష్టించారని, అందులో ఉన్నది తానూ, రంజిత కాదని నిత్యానంద చెప్పుకొచ్చాడు. అయితే.. ఫోరెన్సిక్ కూడా ఆ వీడియోలో ఉంది నిత్యానంద, రంజితలేనని తేల్చి చెప్పడంతో ఈ రాసలీలల సాములోరి బాగోతం బయట ప్రపంచానికి తెలిసింది.