టెక్ దిగ్గజం మెటా మరో కొత్త వివాదంలో చిక్కుకుంది. ఈసారి 26 మంది మాజీ ఉద్యోగులు కంపెనీపై అమెరికాలోని ఫెడరల్ కోర్టును ఆశ్రయించారు. ఉద్యోగుల తొలగింపుల సమయంలో కంపెనీ ఏఐ టూల్స్, ఆటోమేటెడ్ పనితీరు అంచనా వ్యవస్థలను ఉపయోగించి తప్పుడు నిర్ణయాలు తీసుకుందని ఆరోపించారు. ముఖ్యంగా వైద్య సెలవులో ఉన్నవారు, గర్భిణీలు, దివ్యాంగ ఉద్యోగులు అన్యాయానికి గురయ్యారని పిటిషన్‌లో పేర్కొన్నారు. గతంలో మెటా ప్రపంచవ్యాప్తంగా 8వేల మంది ఉద్యోగులను తొలగించిన నేపథ్యంలో ఈ కేసు ప్రాధాన్యం సంతరించుకుంది.
ఉద్యోగుల పనితీరును అంచనా వేయడానికి మెటా డిజిటల్ ప్రొడక్టివిటీ డేటా, AI టూల్స్ వినియోగం, ఇతర ఆటోమేటెడ్ మెట్రిక్స్‌ను ఉపయోగించిందని మాజీ ఉద్యోగులు తమ పిటిషన్‌లో వెల్లడించారు. ఆరోగ్య సమస్యలు, మెటర్నిటీ లీవ్స్, ఫ్యామిలీ ఇబ్బందులతో కొంతకాలం పని నుంచి దూరంగా ఉన్న ఉద్యోగుల పనితీరు సహజంగానే తగ్గిందని, కానీ ఆ పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా ఏఐ ఆధారిత అంచనాలతో తక్కువ రేటింగ్ ఇచ్చారని ఉద్యోగులు ఆరోపించారు. ఆ తక్కువ రేటింగ్‌లనే ఉద్యోగాల కోతకు బేస్ గా ఉపయోగించారని ఆరోపించారు. దీంతో అమెరికా ఉద్యోగ చట్టాలను మెటా ఉల్లంఘించిందని కోర్టుకు వెల్లడించారు.
అయితే ఈ ఆరోపణలను మెటా పూర్తిగా ఖండించింది. ఉద్యోగులను తొలగింపులో ఫైనల్ డెసిషన్స్ AI తీసుకోలేదని, కంపెనీ అధికారులు, మేనేజ్‌మెంట్ మాత్రమే తీసుకున్నారని స్పష్టం చేసింది. AI లేదా ఆటోమేటెడ్ టూల్స్ ఉద్యోగుల తొలగింపును నిర్ణయించలేదని, మాజీ ఉద్యోగుల ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని కంపెనీ చెబుతోంది. సో కోర్టులో ఈ ఆరోపణలను చట్టపరంగా ఎదుర్కొంటామని మెటా ప్రకటించింది.
ఈ కేసు వెలుగులోకి రావడానికి కొద్ది రోజుల ముందే మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కంపెనీ పునర్వ్యవస్థీకరణపై మాట్లాడారు. ఏఐ అభివృద్ధి వేగాన్ని అంచనా వేయడంలో కంపెనీ కొన్ని పొరపాట్లు చేసిందని అంగీకరించారు. ఉద్యోగాల కోతలతో పాటు వేలాది మంది ఉద్యోగులను ఏఐప్రాజెక్టులకు బదిలీ చేసినట్లు వెల్లడించారు. ఇప్పుడు మాజీ ఉద్యోగుల కేసుతో AI వాడకం, ఉద్యోగుల పనితీరు అంచనా, లేఆఫ్స్‌లో పారదర్శకత వంటి అంశాలపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. ఈ కేసులో కోర్టు ఇచ్చే తీర్పు భవిష్యత్తులో కీలక ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
